ప్రజావాణికి మంత్రి బోణి..
గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. వారంలో రెండు రోజులు కచ్ఛితంగా ఒక మంత్రి హాజరుకానున్నారు.
ప్రజల సమస్యలు తీర్చడానికి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈరోజు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అదే విధంగా వాటి పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ప్రజల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిస్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇకపై వారానికి రెండు రోజుల పాటు ప్రజావాణి కార్యక్రమంలో ఎవరో ఒక మంత్రి తప్పనిసరిగా పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడాలని, అందుకే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ వివరించారు. ఈ విషయంపై టీపీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా కీలక ప్రకటన చేశారు. వారంలో రెండు రోజులు తప్పకుండా ఎవరో ఒక మంత్రి ప్రజావాణికి హాజరు కావాలని ఆయన తెలిపారు. ఇందుకు ప్రతి మంత్రి సమ్మతించారు కూడా. ఇందులో భాగంగానే ప్రజావాణికి మంత్రి వచ్చే సంప్రదాయానికి దామోదర రాజనర్సింహ బోణీ కొట్టారు.
అందుకే ఈ నిర్ణయం..
ప్రజావాణి కార్యక్రమంలో మంత్రులు పాల్గొనాల్సి ఉన్నప్పటికీ అది తప్పనిసరి కాకపోవడంతో మంత్రులు ఈ కార్యక్రమానికి రావడం చాలా అరుదుగా మారింది. అది కాస్తా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మంత్రులకు మధ్య దూరం పెంచుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ భావించారు. దీంతో వారంలో రెండు రోజులు ఎవరో ఒక మంత్రి ప్రజావాణికి హాజరు అయ్యేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ క్రమంలోనే తప్పకుండా వారంలో రెండు రోజుల పాటు ఎవరో ఒక మంత్రి తప్పనిసరిగా ప్రజావాణికి హాజరు కావాలని సీఎం రేవంత్.. క్యాబినెట్ సమావేశం నిర్వహించి చెప్పారు. దానికి తోడు ప్రజావాణిపై నెగిటివ్ ఇంప్రెషన్ కూడా పెరుగుతున్న క్రమంలో మంత్రులు చొరవ తీసుకోవాలని, ప్రజావాణిలో పాల్గొని ప్రజలకు ప్రభుత్వం నమ్మకం తీసుకురావాలని రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. అందుకు మంత్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం ఆచరణలో పడింది.
ఆ విషయాలు తెలుసుకోవడానికే..
ప్రతి బుధ, శుక్ర వారాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో తప్పకుండా ఒక మంత్రి పాల్గొననున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ఆయన గాంధీ భవన్‌కు చేరుకున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు, ప్రజలతో మంత్రులు ముఖాముఖి నిర్వహించనున్నారు. అలా చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని టీపీసీసీ పేర్కంటోంది. చిట్టచివరి లబ్ధి దారుని వరకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్న అంశాన్ని ప్రజావాణి కార్యక్రమంలో తెలుసుకోవడం సులభతరం అవుతుందని, అదే విధంగా మంత్రులతో ముఖాముఖి కావడం తమ సమస్యలు చెప్పుకునే వెసులుబాటు కలగడంతో పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న స్పందనను కూడా వెంటనే పసిగట్టగలుగుతామని, అప్పుడే ప్రజల కోరికల మేరకు పాలనను కొనసాగించడానికి వీలవుతుందని ఆయన వివరించారు.
ప్రజావాణిపై పెదవి విరుస్తున్న ప్రజలు..
అయితే మరోవైపు ప్రజావాణి పనితీరుపై ప్రజలు పెదవి విరుస్తుండటం గమనార్హం. ప్రజావాణిలో సమస్య వివరించుకుంటే అది పరిష్కారం అవుతుందన్న నమ్మకం ప్రజల్లో కనిపించడం లేదు. అనేక సమస్యలు అపరిష్కృతంగా మిగిలి పోతున్నాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. వంద ఫిర్యాదులు అందితే వాటిలో పట్టుమని పది ఫిర్యాదులు కూడా పరిష్కారం కావడం లేదు. దీంతో ప్రజలు ప్రజావాణిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెగ్యులర్‌గా ప్రజావాణి జరుగుతుందే తప్ప తమ సమస్యల పరిష్కారం కాదని, సమస్యల పరిష్కారాలపై అధికారులు రివ్యూలు కూడా చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాలను బలపర్చడానికి టీపీసీపీ.. గాంధీభవన్‌కు ఒక మంత్రి అయినా తప్పకుండా రావాలి అన్న నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ సమస్యను వివరించి చెప్పడంతోనే ప్రజల్లో మళ్ళీ పట్టు సాధించడం కోసం వారంలో రెండు రోజుల పాటు ఎవరో ఒకరు మంత్రి ప్రజావాణికి హాజరు కావాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.