ఓటేయలేదుగా, ఇగ పైసల్ వాపసు ఇవ్వండి
x
ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బాల రాజు తాను ఓటర్లకు పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని అవురేని గ్రామం లో ఇంటి ఇంటికి వెళ్లి కోరుతున్నారు

"ఓటేయలేదుగా, ఇగ పైసల్ వాపసు ఇవ్వండి"

ఓటర్లకు పంచిన డబ్బును తిరిగి అడుగుతున్న ఓడిన అభ్యర్థులు


• ప్రమాణాలు, పురుగులమందు బాటిల్ , తిట్లతో బెదిరింపులు

• ఎన్నికల తరువాత గ్రామాలలో విచిత్ర పరిస్థితి
తెలంగాణాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామాలలో కొత్త పద్ధతి మొదలయిందది. సర్పంచు ఎన్నికలో ఓడిపోయిన అభ్యర్థులు తాము పంచిన డబ్బు ఓటర్ల నుంచి తిరిగి వసూలు చేసుకోవటానికి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అవరవాని గ్రామంలో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాల రాజు ఎన్నికల్లో ఓడిపోయాడు. అయితే, ఆయన దేవుడి ఫోటో పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు తాను పంచిన డబ్బును తిరిగి ఇవ్వాలని ఓటర్లను డిమాండ్ చేస్తున్నాడు. పురుగుల మందు బాటిల్ తో అతని భార్య అభ్యర్థిని అనుసరిస్తుంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన మరుసటి రోజే అతను ఈ చర్యకు పాల్పడ్డాడు. బలరాజు దేవుడి పటాన్ని పట్టుకుని ఇంటింటికీ వెళ్లి, ఎన్నికల్లో తమకు ఓటు వేశారా లేదా అని దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాలని ఓటర్లను కోరాడు, లేదంటే ఎన్నికల్లో ఓట్లు పొందడానికి తాను వారికి పంచిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. అతని భార్య కూడా పురుగుల మందు సీసా పట్టుకుని అతనితో పాటు ఇంటింటికి వస్తుంది. పోలింగ్‌కు ఒక రోజు ముందు అతను ప్రతి ఓటరుకు రూ. 500 పంపిణీ చేసినట్లు సమాచారం. బలరాజు కాంగ్రెస్ అభ్యర్థి జక్కలి పరమేశ్ చేతిలో 448 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు. గ్రామంలో మొత్తం 1577 ఓట్లకు గాను, శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 1,494 మంది ఓటర్లు పాల్గొన్నారు.
50 నుంచి 60 ఓట్ల తేడాతో ఓడిపోయి ఉంటే తాను డబ్బు తిరిగి అడిగేవాడిని కాదని బలరాజు ఓటర్లకు స్పష్టం చేశాడు. 448 ఓట్ల తేడా అంటే, తన దగ్గర డబ్బు తీసుకున్న ఓటర్లు కచ్చితంగా తనకు ఓటు వేయలేదని అతను అన్నాడు. ఆసక్తికరంగా, చాలా మంది ఓటర్లు దేవుడిపై ప్రమాణం చేయడానికి ఇష్టపడక డబ్బును తిరిగి ఇచ్చేశారు. కొంతమంది గ్రామస్తులు బలరాజు చర్యను వ్యతిరేకిస్తూ అతనితో వాగ్వాదానికి దిగారు.

ఓడిపోయిన సర్పంచు అభ్యర్థి బాలరాజు భార్యతో కలసి ఇలా తిరుగుతున్నారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓటర్ల నుంచి పంచిన డబ్బును వసూలు చేయడానికి మరో నాయకుడు ‘బూతులు’ఆయుధంగా మలుచుకున్నారు.
జిల్లాలోని భద్రాచలంలో 14వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బండారు నాగేశ్వరరావు కూడా ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఇదే పని చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన వారిపై అతను ‘బూతులు’ ఉపయోగించాడు. అతని తిట్లను భరించలేక ఓటర్లు డబ్బును తిరిగి ఇచ్చేశారు. తమపై బూతులు ఉపయోగించినందుకు నాగేశ్వరరావు క్షమాపణ చెప్పాలని వార్డు మహిళలు డిమాండ్ చేశారు. కానీ, తమకు ఓటు వేయలేదని కోపంతో ఉన్న నాగేశ్వరరావు వారి డిమాండ్‌ను పట్టించుకోలేదు. ఓటర్లు మాత్రం తాము ఏ అభ్యర్థిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయలేదని, అభ్యర్థులే తమ ఇంటికి వచ్చి బలవంతంగా డబ్బులు ఇచ్చారని వాపోతున్నారు. ఒక కుటుంబంలో ఉన్న ఓటర్ లకు ఇద్దరు అభ్యర్థులు డబ్బులు ఇచ్చినట్లు ఐతే సమ న్యాయం పటిచేందుకు ఉన్న ఓట్లలో చెరి సమానం వేసినట్లు పేరు తెలపడానికి ఇష్టపడని గ్రామస్తుడు తెలిపారు.
గత ఎన్నికలలో సూర్యాపేట జిల్లా లోని జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్ గా పోటీచేసిన ఉప్పు ప్రభాకర్ ఇలానే పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఎన్నికలలో ఒడి పోయిన తరువాత ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలను కోరారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక, జాతీయ మీడియా లో ప్రముఖ స్థానం పొందింది.
ప్రముఖ సామాజిక కార్యకర్త బొమ్మరబోయిన కేశవులు ‘ఫెడరల్ తెలంగాణ’ తో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు ఎన్నికల్లో డబ్బు ప్రవాహంకు సాక్ష్యం. చివరకు గ్రామ స్థాయిలో కూడా ఎన్నికలు, ప్రజా స్వామ్యంఎలా అపహాస్యం పాలయిందో తెలియ చేస్తున్నవని అన్నారు. వీటిపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తీవ్ర చర్యలు తీసుకోవాలి. డబ్బులు పంచినట్లు చెబుతున్న వారిని శాశ్వితంగా ఎన్నికల్లో పోటీ చేస్సాయతనికి అనర్హులుగా ప్రకటించాలి అని అయన అభిప్రాయం వ్యక్తం చేసారు.


Read More
Next Story