
మందుబాబులకు దసరా షాక్ తప్పదా ?
తెలంగాణలో ఫంక్షన్, కార్యక్రమం లేకపోతే పండుగ ఏదైనా కానీండి మందు, మాంసం వంటకాలు లేకుండా చాలాచోట్ల పూర్తికాదు
పండగలు అంటేనే మందుబాబులతో పాటు మాంసప్రియులు ఫుల్ జోష్ లో ఉంటారు. అలాంటిది దసరాపండుగ వస్తోందంటే ఇంకెంత హుషారుగా ఉంటారు. తెలంగాణ(Telangana)లో మిగిలిన పండుగలతో పోల్చితే దసరాపండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణలో ఫంక్షన్, కార్యక్రమం లేకపోతే పండుగ ఏదైనా కానీండి మందు, మాంసం వంటకాలు లేకుండా చాలాచోట్ల పూర్తికాదు. దసరపండుగంటే మాంస, మద్యం(Liquor) ప్రియుల హడావుడి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిది రాబోయే దసరా పండుగ మందుబాబులతో పాటు మాంసప్రియులకు కూడా పెద్ద షాక్ ఇవ్వబోతోంది. ఎలాగంటే దసరా(Dasara festival) పండుగ అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. అక్టోబర్ 2వ తేదీ అంటే గాంధీజయంతి(Gandhi Jayanti)అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు.
గాంధీజయంతి నాడు మద్యందుకాణాలు, మాంసంకొట్లు తెరవరు. గాంధీజయంతి నాడు మద్యంషాపులు తెరవరంటే అర్ధం ఉందికాని మాంసంకొట్లను ప్రభుత్వం ఎందుకు మూయించేస్తోందో అర్ధంకాదు. ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితి ప్రకారం అక్టోబర్ 2వ తేదీన మందుషాపులు, మాంసంకొట్లు మూతపడబోతున్నాయి. సరిగ్గా దసరా పండుగనాడు మందుషాపులు, మాంసంకొట్లు మూతపడితే మరి మందుబాబులకు షాక్ కొట్టదా ? ముందురోజే మద్యాన్ని కొనిపెట్టుకునే వాళ్ళుంటారు కాని అలాంటివాళ్ళ సంఖ్య తక్కువ. నిజానికి పండుగలంటే ప్రభుత్వానికి కూడా పండుగనే చెప్పాలి. ఎందుకంటే పండుగల నాడు లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరుగుతాయి. మిగిలిన పండుగలతో పోల్చితే దసరాపండుగ సందర్భంగా లిక్కర్ సేల్స్ బాగా ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. అలాంటిది రాబోయే దసరా పండుగనాడు లిక్కర్ షాపులు మూసేయాలా ? లేకపోతే మినహాయింపు ఇవ్వాలా అన్నవిషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
పోయిన ఏడాది దసరాపండుగ సందర్భంగా ఖజనాకు రు. 1285 కోట్ల ఆదాయం వచ్చింది. దసరాపండుగ అక్టోబర్ 1 నుండి 14 వరకు అంటే 11 రోజుల్లో ఎక్సైజ్ శాఖకు రు. 1285.16 కోట్ల ఆదాయం వచ్చింది. 11.03 లక్షల సీసాల లిక్కర్, 20.63 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఒక్క పండుగరోజు మాత్రమే అంటే 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 3.07 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయంటేనే అర్ధమవుతోంది మందుబాబులు ఎంతగా ఎంజాయ్ చేశారో. మద్యందుకాణాలు, బార్లు, వైన్ షాపులన్నింటినీ అక్టోబర్ 2వ తేదీన మూసేస్తున్నట్లు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. దీంతో పాటు మాంసంకొట్లను కూడా మూసేస్తే ప్రభుత్వానికి తక్కువలో తక్కువ రు. 1500 కోట్ల ఆదాయానికి గండిపడటం ఖాయమని అర్ధమవుతోంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాలి.