హైడ్రాపై హైరానా వద్దు.. ప్రజలకు భట్టి విక్రమార్క భరోసా..
హైడ్రా, మూసీ సుందరీకరణ విషయంలో వివాదంగా మారుతున్న అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు.
హైడ్రా, మూసీ సుందరీకరణ విషయంలో వివాదంగా మారుతున్న అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. హైడ్రాపై హైరానా వద్దని అన్నారు. హైడ్రా, మూసీ అభివృద్ధి అంశాలను ప్రతిపక్షాలు తమ పొలిటికల్ మైలేజీకి సాధనాలుగా వినియోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి రాకుండా మళ్ళీ వాళ్లని మోసం చేయడానికి వచ్చేశారని, ప్రభుత్వం ఏం చేసినా తప్పుబట్టడం వారికి పరిపాటి అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు నిజంగా ప్రజా సంక్షేమం కోరుకునే వారైతే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా మూసీ అభివృద్ధి గురించి సలహాలు సూచనలు ఇవ్వాలని, అలా కాకుండా అవే అదునుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి? ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రయత్నించడం రాజకీయ హుందాతనం అనిపించుకోదని హితవు పలికారు. ఇప్పటికైనా వారు తమ తీరు మార్చుకోవాలని కోరారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని, కానీ అవేవీ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదని గుర్తు చేశారు. అవి ఉండాల్సిన ప్రదేశాలన్నింటిలో ఇప్పుడు కట్టడాలే దర్శనమిస్తున్నాయని, అందుకే వాటిని కాపాడాల్సిన బాధ్యతను తమ ప్రభుత్వం నెత్తికి ఎత్తుకుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని, ఇందులో ప్రజా అజెండానే తప్ప వ్యక్తిగత అజెండా ఏమీ లేదని అన్నారు.
హైదరాబాద్‌కు పెను ప్రమాదం..
ముందు ఎలా అనుమతులిచ్చారు? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారని, ఒక తప్పు జరగడం ఎంత సహజమో.. దానిని సరిచేయాల్సిన బాధ్యత కూడా అంతే ఉంటుందని ఆయన అన్నారు. చెరువలు, కుంటల ఆక్రమణ హైదరాబాద్‌కు భవిష్యత్తులో పెనుప్రమాదంగా మారే ప్రమాదం ఉందని, అలాంటి దుర్భర స్థితులు రాకూడదనే ఇప్పుడు తమ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ‘‘కొన్నేళ్లలో హైదరాబాద్‌లో చెరువులు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చాయి. ఈ నగరాన్ని మనం భావి తరాలకు అందించాలి. వారు సంతోషకరమైన జీవనం కొనసాగించాలన్నా.. నీటి కొరతలతో సతమతం కాకూడదన్నా ఇప్పుడు ఈ చర్యలు తప్పవు. మూసీ సుందరీకరణ విషయంలో కూడా ఎవరికీ వ్యక్తిగత అజెండాలు లేవు. నగరంలో 2014కు ముందు ఎన్ని చెరువులు ఉన్నాయో, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రజలు ఒకసారి చూడాలి’’ అని భట్టి వివరించారు.
గత ప్రభుత్వాల వైఫల్యమే..
‘‘ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం ఏర్పడిన చెరువులు, కుంటలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో పెద్దపెద్ద బహుల అంతస్తుల కట్టడాలు వెలిశాయి. అందువల్లనే చిన్నపాటి వరద కూడా హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తోంది. చిన్నచిన్న వర్షాలతో కూడా రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. అదే చెరువులు ఉంటే ఇలా పరిస్థితులు వచ్చేవి కావు. చెరువులు, కుంటలు కబ్జా కావడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణం. వారు సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని, మూసీలో మంచినీరు పారేలా చేస్తామంటూ గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు మాటలకే పరిమితం అయ్యాయి. వాటిని పూర్తి చేయడంలో కూడా గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. భవిష్యత్తు తరాలకు అందమైన, భద్రమైన హైదరాబాద్‌ను అందించాలన్న సంకల్పంతోనే ఈరోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. మూసీ నదిని భాగ్యనగరం మెడలో మణిహారంగా మార్చాలన్నదే మా ప్రభుత్వ అజెండా. అంతకుమించి మాకు వ్యక్తిగత అజెండా ఏమీ లేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
అన్నీ ప్రజల ముందుకు తీసుకొస్తాం..
‘‘నగరంలో 2014కు ముందు ఎన్ని చెరువులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి మీరే చూడండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాం. అతి త్వరలోనే దీనిని ప్రజల ముందు ఉంచుతాం. ఈ వివరాలను జాగ్రత్తగా ఉంచుతాం. రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను సుందరంగా తయారు చేయాలనే హైడ్రాను, మూసీ ప్రాజెక్ట్‌ను చేపట్టాం. ఈ చెరువుల ఆక్రమణను ఇప్పుడు ఆపకపోతే భవిష్యత్తులో ఇదే హైదరాబాద్‌కు పెను ముప్పుగా మారుతుంది. ఈ పనులు మన కోసమో.. సీఎం కోసమో చేస్తున్నవి కావు. భవిష్యత్ తరాల కోసం చేస్తున్నవి. కానీ ప్రతిపక్షాలు వీటిని ఉద్దేశించి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాయి. అది సరైన పద్దతి కాదు. చెరువుల ఆక్రమణకు అడ్డుకట్ట వేస్తున్న ప్రభుత్వానికి సహకరించకుండా అడ్డుకోవడం సమంజసం కాదు’’ అని మండిపడ్డారు.