జీవో 33 పై వైద్యశాఖ మంత్రి క్లారిటీ
x

జీవో 33 పై వైద్యశాఖ మంత్రి క్లారిటీ

ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ క్లారిటీ ఇచ్చారు.


ఇటీవల తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల విషయంలో 33 జీవో పై వివాదం నెలకొంది. కొత్త నిబంధనల ప్రకారం తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ క్లారిటీ ఇచ్చారు. జీవో 33తో స్థానిక విద్యార్థులు నష్టపోతారంటూ మాజీ మంత్రి కేటీఆర్ 'ఎక్స్' వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి స్పందించారు.

ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు సంబంధించి 2017 జులై 5న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 114ని ప్రస్తావించిన మంత్రి.. ఆ జీవోలోని 9 నుంచి 12 తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తూ చేసిన నిబంధనను జీవో 33లో కొనసాగించామని పేర్కొన్నారు. అయితే, అదే జీవోలోని 6 నుంచి 12 వరకు కనీసం నాలుగేళ్లు విద్యార్థులు చదివిన ప్రాంతానికి స్థానికతను వర్తింపజేయాలన్న నిబంధనను కొనసాగించలేమని మంత్రి స్పష్టం చేశారు. జీవో 114లోని ఈ నిబంధన ప్రకారం విద్యార్థి నాలుగేళ్లు తెలంగాణలో.. మిగిలిన మూడేళ్లు ఏపీలో చదివితే వారిని తెలంగాణ స్థానికులుగా పరిగణించారని గుర్తు చేశారు. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జూన్ 2తో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో నిబంధనను కొనసాగించలేమని మంత్రి స్పష్టం చేశారు.

అసలు వివాదం ఏంటంటే...?

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనల వలన స్థానికులకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ నెల 3న కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇక్కడ విద్యాసంస్థల అడ్మిషన్లలో 2014 నుంచి 2024 వరకు ఏపీ విద్యార్థులకు కోటా ఉన్నది. ఈ ఏడాదితో విభజన చట్టంలోని గడువు ముగియడంతో కాళోజి యూనివర్సిటీ తాజా అడ్మిషన్ల ప్రక్రియ కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో స్థానికతపై గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం జులై 19న జారీ చేసిన 33 జీవో ప్రకారం స్థానికత నిబంధనలు మార్చినట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది.

33 జీవోతో మాకు అన్యాయం జరిగేలా ఉందని తెలంగాణ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తామని నోటిఫికేషన్లో పేర్కొనడంతో వివాదం చెలరేగింది. 2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడేళ్ల కాలంలో గరిష్ఠంగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణలోకి తీసుకునేవారు. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి స్థానికతలో చేసిన మార్పులతో తెలంగాణ వారికే ఎక్కువ అన్యాయం జరగనుందనే ఆరోపణలు వస్తున్నాయి.

కేటీఆర్ ఏమన్నారంటే...

మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా? అని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందన్నారు. జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయన్నారు. 9 వ తరగతి నుంచి 12 తరగతి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారు. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందన్నారు.

"2023-24 విద్యాసంవత్సరం వరకు 6 వ తరగతి నుంచి 12 తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించాం. దాని కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియేట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారు లోకల్ గానే పరిగణించబడే వారు. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారు. దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా...గతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read More
Next Story