
తెలంగాణ బడ్జెట్ నేపథ్యంలో పౌరసంఘాల ప్రతినిధుల డిమాండ్లు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఈ నెల 19వతేదీన ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు.ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు పలు డిమాండ్లను సర్కార్ ముందుంచాయి.
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నెల 19వతేదీన డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ పౌర సంఘాలు పలు డిమాండ్లను తెరమీదకు తీసుకువచ్చాయి.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు రూ.3.10 లక్షల కోట్లతో అంచనాలను ఆర్థికశాఖ రూపొందించిందని సమాచారం. 2024-25 ఆర్థిక సంవత్సరం కంటే ఏడు శాతం పెంచి బడ్జెట్ కు రూపకల్పన చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు, సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన పథకాలైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రోరైలు రెండో దశ, ముచ్చర్ల ఫోర్త్ సిటీ అభివృద్ధికి బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం.
పౌరసమాజం ఏం చెబుతుందంటే...
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ పౌర సమాజం ప్రతినిధులు, మేధావులు పలు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లోద ఇచ్చిన హామి మేరకు విద్యరంగానికి బడ్జెట్ లో 15 శాతం నిధులు కేటాయించాలని పౌర సమాజం డిమాండ్ చేసింది. విద్యకు అత్యధిక నిధులు ఇవ్వాలని ప్రజాసంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్య నాణ్యతను పెంచేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని పౌర సమాజం కోరింది.
కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ వంటి పథకాల అమలును నిలిపివేసి, ఆ నిధులను పిల్లల విద్య కోసం ఉపయోగించాలని ప్రజాసంఘాలు కోరాయి. గత మూడేళ్లలో కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలకు రూ.8,335 కోట్లు ఖర్చు చేశారని, కానీ ఆ నిధులను విద్యాభివృద్ధికి మళ్లించాలని బాలల హక్కుల కార్యకర్త వర్ష భార్గవి డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటివరకు 3,90,000 మంది బాలికలు విద్యకు దూరమై వివాహ బంధంలోకి వెళ్లారని ఆమె చెప్పారు.కరోనా తర్వాత పిల్లల అక్రమ రవాణ, బాల కార్మికుల సంఖ్య పెరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆత్మహత్యలు ఆపండి
తెలంగాణలోని విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలను ఆపాలని మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకుడు అబ్బాస్ డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 13వేల మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 1800 పాఠశాలల్లో విద్యార్థులు చేరకపోవడంతో వాటిని మూసివేయనున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.జాతీయ విద్యా విధానం పేరిట ప్రభుత్వ విద్యను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
జంటనగరాల్లో కొత్త పాఠశాలల ఏర్పాటేది ?
జంట నగరాల్లో గత 25 సంవత్సరాల్లో కొత్త పాఠశాలను ఏర్పాటు చేయలేదని ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకట్ రెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జంట నగరాలకు ప్రజలు వలస వచ్చినా, పాథశాలల సంఖ్య పెంచలేదన్నారు.విద్యాహక్కు చట్టం ప్రకారం జిల్లాలకు ప్రత్యేక విద్యా ప్యాకేజీ ఇవ్వాలని జోగులాంబ జిల్లాకు చెందిన కార్యకర్త వీరన్న డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తూ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తుందని రిటైర్డు ఉపాధ్యాయుడు వై అశోక్ కుమార్ చెప్పారు.ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పర్చేందుకు బడ్జెట్ కేటాయించాలని కోరారు.
కేంద్ర బడ్జెట్ లోనూ అన్యాయం
కేంద్ర బడ్జెట్ లో పాఠశాల విద్యకు కేవలం 2.8 శాతం నిధులు మాత్రమే ఇచ్చారని, అందులోనూ పిల్లల సంరక్షణ కోసం 0.5 శాతం నిధులే కేటాయించారని రెయిన్‌బో హోమ్స్ ప్రతినిధి అనురాధ ఆరోపించారు.రాష్ట్ర బడ్జెట్ మరో మూడు రోజుల్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించేందుకు సమాయత్తం అయ్యారు.
Next Story