Revanth Reddy
x

'విచారణకి హాజరవ్వండి'.. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీస్ నోటీసులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఓ కేసు విచారణలో పాల్గొనాలంటూ ఆయనతో పాటు మరో నలుగురికి కూడా నోటీసులు అందాయి.


కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రొజెక్ట్ చేసి కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని బీజేపీ వర్గాలు భగ్గుమన్నాయి. ఈ వివాదంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ కేసు విచారణలో పాల్గొనాలంటూ ఆయనతో పాటు మరో నలుగురికి కూడా నోటీసులు అందాయి.

"రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తప్పుగా ఎడిట్ చేసి తెలంగాణ కాంగ్రెస్ అధికారిక X (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఇక అదే ట్వీట్ ని కాంగ్రెస్ నేతలంతా షేర్ చేశారని" బీజేపీ నేతలు ఆరోపించారు.

అమిత్ షా ఏమన్నారంటే...

ఇటీవల మెదక్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు ప్రచార ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. సిద్ధిపేట లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ... తెలంగాణాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో మైనారిటీలకు కల్పించిన రిజర్వేషన్లు తొలగించి... ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తీసుకువస్తామన్నారు.

అయితే ఈ వీడియో క్లిప్ ని ఎడిట్ చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల రిజర్వేషన్లు ఎత్తివేయాలని అమిత్ షా చెబుతున్నట్టు కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని" బీజేపీ వర్గాలు ఆరోపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ, హోంమంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ఢిల్లీ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 153, 153A, 465, 469, 171G, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 66C కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియోను అప్‌లోడ్ చేసిన, షేర్ చేసిన ఖాతాల సమాచారాన్ని కోరుతూ పోలీసులు X, ఫేస్బుక్ కి నోటీసులు కూడా పంపారు.

చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి -అమిత్ మాల్వియా

కాంగ్రెస్ షేర్ చేసిన వీడియో ని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాల్వియా తప్పుబట్టారు. "మత ప్రాతిపదికన ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించడంపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు’’ అని ట్విట్టర్ లో వివరించారు. కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియోని షేర్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వీరంతా చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.


రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా క్లారిటీ..

రోజురోజుకీ రిజర్వేషన్ల రద్దు వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో ఆదివారం అమిత్ షా స్పందించారు. "రాహుల్ గాంధీ మాపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ 10 ఏళ్లుగా అధికారంలో ఉంది. రెండుసార్లు పూర్తి మెజారిటీతో ఎన్నికైంది. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశం ఉంటే ఈపాటికే చేసి ఉండేవాళ్లమని, కానీ తమ ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని" ఆయన స్పష్టం చేశారు.

Read More
Next Story