అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర ప్రాజెక్టులకు మోదీ సర్కారు నిధులు విదల్చక పోవడంతో పలు ప్రాజెక్టులు ప్రతిపాదనల్లోనే మగ్గుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణ శివార్లలో 369 ఎకరాల్లో రక్షణశాఖ ఏరోడ్రోమ్ ఉన్నా, విమానాశ్రయం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. ఇటీవల వరంగల్ విమానాశ్రయానికి పచ్చజెండా ఊపిన కేంద్ర పౌర విమాన యాన శాఖ ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని విస్మరించింది. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ కు కొత్తగా రైల్వే లైన్ నిర్మించాలనే దశాబ్దాల నాటి ప్రతిపాదనలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మరో వైపు 27 ఏళ్ల క్రితం మూతపడిన సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కర్మాగారం పునర్ ప్రారంభించలేదు. పెనుగంగా నదీ తీరంలోని బీడు భూములకు సాగునీరు అందించేందుకు ఉద్ధేశించిన చనఖా కోర్టా ప్రాజెక్టు నిర్మాణం అసంపూర్తిగానే మిగిలింది.ఆదిలాబాద్ లో రైతుల కోసం కృషి కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. మరో వైపు నవోదయ విద్యాలయం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది.
ప్రతిపాదనల్లోనే విమానాశ్రయం ఏర్పాటు
హైదరాబాద్ నిజాం పాలనలోనే ఆదిలాబాద్ శివార్లలో 369 ఎకరాల్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. 1947వ సంవత్సరం దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఈ ఏరోడ్రోమ్ రక్షణ శాఖ ఆధీనంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నియంత్రణలోకి వచ్చింది. 1970 వ సంవత్సరంలో పైలెట్లకు శిక్షణ ఇచ్చే హెలికాప్టర్లకు ఇంధనం నింపే కేంద్రంగా దీన్ని ఉపయోగించారు.ఆదిలాబాద్ హైదరాబాద్, నాగ్ పూర్ నగరాల విమానాశ్రయాలకు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు విమాన ప్రయాణం కోసం 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు.
భూసేకరణే ప్రధాన సమస్య
ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటు భూసేకరణ సమస్యగా మారింది. రక్షణ శాఖ ఆధీనంలోని 369 ఎకరాల స్థలాన్ని పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు బదలాయించాల్సి ఉంది. విమానాశ్రయం కోసం ఖానాపూర్, తంతోలి గ్రామాల శివార్లలో 1591 ఎకరాల భూమిని సేకరించాలని, దీని కోసం రూ.438 కోట్లు కావాలని రెవెన్యూ అధికారులు రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
ఆదిలాబాద్ వాసుల చిరకాల కలను నెరవేరుస్తాం : ఎంపీ, ఎమ్మెల్యే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బైసన్ పోలో మైదానాన్ని రక్షణ శాఖ సచివాలయం నిర్మాణం కోసం ఇవ్వలేదని అప్పటి సీఎం ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు స్థల సేకరణ చేయకుండా తాత్సారం చేశారని ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రక్షణ శాఖ భూమిని విమానాశ్రయం కోసం కేటాయించాలని తాము కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి అభ్యర్థించామని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రస్థుత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తామని హామి ఇచ్చిన నేపథ్యంలో తాము కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఆదిలాబాద్ వాసుల చిరకాల వాంఛ అయిన విమానాశ్రయం ఏర్పాటు చేపిస్తామని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ చెప్పారు. త్వరలో ఆదిలాబాద్ విమానాశ్రయం కల నెరవేరుతుందన్న ఆశలతో నెటిజన్లు కృత్రిమ మేధస్సును ఉపయోగించి విమానాశ్రయం చిత్రాన్ని రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
సిమెంటు కర్మాగారం పునరుద్ధరించేదెన్నడు?
ఆదిలాబాద్ సీసీఐ సిమెంటు కర్మాగారంలో యంత్రపరికరాలను తుక్కు కింద విక్రయించేందుకు మార్చి 6వతేదీన టెండర్లు పిలిచారు. సిమెంట్ కర్మాగారంలోని యంత్రాలను రూ.43 కోట్లకు తుక్కు కింద విక్రయించేందుకు సీసీఐ టెండర్లు పిలిచింది. సీసీఐ అధికారులు తుక్కు విక్రయించడంతో జాప్యం చేస్తున్నారు. మరో వైపు కొత్త యంత్రాలు తీసుకువచ్చి సీసీఐ కర్మాగారాన్ని పునర్ ప్రారంభించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. 2016వసంవత్సరం నుంచి సీసీఐను ప్రారంభిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నా, ఇప్పటి వరకు కదలిక లేదని రామన్న చెప్పారు.
చాందా బెల్లూరు వాసుల ఆవేదన
ఆదిలాబాద్ శివార్లలో సీసీఐ సిమెంటు కర్మాగారం నిర్మాణం కోసం కొన్నేళ్ల క్రితం చాందా బెల్లూరు వాసులు భూములు ఇచ్చినా, భూములు కోల్పోయిన రైతులకు కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చారని ఆదిలాబాద్ జిల్లా యువజన సంఘం నాయకుడు గాండ్ల భాస్కర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఫ్యాక్టరీ మూతపడటంతో ఉద్యోగాలు లేక, భూములిచ్చి సర్వం కోల్పోయి బెల్లూరు వాసులు అవస్థలు పడుతున్నారని భాస్కర్ ఆరోపించారు.ఫ్యాక్టరీ నడిచి నపుడు బెల్లూరు వాసులంతా ఆస్తమా బారిన పడ్డారని ఆయన చెప్పారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలున్నా ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం, సీసీఐ కర్మాగారం పునరుద్ధరణ, ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వేలైన్ నిర్మాణం, నవోదయ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయని భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సిమెంటు కర్మాగారాన్ని రాష్ట్రానికి అప్పగిస్తాం :ఎంపీ జి నగేష్
ఆదిలాబాద్ సీసీఐ సిమెంట్ కర్మాగారాన్ని పునర్ ప్రారంభించేందుకు వీలుగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ విషయమై తాను ఎమ్మెల్యే పాయల శంకర్ తో కలిసి కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించామని నగేష్ తెలిపారు.
ఆదిలాబాద్- ఆర్మూర్ రైలుమార్గం నిర్మించేదెన్నడు? ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వేలైన్ నిర్మించాలనే దశాబ్దాల నాటి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. ఈ కొత్త రైల్వే లైను నిర్మాణం కోసం సర్వే జరిగినా నిధులు మంజూరు చేయలేదు. రైల్వే లైను నిర్మాణం కోసం తాము కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అసంపూర్తిగానే చనఖా కోర్టా ప్రాజెక్ట్
ఆదిలాబాద్ జిల్లా జీవనాడి అయిన చనఖా కోర్టా ప్రాజెక్టు నిర్మాణం అసంపూర్తిగా మిగలడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెనుగంగా నదిపై రూ.369 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి గత బీఆర్ఎస్ పాలనలో 2015వ సంవత్సరంలో పనులు ప్రారంభించారు. ఆదిలాబాద్, బోథ్ అసెబ్లీ నియోజకవర్గాల్లోని 51వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు నిధుల కొరతతో నిలిచిపోయింది. నిర్మాణ జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.2000కోట్లకు పెరిగింది. ఈ బడ్జెట్ లో అయినా ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు.నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా నెరవేరలేదు.
బీజేపీ ప్రజాప్రతినిధులున్నా...
తెలంగాణలోని మారుమూల వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాపై కేంద్రం కరుణించడం లేదు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీగా బీజేపీకి చెందిన గెడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల శంకర్ లు ప్రాతినిధ్యం వహిస్తున్నా కేంద్రం జిల్లా ప్రాజెక్టులపై శీత కన్ను వేసింది. ఆదిలాబాద్ లో ఏరోడ్రోమ్ ఉన్నా విమానాశ్రయం ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. మరో వైపు ఆదిలాబాద్ వాసులకు ఉపాధి కల్పించే సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మూతపడి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం దీన్ని పునర్ ప్రారంభించడం లేదు. సీసీఐ ఫ్యాక్టరీ స్రాప్ మాత్రమేనని కేంద్రం ఇటీవల ప్రకటించింది.41 ఏళ్ల తర్వాత ఆదిలాబాద్ లో పర్యటించిన ప్రధాని మోదీ వరాలిచ్చినా ఆదిలాబాద్ కు రిక్తహస్తమే చూపించారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలున్నా, కేంద్రం నుంచి ఆదిలాబాద్ కు నిధుల జాడ లేదు.ఎన్నికల సమయంలో ఓటర్లకు హామిలిచ్చిన నేతలు వాటిని నెరవేర్చలేదు. ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన విశ్వవిద్యాలయం తీసుకువస్తామని ప్రధాని మోదీ ప్రకటించినా అది కాస్తా ములుగుకు మారింది. గిరిపుత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని ప్రకటించినా ఆ హామి నెరవేరలేదు.