హైదరాబాద్ అసద్ మంజిల్ లో అసలేం జరుగుతోంది?
x
ఇదీ హైదరాబాద్ డాక్టర్ మొహియుద్దీన్ నివాసం అసద్ మంజిల్, ఏటీఎస్ స్వాధీనం చేసుకున్న పదార్థాలు

హైదరాబాద్ అసద్ మంజిల్ లో అసలేం జరుగుతోంది?

ఒంటరి డాక్టర్, రహస్య ల్యాబ్, రిసిన్ కుట్ర, ఇదీ అసద్ మంజిల్‌ ఉగ్ర ఛాయలు


హైదరాబాద్‌ నగరంలోని నిశ్శబ్ద కాలనీలో ఉన్న ఒక సాధారణ ఇంటి వెనుక ఇంత పెద్ద ఉగ్ర కుట్ర దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. రాజేంద్రనగర్‌లోని అసద్ మంజిల్ నుంచి రిసిన్ అనే ప్రాణాంతక విషపదార్థాన్ని తయారు చేసి దేశవ్యాప్తంగా ప్రజలను లక్ష్యంగా చేసుకున్నాడని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ కేసు బయటపడడంతో నగరం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.ఇంట్లో ఒంటరిగా ఉన్నాడనుకున్నారు… కానీ అతను రహస్యంగా మృత్యు ఆయిల్ తయారు చేస్తున్నాడని ఎవరూ ఊహించలేదు.




ఇదీ డాక్టర్ నివాసం అసద్ మంజిల్

ఇదీ హైదరాబాద్ నగరం రాజేంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలోని స్ట్రీట్ నంబర్ 9లోని అసద్ మంజిల్...రిసిన్ అనే విషపు నూనె తయారు చేసి, దీని ద్వారా ప్రజలను చంపేందుకు ఉగ్ర కుట్ర పన్నిన హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (35) నివాసముంటున్న ఇల్లు ఇదీ. ఈ ఇల్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇంటి చుట్టుపక్కల వారిని, ఫోర్ట్ వ్యూ కాలనీ వాసులను ఎవరిని కదలించినా వారు పెదవి విప్పడం లేదు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు నిందితుడైన డాక్టరును అరెస్ట్ చేయడంతో సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీసులు కూడా ఈ ఇంటిపై నిఘా వేశారు.



ఆన్‌లైన్‌లో కెమికల్స్ ఆర్డర్ పెట్టిన డాక్టర్

వృత్తిరీత్యా డాక్టరు అయినా ఈ అసద్ మంజిల్ లో ఒంటరిగానే నివశిస్తూ తరచూ ఆన్ లైన్ లో కెమికల్స్ ను ఆర్డరు ద్వారా తెప్పించుకునే వాడని ఏటీఎస్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ డాక్టర్ తన గదిలో రహస్య ప్రయోగాలు, కార్యకలాపాలకు పాల్పడుతుండటం చూసిన అతని కుటుంబసభ్యులు అతనితో చాలాసార్లు గొడవ పడ్డారని వెల్లడైంది. తాను విలువైన కెమికల్ ను తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నానని డాక్టర్ మొహియుద్దీన్ తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు.

రాజేంద్రనగర్ పోలీసుల అలెర్ట్
రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫోర్ట్ వ్యూ కాలనీలో డాక్టర్ మొహియుద్దీన్ నివాసమున్నాడని ఏటీఎస్ దర్యాప్తులో తేలడంతో రాజేంద్రనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. డాక్టరు మొహియుద్దీన్ కార్యకలాపాలు, అతని పరిచయాలు, సోషల్ కనెక్షన్స్, డిజిటల్ కమ్యూనికేషన్ హిస్టరీ, నగరంలో ఉగ్రవాద లింకుల గురించి రాజేంద్రనగర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ డాక్టరు ఉగ్ర కుట్రలో నిందితుడని తేలడంతో హైదరాబాద్ నగరంలో కేంద్ర, తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి.

ఉగ్ర కుట్ర గుట్టు రట్టు
తాను నివాసముంటున్న అసద్ మంజిల్ గదినే లేబరేటరీగా మార్చి అత్యంత విషపూరితమైన రిసిన్ కెమికల్ ను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడవడం సంచలనం రేపింది.ఈ రిసిన్ విషపు ఆయిల్ ను ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో నగరాల్లోని ప్రజలకు సరఫరా చేసే నల్లా నీటిలో, దేవాలయాల ప్రసాదాల్లో కలిపి ప్రజలను చంపాలని ఉగ్ర కుట్ర పన్నినట్లు ఏటీఎస్ తేల్చింది. రిసిన్ విషానికి ఇప్పటి వరకు యాంటీ డోస్ మందులు లేకపోవడంతో ఎక్కువ మంది దీన్ని తాగిన వారు మృత్యువాత పడతారని వైద్యులు చెబుతున్నారు.

ఆయిల్ ప్రెస్ మిషన్ కొని...
ఉగ్రవాద కుట్ర కేసులో నిందితుడైన హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అరెస్టుకు కొన్ని రోజుల ముందే రిసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేసేందుకు ఆయిల్ ప్రెస్ కొన్నాడని వెల్లడైంది. తన సోదరుడు అరెస్టుకు కొన్ని రోజుల ముందే ఆయిల్ తయారు చేసే మిషీన్ ను కొని ఇంటికి తెచ్చాడని మొహియుద్దీన్ సోదరుడు సయ్యద్ ఉమర్ ఫారూఖీ చెప్పారు. ఈ మిషీన్ సాయంతో రిసిన్ విషాన్ని తయారు చేస్తున్నాడనే విషయం తమకెవరికీ తెలియదని నిందితుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు.

అరెస్ట్ ఎలా అయ్యాడంటే...
నవంబరు 5వతేదీన గుజరాత్ రాష్ట్రంలోని ఓ వినియోగదారుడికి ఆయిల్ సప్లయి చేసేందుకు అని చెప్పి తన సోదరుడు మొహియుద్దీన్ నవంబరు 5వతేదీన ఇంటి నుంచి వెళ్లాడని అతని కుటుంబసభ్యులు చెప్పారు. ఆయిల్ ను తమ కుటుంబసభ్యుల ముందే ఉత్పత్తి చేశాడని, అయినా తమకు దీనిపై ఎలాంటి అనుమానం రాలేదని అతని కుటుంబసభ్యులు చెప్పారు. నవంబరు 9వతేదీన గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో డాక్టర్ మొహియుద్దీన్ రిసిన్ ఉత్పత్తి చేసే ముడి పదార్థాలతో ఉండగా గుజరాత్ యాంటీ టెర్రిరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది.



డాక్టర్ నుంచి ఏం స్వాధీనం చేసుకున్నారంటే...

నిందితుడి నుంచి ఆముదం గింజలు, ఆముదపు కేక్, కెమికల్స్,కంప్యూటర్, ఆయిల్ తయారీ డాక్యుమెంట్లు, ఆయిల్ మిషీన్ ను రాజేంద్రనగర్ లోని డాక్టర్ ఇంటి నుంచి ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఫోర్ట్‌వ్యూ కాలనీలోని స్ట్రీట్ నంబర్ 9 అసద్ మంజిల్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఇంటి నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వస్తువుల ఫోటోలను గుజరాత్‌లోని ఏటీఎస్ విడుదల చేసింది. డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తన ఇంటిని ప్రయోగశాలగా మార్చి, భారీ స్థాయిలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి అత్యంత విషపూరితమైన రసాయనమైన రిసిన్‌ను తయారు చేశాడని ఏటీఎస్ వెల్లడించింది.

ఉగ్ర కుట్రలో కీలక నిందితుడు..ఈ డాక్టర్
ఫోర్ట్‌వ్యూ కాలనీలోని అసద్ మంజిల్‌లో నివసిస్తున్న ప్రధాన నిందితుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (35) ఈ కుట్రలో కీలక వ్యక్తి అని దర్యాప్తు అధికారులు చెప్పారు. డాక్టరు అయిన మొహియుద్దీన్ ఒంటరిగా నివసించేవాడని, అసాధారణ ప్రవర్తనను చూపించేవాడని ఏటీఎస్ వెల్లడించింది. ‘‘డాక్టర్ తరచుగా ఆన్‌లైన్‌లో రసాయనాలను ఆర్డర్ చేసేవాడు, అతని గదిలో రహస్య ప్రయోగాలు చేసేవాడు. అతని కార్యకలాపాలపై అనుమానం ఉన్న కుటుంబ సభ్యులు అతన్ని చాలాసార్లు ప్రశ్నించారు, కానీ అతను వాణిజ్య ఉపయోగం కోసం విలువైన రసాయనంపై పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు’’ అని అని గుజరాత్ ఏటీఎస్ వర్గాలు తెలిపాయి.

డాక్టర్ సోదరుడు ఏం చెప్పాడంటే...
తన సోదరుడు తయారు చేసిన ఆయిల్ ను గుజరాత్ వ్యక్తికి ఇచ్చి డబ్బులు అడిగితే అతను పార్శిల్ అందించాడని,అందులోనే డబ్బులున్నాయని చెప్పడంతో అతను దాన్ని చూడకుండా డబ్బులు అనుకొని కారులో పెట్టుకొని వస్తుండగా, కొద్దిసేపటికే గుజరాత్ ఏటీఎస్ అధికారులు కారు ఆపి పట్టుకున్నారని నిందితుడి సోదరుడు ఫారూఖీ చెప్పారు. పార్శిల్ లో ఆయుధాలు ఉన్నాయని తనిఖీల్లో తేలడంతో దాన్ని చూసిన తన సోదరుడు షాక్ కు గురయ్యాడని ఫారూఖ్ తెలిపారు. ఏటీఎస్ పోలీసులు చెప్పేదాకా తన సోదరుడికి రిసిన్ విషపదార్థం అని తెలియదని, అతను అమాయకుడని డాక్టర్ సోదరుడు ఫారూఖీ అంటున్నారు.

డాక్టర్ ప్రాక్టీసు వదిలి...
అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ 2007 నుంచి 2013వ సంవత్సరం వరకు చైనాలో ఎంబీబీఎస్ చదివినా ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చి డాక్టరుగా ప్రాక్టీసుపై ఆసక్తి చూపించకుండా వ్యాపారం వైపు మొగ్గు చూపాడని అతని సోదరుడు ఫారూఖీ చెప్పారు. తన సోదరుడికి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరాసన్ ప్రావిన్స్ ( ఐఎస్ కేపీ)తో నిజంగా సంబంధాలుంటే అతన్ని శిక్షించాల్సిందేనని నిందితుడి సోదరుడు ఫారూఖీ చెప్పారు. తన సోదరుడు అమాయకుడని, అతన్ని కుట్రలో ఇరికించాడని, దీనిపై దర్యాప్తు జరపాలని కోరారు. ప్రాథమిక విచారణలో డాక్టర్ మొహియుద్దీన్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఇస్లామిక్ స్టేట్ - ఖోరాసన్ ప్రావిన్స్ (ISKP) కార్యకర్త అబు ఖాదీజాతో తనకు సంబంధం ఉందని ఒప్పుకున్నాడని ఏటీఎస్ పోలీసులు చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన అనేక మంది హ్యాండ్లర్లతో కూడా తనకు సంబంధాలు ఉన్నాయని డాక్టరు అంగీకరించాడని ఏటీఎస్ పేర్కొంది.

పౌరుల భద్రతపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ హైదరాబాద్ నివాసి డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో తెలంగాణ పౌరుల భద్రతపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అరెస్టు అయిన డాక్టర్ ఉద్దేశాల గురించి సమాధానాలు కోరాలని రాజా సింగ్ రేవంత్ డిమాండ్ చేశారు. ‘‘ డాక్టర్ ఏ ఆలయంలోని నీటి ట్యాంకర్‌లో విష రసాయనాన్ని పోయాలని ప్లాన్ చేశారు? ఎవరికి హాని చేయాలని వారు ఉద్దేశించారు?” అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ‘‘బాంబు పేలుడు జరిగినప్పుడల్లా నేరస్థుడిని హైదరాబాద్‌తో సంబంధం ఉన్నట్లు కనుగొనేవారు. దురదృష్టవశాత్తు ఇక్కడ మళ్లీ ఒక ఉగ్రవాది పట్టుబడ్డాడు.’’అని రాజాసింగ్ చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి మౌనం వహించడం ఏమిటని ఆయన విమర్శించారు.

ఖమ్మం వాసులు షాక్
డాక్టర్ మొహియుద్దీన్ గతంలో కొంత కాలం ఖమ్మంలోని ఖిల్లా (ఫోర్ట్) ప్రాంతంలోని తన ఇంటి నుంచి క్లినిక్‌ను నడిపాడని ఖమ్మం పోలీసులు చెప్పారు. ఉగ్రవాద కుట్ర కేసులో సయ్యద్‌ అరెస్టు వార్త టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారం అయినప్పటి నుంచి అతని కుటుంబ సభ్యులు ఖమ్మంలో బయట కనిపించలేదు. సయీద్ అరెస్టు గురించి వారు మీడియాతో మాట్లాడటానికి వారు ఇష్టపడ లేదు. అతని తాతామామల ఇల్లు వారి నివాసానికి ఆనుకొని ఉంది.ఈ సంఘటన తర్వాత డాక్టర్ బంధువులు, స్నేహితులు నోరు విప్పలేదు. ఉగ్రవాద కుట్ర కేసులో తమ నగరానికి చెందిన డాక్టరును అరెస్టు చేయడంతో ఖమ్మం వాసులు షాక్ అయ్యారు.

దేశ భద్రతకు పెద్ద ముప్పు
డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అరెస్ట్‌తో బయటపడిన ఈ కుట్ర దేశ భద్రతకు ఎంత పెద్ద ముప్పు దాపురించిందో మరోసారి స్పష్టమైంది. ఇప్పుడు దర్యాప్తు ఏ దిశగా వెళుతుందో, అతని నెట్‌వర్క్ ఎంత పెద్దదో, ఈ విషపూరిత పథకంలో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాల్సి ఉంది. కానీ సాధారణంగా కనిపించే ఒక ఇంటి వెనుక ఇంత ఘోర మాయాజాలం దాగి ఉండటం మాత్రం ప్రజల్లో భయానక అనుమానాలను మిగిల్చింది.ఈ కేసులో ఇప్పటికే పలు కీలక విషయాలను ఏటీఎస్, ఇంటెలిజెన్స్ సంస్థలు వెలికి తీస్తున్నాయి.

రాబోయే రోజుల్లో నిందితుడి కార్యకలాపాలు, అతని నెట్‌వర్క్, విదేశీ లింకులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక డాక్టర్ చేతిలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఔషధం కాకుండా, మరణాన్ని పంచే రిసిన్ తయారవుతున్నదనే నిజం వెలుగులోకి రావడం దేశానికి తీవ్ర హెచ్చరిక. ఇప్పుడు ఈ కుట్రలో ఉన్న ప్రతి లింక్ బయటపడే వరకు దర్యాప్తు ఆగదని ఏటీఎస్ తెలిపింది. ఈ కేసు ముగింపు ఏదైనా కాని, హైదరాబాద్ నగరానికి ఈ ఘటన మాత్రం మరచిపోలేని గాయం.


Read More
Next Story