
మక్కా - మదీనా మార్గంలో అగ్నికీలల్లో చిక్కుకున్న యాత్రికుల బస్సు
పవిత్ర మక్కా యాత్రలో మళ్లీ మృత్యు కేళి
రోడ్డు ప్రమాదాలు...తొక్కిసలాటలు... వడదెబ్బ... అగ్నిప్రమాదాలు... మక్కా యాత్రలో ప్రమాదాలకు అంతం లేదా?
పవిత్ర మక్కా భూమి యాత్రికుల సంద్రంతో నిండిపోయిన ఆదివారం రాత్రి ఒక్కసారిగా అగ్నిజ్వాలల అరుపులతో ప్రతిధ్వనించింది. మదీనాకు బయలుదేరిన హైదరాబాదీ యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకరును ఢీకొనగానే క్షణాల్లోనే అగ్నిగర్భంగా మారి 45 మంది ప్రాణాలు బూడిదగా మారాయి.అచంచల భక్తితో ప్రారంభమైన ఉమ్రా యాత్ర, మక్కా చరిత్రలో మరో గుండె చెండాడే విషాదాన్ని లిఖించింది.
- భక్తజన సమూహాలతో కిటకిటలాడే మక్కా యాత్ర...ప్రతి అడుగు పవిత్రత కోసం పడుతుండగా, అదే మార్గం హైదరాబాదీ యాత్రికులకు మరణపు దారి అయింది.అల్లాహ్ దివ్య సన్నిధిని స్పృశించాలనే ఆశతో మక్కా చేరిన యాత్రికుల మనసుల్లో ఆనందం ఇంకా నిలవక ముందే, మదీనా దారిలో మంటల మహాగర్జన వారి ప్రాణాలను కబళించింది. క్షణాల్లో 45 హృదయ స్పందనలు ఆగిపోయి, మక్కా యాత్ర ఆ రాత్రే విషాద రుద్రరూపం దాల్చింది.
- హైదరాబాద్ నగర వాసుల మక్కా ఉమ్రా యాత్ర విషాద యాత్రగా మారింది.ఉమ్రా యాత్రికులు మక్కా నుంచి మదీనాకు వెళుతుండగా ఒక్కసారిగా బస్సు, ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు ఎగిసిపడి క్షణాల్లో బస్సు దహనమైంది.ఈ దుర్ఘటన ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటలకు జరిగింది.ఈ బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన తర్వాత మక్కా యాత్ర మరోసారి విషాదకరంగా మారింది. పవిత్ర హజ్–ఉమ్రా యాత్రలలో తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై మరోసారి ఆందోళనలు రేకెత్తించింది.
ఐదు మూల స్తంభాల్లో హజ్ ఒకటి
ఇస్లాం ఐదు మూల స్తంభాల్లో హజ్ ఒకటి. దీంతో ముస్లింలు జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కా యాత్ర చేపట్టాలని భావిస్తుంటారు. ప్రతీ ఏటా జిల్ హజ్ నెల 8 నుంచి 13వతేదీ వరకు పవిత్ర హజ్ యాత్ర చేస్తుంటారు. దీంతోపాటు 11 నెలలపాటు ఉమ్రా యాత్రలు కొనసాగుతుంటాయి.
మక్కా యాత్రలో ప్రమాదాలకు కారణాలు...
ప్రతీ ఏటా మక్కాకు హజ్ యాత్రకు 25 లక్షల మందికి పైగా యాత్రికులు వస్తుంటారు. చుట్టూ కొండల మధ్య హరామ్ షరీఫ్ పవిత్ర కాబా గృహంలో కేవలం మూడు లక్షల మంది యాత్రికులు మాత్రమే పడతారు. ప్రతీ ఏటా జరిగే హజ్ యాత్రలో తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. మక్కా, మినా, అరఫత్ ప్రాంతాల్లో తరచూ తొక్కిసలాటలు, ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. మక్కాకు హజ్ యాత్ర కోసం లక్షలాది మంది తరలి వస్తుండటంతో మానవ తప్పిదాలతోనే తరచూ ప్రమాదాలు వాటిల్లుతున్నాయని ఇస్లామిక్ పండితుడు, ఉమ్రా యాత్ర చేసిన అజీజుర్ రహమాన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గత ఏడాది మక్కాలో ఉష్ణోగ్రత 52 డిగ్రీలకు చేరుకోవడంతో వాతావరణాన్ని చల్ల బరిచేందుకు సౌదీఅరేబియాలోని ప్రభుత్వం చల్లని నీటిని స్ప్రే చేస్తున్నా వడదెబ్బ వల్ల కొంత మంది మరణించారని ఆయన పేర్కొన్నారు. తక్కువ స్థలంలో లక్షలాది మంది తరలివస్తుండటంతో తరచూ తొక్కిసలాటలకు దారి తీస్తుందని ఆయన చెప్పారు.
ఆరోగ్య సమస్యలతో యాత్రికుల మృత్యువాత
జీవితం చరమాంకంలో ఎక్కువ మంది హజ్ యాత్రకు వెళుతుండటంతో వారు మధుమేహం, రక్తపోటు, హృద్రోగ సమస్యలతో యాత్రికులు తరచూ మృత్యువాత పడుతున్నారని గీటురాయి వారపత్రిక ఎడిటోరియల్ ఇన్ చార్జ్ ముహమ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అరఫత్ వద్ద జనసమ్మర్థం పెరగడం వల్ల తరచూ తొక్కిసలాట జరుగుతుందని ఆయన చెప్పారు.ఏ యేటి కా ఏడు మక్కా యాత్రలో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నా, పెరుగుతున్న యాత్రికుల సంఖ్యతో తరచూ ప్రమాదాలు వాటిల్లుతున్నాయని ముజాహిద్ చెప్పారు. హజ్ యాత్రలో నడవడం, కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడం, దయ్యానికి రాళ్లతో కొట్టడంలో ప్రమాదాలు వాటిల్లుతున్నాయని, దీన్ని నివారించడానికి సౌదీ సర్కారు వసతులు కల్పిస్తుందని ఆయన వివరించారు.
మక్కాలో మృత్యు ఘోష...తొక్కిసలాటలు ఎన్నో...
మక్కా, మదీనా నగరాల్లో హజ్ యాత్ర సందర్భంగా పలు దుర్ఘటనలు జరిగాయి.
1990 జులై 2: మక్కా నుంచి మినా ,అరాఫత్ మైదానాల వైపు వెళ్లే పాదచారుల సొరంగం (అల్-మాయిసిమ్ సొరంగం) లోపల జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది యాత్రికులు మరణించారు. వారిలో చాలామంది మలేషియా, ఇండోనేషియా, పాకిస్తాన్ దేశాల వాసులున్నారు.
1994 మే 23 : డెవిల్‌ను రాళ్లతో కొట్టే ఆచారంలో జరిగిన తొక్కిసలాటలో 270 మంది యాత్రికులు మరణించారు.మక్కా లోని జమారత్ వంతెన వద్ద జరిగే దయ్యాన్ని రాళ్ళతో కొట్టే ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 270 మంది మరణించారు.
1998 ఏప్రిల్ 9: జమారాత్ వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 118 మంది యాత్రికులు మరణించారు. బకొ 180 మంది గాయపడ్డారు.
2001 మార్చి 5: డెవిల్‌ను రాళ్లతో కొట్టే ఆచారంలో జరిగిన తొక్కిసలాటలో 35 మంది యాత్రికులు తొక్కిసలాటలో మరణించారు.
2003 ఫిబ్రవరి 11 : డెవిల్‌ను రాళ్లతో కొట్టే ఆచారంలో 14 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.
2004 ఫిబ్రవరి 1: మినాలో రాళ్లతో కొట్టే ఆచారం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 251 మంది యాత్రికులు మరణించగా, మరో 244 మంది గాయపడ్డారు.
2005 జనవరి 22: మినాలో రాళ్లతో కొట్టే ఆచారం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు యాత్రికులు మరణించారు.
2006 జనవరి 12 : మినాలో హజ్ చివరి రోజున దెయ్యాన్ని రాళ్లతో కొట్టే సమయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 346 మంది యాత్రికులు మరణించారు. మరో 289 మంది గాయపడ్డారు. జమారాత్ వంతెనకు తూర్పు యాక్సెస్ ర్యాంప్‌ల వద్ద ప్రయాణికుల బస్సు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. దీని ఫలితంగా యాత్రికులు జారిపోయారు.
2015 సెప్టెంబర్ 24: సైతాన్‌పై రాళ్లు రువ్వేందుకు యాత్రికులు ఒక్కసారి ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగినట్టు కొందరి వాదనగా ఉంది. మక్కా చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదం జరుగగా, ఇందులో 720 మంది వరకు ప్రాణాలు కోల్పోయి మహా విషాదం మిగిల్చింది.
మక్కా మసీదు వెలుపల మినా ప్రాంతంలో జరిగిన మహా తొక్కిసలాటలో పెద్దసంఖ్యలో యాత్రికులు మరణించారు. వెల్లువలా తరలివస్తున్న హజ్ యాత్రికులను అదుపు చేసేందుకు పోలీసులు గేట్లు మూసివేయడం వల్ల ఈ తొక్కిసలాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
వరుస అగ్నిప్రమాదాలు
డిసెంబర్ 1975: ఒక టెంట్ లో పేలిన గ్యాస్ సిలిండర్ కారణంగా మంటలు చెలరేగి 200 మంది యాత్రికులు మరణించారు.
15 ఏప్రిల్ 1997: టెంట్ మంటల్లో 343 మంది యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 1,500 మంది గాయపడ్డారు.
13 ఫిబ్రవరి 2002: సౌదీ అరేబియాలోని అల్ ఇహ్సా ప్రావిన్స్‌లో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో నలభై మంది హజ్ యాత్రికులు మరణించారు.
వడదెబ్బతో 900 మంది యాత్రికుల మృతి
2024 పవిత్ర హజ్ యాత్రలో 90 మంది భారతీయులతో సహా 900 మది మృతి చెందారు. మక్కా నగరంలో హజ్ యాత్ర సమయంలో ఉష్ణోగ్రతలు 52 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో వృద్ధులు ఎండకు తాళలేక మరణించారు. ఎడారి ప్రాంతం అయిన సౌదీ అరేబియాలో ఎండలు మండిపోతుండటంతో హజ్ యాత్రలో మరణాలు సంభవించాయి.మండుతున్న ఎండలకు మక్కా మలమల లాడింది. మక్కా మసీదు వల్ల 51.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాది మొత్తం 18.3 లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రకు రాగా వారిలో 900 మంది యాత్రికులు వడదెబ్బ, తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో కన్నుమూశారు.
మంత్రి ముహ్మద్ అజారుద్దీన్ తీవ్ర దిగ్భ్రాంతి
సౌదీ అరేబియాలో హైదరాబాద్ ఉమ్రా యాత్రికులతో వెళుతున్న బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముహ్మద్ అజారుద్దీన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల వారందరికీ ఈ దురదృష్టకర సంఘటనలో భాగమైన హైదరాబాద్ కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. తాము మృతుల కుటుంబాలకు సహాయం చేయడానికి , పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. ‘‘ఈ క్లిష్ట సమయంలో మేం కుటుంబాలకు అండగా నిలుస్తాం, తెలంగాణ ప్రభుత్వంలోని మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందిస్తాం’’ అని మంత్రి అజారుద్దీన్ చెప్పారు.
మక్కా యాత్రలో మెరుగు పరుస్తున్న సౌకర్యాలు
మక్కా యాత్రలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం ఎప్పటికప్పుడు యాత్రికులకు సౌకర్యాలను మెరుగుపరుస్తుందని తెలంగాణ హజ్ కమిటీ ఉద్యోగి, మూడుసార్లు హజ్ యాత్ర చేసిన ముహ్మద్ హబీబుద్దీన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మక్కా నుంచి మినాకు వెళ్లే రోడ్డును విస్తరించడంతోపాటు మెరుగ్గా చేయడంతో అతి వేగం వల్ల, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడం వల్ల ఘోర ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. గతంలో మక్కా యాత్రలో టెంట్లు అగ్నిప్రమాదంలో కాలిపోయి తరచూ ప్రమాదాలు జరిగాయని, దీంతో అక్కడి పాలకులు ఫైర్ ఫ్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయడంతో అగ్ని ప్రమాదాలు చెక్ పడిందన్నారు. దయ్యానికి రాళ్లు కొట్టే ప్రదేశంలో ఇరుకుగా ఉండటంతోపాటు ఒకే సారి లక్షలాది మంది భక్తులు రావడం వల్ల తరచూ తొక్కిసలాటలు జరిగేవని, ఈ సారి ఆ ప్రాంతంలో పెద్ద విశాలమైన వివిధ అంతస్తులు నిర్మించడంతో తొక్కిసలాటల సంఖ్య తగ్గిందన్నారు.
మక్కా మైదానాల్లో పలికిన ఈ మృత్యునినాదం మరోసారి హజ్–ఉమ్రా యాత్రల్లో మనిషి అశక్తతను గుర్తు చేసింది. భక్తి కోసం ప్రపంచం నలుమూలల నుంచి చేరే లక్షలాది యాత్రికులకు రక్షణ కోసం ఏ వసతులైనా సరిపోవని ఈ ఘటనలు చెబుతున్నాయి. గత దశాబ్దాలుగా కొనసాగుతున్న తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాలు, వడదెబ్బ మరణాలు...ఇవీ అన్నీ హజ్ యాత్రలో ఇంకా పరిష్కారం కావాల్సిన లోపాలనే గుర్తుచేస్తున్నాయి. సౌదీ ప్రభుత్వం వసతులు మెరుగుపరుస్తున్నా, యాత్రికుల భారీ ప్రవాహం ముందు అవి చాలడం లేదు. భక్తి యాత్రను ప్రమాద యాత్రగా మారనీయకుండా అంతర్జాతీయ స్థాయిలో మరింత సమన్వయం, పర్యవేక్షణ అవసరం అని ఈ విషాదం మరోసారి తెలియజేసింది.
Next Story

