
స్పీకర్ విచారణకు అరికెపుడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరు..
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ గురువారంతో ముగిసింది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ గురువారంతో ముగిసింది. గురువారం ఈ విచారణకు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరికెపుడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. పోచారం శ్రీనివాస్ వర్సెస్ జగదీశ్ రెడ్డి కేసును స్పీకర్ గురువారం ఉదయం విచారించారు. ఇరువర్గాలు వాదనలను విన్నారు. అనంతరం మధ్యాహ్నం అరికెపుడి గాంధీ వర్సెస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసును విచారించారు. ఇందులో కూడా ఇరువర్గాల వాదనలను ఆయన విన్నారు. వారి విచారణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది నేతల విచారణ పూర్తయింది. కాగా ఇంకా దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ జరగాల్సి ఉంది. అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు బదులుగా వారిద్దరూ ఇంకా తమ అఫిడవిట్‌లను దాఖలు చేయలేదు.
దీంతో వారు వెంటనే తమ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని కోరుతూ.. స్పీకర్ గడ్డం ప్రసాద్.. గురువారం మరోసారి నోటీసులు జారీ చేశారు. వాటిపై ఇంకా దానం, కడియం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఈ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
అసలు కథ ఇదే..
2023 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల్లోనే దాదాపు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్.. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ న్యాయపోరాటం స్టార్ట్ చేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే మూడు నెలల్లో ఫిరాయింపు నేతలపై నిర్ణయం తీసుకోవాలంటూ ధర్మాసనం.. జూలై 31న ఆదేశించింది. అయినప్పటికీ, వివిధ కారణాల వల్ల ఆ గడువులోగా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే ధర్మాసనం ఇచ్చిన గడువులోగా తీర్పు ఇవ్వలేకపోయామని, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి తమకు మరో రెండు నెలల సమయం కావాలని కోరుతూ స్పీకర్ తరఫున శాసనసభ కార్యదర్శి తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. కార్యదర్శి మిసిలేనియస్ దాఖలు చేసిన అప్లికేషన్ 14వ నంబరులో లిస్ట్ అయింది. సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంలో స్పీకర్‌కు మరో నాలుగు వారాల సమయం ఇచ్చింది. దీంతో స్పీకర్ ఈ అంశంలో స్పీడ్ పెంచారు.

