
భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి నది: రెండవ హెచ్చరిక జారీ
తెలంగాణలో మూడు నదుల వద్ద ప్రమాద హెచ్చరికలు...బిగ్ అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, భద్రాచలం, సిర్పూర్ ప్రజలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంతోపాటు పలు నదుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలోని గోదావరి, వార్ధా, మూసీ నదుల్లో వరదనీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగరంలో ఉస్మాన్ సాగర్ జలాశయం రెండు గేట్లు తెరవడంతో వరదనీరు మూసీలో ప్రవహిస్తోంది. మరో వైపు గోదావరిలో వరదనీటి మట్టం గంటగంటకు పెరుగుతూ ప్రమాదకర స్థాయికి చేరింది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని వార్థానది నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో మూడు ప్రాంతాల్లోనూ అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు.
భద్రాచలంలో గోదావరి నది వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి నదీ ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల గోదావరి నదిలో వరదనీరు అధికంగా ప్రవహిస్తోందని తెలంగాన నీటిపారుదల శాఖ అధికారులు గురువారం ఉదయం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. భద్రాచలం బ్రిడ్జి వద్ద గోదావరి నది నీటి మట్టం 48.00 అడుగులకు చేరుకుంది. నదిలో 11,44,645 క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తుంది. దీంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గోదావరి నదీ తీర ముంపు గ్రామాల ప్రజలను సహాయ పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.
గోదావరి నదిలో నీటి మట్టం 2022వ సంవత్సరంలో 71.30 అడుగులకు చేరింది. 24.43 క్యూసెక్కుల వరదనీరు ప్రవహించడంతో నదీ తీర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. 1986వ సంవత్సరంలో గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద అత్యధికంగా 75.60 అడుగులకు చేరింది. అప్పట్లో27.02 క్యూసెక్కుల వరదనీరు గోదావరిలో ప్రవహించడంతో వందలాది గ్రామాలు జలమయం అయ్యాయి.
అప్రమత్తంగా ఉండండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.బుధవారం రాత్రి 10:05 నిమిషాలకు 48.00 అడుగులకు చేరి రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చెప్పారు. గోదావరి నది ప్రమాదకర స్తాయిలో ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పాటిల్ కోరారు.
వార్థానదిలో వెల్లువెత్తిన వరదలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పట్టణ సమీపంలోని వార్థా నదిలో గురువారం ఉదయం వరదలు వెల్లువెత్తాయి. వార్థా నది ఎగువ పరివాహక ప్రాంతం అయిన మహారాష్ట్రలో అతి భారీవర్షాలు కురుస్తున్నందున వార్థానది సిర్పూర్ పట్టణం వద్ద 159. 95 అడుగులకు చేరింది. వార్థానదిలో నీటిమట్టం 160.95 మీటర్లకు చేరితే ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ప్రస్థుతం వార్థానది నీటిమట్టం ప్రమాద హెచ్చరికకు 0.22 మీటర్లు తక్కువగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. వార్థానదిలో గంటగంటకు వరదనీటి మట్టం పెరుగుతుండటంతో సిర్పూర్ పట్టణంలో అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఉస్మాన్ సాగర్ గేట్లు తెరచి 220 క్యూసెక్కుల నీటి విడుదల
భారీవర్షాలు కురుస్తుండటంతో ఉస్మాన్ సాగర్ మంచినీటి జలాశయంలోకి వరదనీరు భారీగా చేరుతుంది. దీంతో ఉస్మాన్ సాగర్ జలాశయంలోని రెండు గేట్లు తెరచి 220క్యూసెక్కుల వరదనీటిని మూసీనదిలోకి వదులుతున్నారు. వరదనీరు విడుదల చేయడంతో మూసీ తీర ప్రాంత కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు గురువారం హెచ్చరిక జారీ చేశారు.
తెలంగాణలో మోస్తరు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు,నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ధర్మరాజు వివరించారు. ఈ సందర్బంగా గురువారం తెలంగాణలోని 18 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశామని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
Next Story