తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్
x

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జులై 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జులై 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ లు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక జులై 24 నుంచే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దానికి అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్ కూడా ఉండనుంది. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం రైతు భరోసా విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలలో పర్యటిస్తోంది. ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చలు జరపనున్నారు. అలాగే పూర్తిస్థాయి బడ్జెట్ ను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. జాబ్ క్యాలెండర్ ను సైతం ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలాఉండగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారా అని ఎద్దేవా చేశారు. అయితే ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ... వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని, ప్రజలకి అన్యాయం జరగకుండా ప్రభుత్వంపై కొట్లాడుతానని ప్రకటించారు. దీంతో ఆయన రాకపై కూడా కొంత ఆసక్తి నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం, జాబ్ క్యాలెండర్, అమలు కాని ఆరు గ్యారెంటీలపైనా బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.

Read More
Next Story