
చందా ఇవ్వనందుకు దళిత కుటుంబాల గ్రామబహిష్కరణ
జగిత్యాలలో నాలుగు దళిత కుటుంబాలపై అమానవీయం
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.
గణపతి నవరాత్రులకు చందా ఇ వ్వలేదన్న సాకుతో కల్లెడ గ్రామంలో నాలుగు కుటుంబాలను వెలివేశారు. స్వాతంత్యోద్యమంలో ప్రజలను ఏకతాటిపై తేవడానికి గణపతి ఉత్సవాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నాలుగు కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25 వేల రూపాయలు జరిమానా కట్టాలని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు.బహి ష్కరణకు గురైన వారితో ఎవరైనా మాట్లాడినట్టు సమాచారం అందించిన వారికి ఐదు వేల నజరానా ప్రకటించారు. గ్రామానికి చెందిన గాలిపెల్లి అరుణ్, గంగ లచ్చయ్య, అంజి, సూర్యవంశీ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని డప్పు వేయించారు.
దేవుడికి కొబ్బరి కాయ కొట్టడానికి వచ్చిన ఒక్కో కుటుంబం వేయి నూట పదహారు చెల్లంచాలని గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. దళిత కుటుంబాలు చందా ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో వారిని గ్రామ బహిష్కరణ చేశారు. బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. గ్రామ బహిష్కరణ చేసిన వారిపై కేసు నమోదయ్యింది.
నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో దళిత కుటుంబాలు గ్రామ బహిష్కరణకు గురి కావడం చర్చనీయాంశమైంది.