తెలంగాణలో 40 ప్రాంతాల్లో పర్యావరణ పర్యాటక రంగాభివృద్ధి
x
పచ్చని చెట్లతో అలరారుతున్న మృగవని పార్కు

తెలంగాణలో 40 ప్రాంతాల్లో పర్యావరణ పర్యాటక రంగాభివృద్ధి

తెలంగాణలో పర్యావరణ పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను రూపొందించింది.ప్రకృతి సోయగాల మధ్య ఉన్న అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.


చుట్టూ పచ్చని ఎతైన చెట్లు...రంగురంగుల పక్షుల కిలకిలరావాలు...చెంగు చెంగున దూకుతూ పరుగెత్తె జింకలు...ఫారెస్ట్ మ్యూజియం...పర్యాటకుల విడిది కోసం నిర్మించిన రిసార్టు...ఇలా తెలంగాణలోని పలు ఎకో టూరిజం ప్రాజెక్టులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.

- హైదరాబాద్ నగర శివార్లలోని వనస్థలిపురం నిశ్చల వన్ ఎకో టూరిజం అనన్య రిసార్ట్, శామీర్ పేటలోని ఎకోటూరిజం అరణ్య రిసార్ట్, చిల్కూరులోని మృగవని నేషనల్ పార్కు రిసార్ట్ నగర పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
40 ఎకో టూరిజం ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
తెలంగాణ రాష్ట్రంలోని 12 సర్యూట్‌లలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.హైదరాబాద్ నగరంలోని సచివాలయంలోని అటవీ మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఎకో టూరిజం కన్సల్టేటివ్‌ కమిటీ ఉన్నతస్థాయి సమావేశంలో ఎకో టూరిజం ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికను రూపొందించారు.పర్యావరణానికి, వన్య ప్రాణులకు ఏ మాత్రం హాని కలగకుండా, వాటి సహజ ఆవాసాలను పరిరక్షిస్తూ, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ ఎకో టూరిజం పాలసీని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి సురేఖ తెలిపారు.
ఎన్నెన్నో అంశాలతో ఎకో టూరిజం ప్రాజెక్టులు
తెలంగాణలో ప్రకృతి సోయగాలతో కూడిన అటవీ ప్రాంతాల్లో వివిధ రకాల ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు ముందడుగు వేసింది.అడ్వెంచర్‌, రిక్రియేషన్‌, ఆధ్యాత్మికం,వారసత్వ,సినీ,వెడ్డింగ్‌,నేచర్‌ వైల్డ్‌లైఫ్‌,హెరిటేజ్‌-కల్చర్‌ అంశాల ఆధారంగా గుర్తించి వాటిని ఎకో టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేయాలని అటవీశాఖ నిర్ణయించిందని అటవీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం బ్యాక్ వాటర్ గాజుబిడెం వద్ద, నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ వద్ద, శ్రీరాంసాగర్ నందిపేట ఎకో టూరిజం ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ఆయన పేర్నొన్నారు.

మృగవని పార్కులో జింకలు

టూరిజం స్పాట్ల అభివృద్ధికి ప్రైవేటు భాగస్వామ్యం
ఎకో టూరిజం పాలసీ రూపకల్పనలో అటవీ,దేవాదాయ,రెవెన్యూ,పర్యాటకశాఖలతో సమన్వయంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ టూరిజం స్పాట్ల అభివృద్ధికి పబ్లిక్‌-ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌ పద్ధతిలో నిధులను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల,వలస పక్షుల ఆవాసాలు,జీవవైవిధ్య ప్రాంతాలు,వారసత్వ కట్టడాలున్న ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఎకో టూరిజం ప్రాజెక్టు మేనేజర్ సుమన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా,ప్లాస్టిక్ ఫ్రీ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందించామని ఆయన తెలిపారు. ఏ చిన్న ప్రాణికి కూడా హాని కలగని విధంగా ఎకో టూరిజం పాలసీ రూపకల్పన చేశామని ఆయన వివరించారు.

కేంద్రానికి ప్రతిపాదనలు
473 కోట్ల విలువైన ఎకో-టూరిజం సర్క్యూట్‌ల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.473 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి టూరిజం సర్క్యూట్ ప్యాకేజీల అభివృద్ధి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనను సమర్పించింది.


Read More
Next Story