ముదిరిన దానం కేసు వివాదం...
జీహెచ్ఎంసీ అధికారులు తనపై కేసు పెట్టడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు.
జీహెచ్ఎంసీ అధికారులు తనపై కేసు పెట్టడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు. ఏవీ రంగనాథ్ కాదు కదా ఎవడూ నన్నేం చేయలేడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లు ఉంది, అందుకే నాపైన కేసు పెట్టాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ నేను లోకల్ నన్ను ఎవడూ ఏం చేయలేడు అంటూ సినిమా డైలాగ్స్ చెప్పారు.
జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహరీని కూల్చివేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేసుపై స్పందించారు. "నందగిరిహిల్స్ హుడా లే ఔట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నేను అక్కడకి వెళ్ళాను. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ అన్నివర్గాల ప్రజలకు సౌకర్యాలు, సమస్యలు నెరవేర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. కేసు పెట్టిన అధికారులకు ప్రివిలేజీషన్ నోటీసులు ఇస్తాను, వారి పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాను. ప్రజాప్రతినిధిగా నాకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది... నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు" అంటూ దానం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే...
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 69 నందగిరి హిల్స్ లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహరీని ఈ నెల 10న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు గుర్తించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గురుబ్రహ్మ నగర్ కి చెందిన గోపాలనాయక్, రాంచందర్ తదితరులు కూల్చివేత ఘటనలో ఉన్నారని, ఎన్ఫోర్స్మెంట్ ఇన్చార్జి పాపయ్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రహరీ కూల్చివేతతో రూ. 10 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు దానం నాగేందర్, గోపాల్ నాయక్, రాంచందర్ లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.