Kavitha | ‘కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం’
x

Kavitha | ‘కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం’

అభివృద్ధి చేయలేని ముగ్గురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కాయని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి మచ్చుకకు అయినా కనిపించడం లేదని విమర్శించారు. కవిత.. శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత లక్కినేని సురేందర్‌ను పరామర్శించారు. అనంతరం నిర్వహించిన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమను గెలిపిస్తే ఆర్ఆర్ఆర్ సమస్య లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ ఆ సమస్య అలానే ఉందని విమర్శించారు. బాధితులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ హయాంలో చెప్పుకోవడానికి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారని, కానీ జిల్లా అభివృద్ధి మాత్రం శూన్యమని చురకలంటించారు. అభివృద్ధి చేయలేని ముగ్గురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటపడి తరిమైనా పథకాల అమలు చేసేలా చేస్తామని హామీ ఇచ్చారు. కురచ రాజకీయాల కోసం ప్రభుత్వం పర్యత్నిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల అంచనాలకు మించి కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ వారికి అంచనాలకు చేరువలో కూడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పైగా ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా ఏం చేయలేదన్నారు. దీనిపై ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఏడాదిన్నర పాలనలో దొంగ హామీలే తప్ప చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ పాలనపై ఖచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు. రైతుబంధు రాలేదు.. రైతుబీమా రాలేదు, పెన్షన్‌ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, కాంగ్రెస్ వన్నీ దొంగ మాటలేనన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కచ్చితంగా ఎండగడతామన్నారు. ఒక్క సురేందర్‌కే కాదు.. రాష్ట్రంలో కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటామన్నారు. ప్రజా క్షేత్రంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె హితబోధ చేశారు. రాజకీయాలన్నాక గెలుపోటములు సహజమని, ఒక్కసారి అధికారం వచ్చింది కదా అని అదే శాశ్వతం అనుకుంటే తెలివితక్కువ తనమే అవుతుందని చురకలంటించారు.

ఆంధ్రప్రవేశ్‌లో టీడీపీ, బీజేపీ పొత్తులో ఉండటం వల్లే ఏపీకి అనుమతులు వస్తున్నాయని అన్నారు. బనకచర్ల పర్మిషన్ ఇస్తే మరకు చాలా నష్టమని, మన కళ్లముందే తెలంగాణ నీళ్లు ఏపీకి తరలి వెళ్తున్నా ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయని కవిత గుర్తు చేశారు. కేంద్ర అనుమతులు లేకపోయినా ఆంధ్రలో ప్రాజెక్ట్‌లు కడుతున్నారని చెప్పుకొచ్చారు.

Read More
Next Story