హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో భద్రతపై సర్కార్ కీలక నిర్ణయం
x

హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో భద్రతపై సర్కార్ కీలక నిర్ణయం

ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలలో భద్రత బలోపేతం చేయడంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రివ్యూ


ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలలో భద్రత బలోపేతం చేయడంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రివ్యూ నిర్వహించారు. సోమవారం సచివాలయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రత ను కట్టుదిట్టం చేసి, ఆస్పత్రి సిబ్బందికి ముఖ్యంగా మహిళా డాక్టర్లు, మహిళా నర్సింగ్ స్టాఫ్, సిబ్బందికి రక్షణగా షీ టీం లతో రాత్రి సమయాలలో పెట్రోలింగ్ చేసేలా నిబంధనలు రూపొందించాలని మంత్రి ఈ సమీక్షలో అధికారులను ఆదేశించారు.

అన్ని టీచింగ్ హాస్పిటల్స్ లో అవుట్ పోస్టు లు శాశ్వత ప్రాతిపదికన నిర్మించడానికి చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న TIMS ఆసుపత్రులలో ఇప్పటికే పోలీస్ అవుట్ పోస్టులను నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించామన్నారు. రాష్ట్రంలో 10 టీచింగ్ హాస్పిటల్స్ లో ఇప్పటికే పోలీస్ అవుట్ పోస్టులను నిర్మించడం జరిగిందన్నారు.

ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు తప్పనిసరిగా PSAR (ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ - రెగ్యులేషన్స్) Act - 2015 ప్రకారం గుర్తింపు పొంది ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో అన్ని స్థాయిల ( PHC స్థాయి నుండి అన్ని ఏరియా హాస్పిటల్ ల వరకు) ఆస్పత్రులలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు CC కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్ లకు అనుసంధానం చేయాలని చెప్పారు. భద్రతపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపొందించాలన్నారు.

ఆస్పత్రి వైద్య శాఖ అధికారులు, స్థానిక పోలీసులు సమన్వయం చేసుకొని భద్రత బలోపేతం దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఆస్పత్రులలో మహిళా డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, సిబ్బంది భద్రతపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల పై హాస్పిటల్ సేఫ్టీ కమిటీని నియమించాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో హాస్పిటల్స్ సేఫ్టీ కమిటీ భద్రతాపరమైన నియమాలను రూపొందించాలని కోరారు. ఈ నెల సెప్టెంబర్ 14వ తేదీ లోపు రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు.

అలాగే, ఆస్పత్రి వైద్యులు నర్సులు భద్రతలో భాగంగా నమోదైన కేసులను యాక్ట్ 11 ఆఫ్ 2008 ప్రకారం రిజిస్టర్ చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను వెంటనే సమర్పించాలని కోరారు. ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కేసుల విచారణ వేగవంతం అయ్యేలా కృషి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హోం శాఖ, వైద్య ఆరోగ్యశాఖ విడివిడిగా సంయుక్తంగా చేపట్టాల్సిన చర్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి ఆసుపత్రిలో సెక్యూరిటీ హౌజ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సమీక్షలో రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్, రాష్ట్ర ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి, రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, MNJ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, SPF అధికారి త్రినాథ్ పాల్గొన్నారు.

Read More
Next Story