తెలంగాణ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ సాధనపై బిసి నేతల సమాలోచన
x

తెలంగాణ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ సాధనపై బిసి నేతల సమాలోచన

తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీల 42 శాతం రిజర్వేషన్ పరిరక్షణకు నడుం బిగించాలని సామాజిక ఉద్యమ నాయకులు, బీసీ సంఘాలు ముక్తకంఠంతో తీర్మానించాయి.


బిసి సమాజం పునాదుల పరిరక్షణ కావాలంటే, 42 శాతం రిజర్వేషన్ సమకూర్చవలసిందేనని, వరుసగా వివిధ రాజ్యాధికార పదవుల్లో ఎదురయిన నిరాధరణతో బిసి కులాల నాయకులు ఆగ్రహంతో ఉన్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఆశావహులలో బిసి అభ్యర్థులను, బిసి సంఘాల్లో భాగస్వాములను, వివిధ కులాలలో ప్రోఫెషనల్ అసోసియేషన్ల ప్రతినిధులను సమాయత్త పరిచి, స్థానిక సంస్థలలో 42% బిసి రిజర్వేషన్ లక్ష్య సాధన కోసం హైదరాబాద్ లో మాజీ ఎంపీ రాపోలు ఆధ్వర్యంలో సుదీర్ఘ సమాలోచన జరిగింది. హైదరాబాదులోని రాపోలు ఆనంద భాస్కర్ నివాసంలో సమాలోచన జరిగింది.

ఇందులో జస్టిస్ చంద్ర కుమార్, మాజీ ఐఎఎస్ అధికారి చిరంజీవులు, వి.జి.ఆర్. నారగోని, ప్రొ. తాటికొండ వెంకట రాజయ్య, ప్రొ. ప్రభంజన్ యాదవ్, అభినవ సర్దార్ సర్వాయి పాపన్న జైహింద్ గౌడ్, తెలంగాణ విఠల్, పృథ్వీరాజ్ యాదవ్, దాసు సురేష్ నేత, నరేందర్ గౌడ్, భాగ్య లక్ష్మి, మారెపల్లి లక్ష్మణ్ నేత, హరిదృఢ, కోల జనార్ధన్, తీగల లక్ష్మణ్ గౌడ్, పోషం అశోక్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థలలో ఆశావహులు, బిసి సంఘాల్లోని క్షేత్ర స్థాయి కార్యకర్తలు, వివిధ కులాల ప్రొఫెషనల్ అసోసియేషన్ల ప్రతినిధులు ఏకమై, పునాదిని కాపాడుకోవడం వంటి రిజర్వేషన్ల పరిరక్షణకు మండలాల స్థాయిలో సమావేశాలు, ప్రదర్శనలతో ఎలుగెత్తి చాటాలని, ఈ ప్రధానమైన రక్షణ కాపాడుకోవడం బిసి బిడ్డల భవిష్యత్తు తో ముడివడి ఉందని ముక్తకంఠంతో నిర్ధారించారు.

తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీల 42 శాతం రిజర్వేషన్ పరిరక్షణకు నడుం బిగించాలని సామాజిక ఉద్యమ నాయకులు, బీసీ సంఘాలు ముక్తకంఠంతో తీర్మానించాయి.

కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని బిసి నాయకులు గుర్తు చేశారు. లేదంటే కిందిస్థాయిలో బీసీ నాయకత్వానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు.

బీసీ సంఘాల నేతలు ఉద్యమకారులు ఒక్కతాటిపైకి రావాలని జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ లక్ష్యం కోసం సంయుక్తంగా పోరాడాలని గ్రామ గ్రామానికి దీనిని తీసుకుపోవాలని సూచించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేపట్టాలని మాజీ ఐఏఎస్ చిరంజీవి అన్నారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు.

తమకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం బీసీ సమాజం కదలాలని... అందుకోసం గ్రామస్థాయి వరకు కార్యాచరణ తీసుకోవాలని విజిఆర్ నారగోని అన్నారు. కుల గణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేదంటే తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువస్తామని సామాజిక ఉద్యమ నాయకులు తెలంగాణ విఠ్ఠల్, పృథ్వీరాజ్, దాసు సురేష్, నరేందర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

త్వరలోనే స్థానిక సంస్థల్లో బీసీల 42 శాతం రిజర్వేషన్ పరిరక్షణకు కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Read More
Next Story