బ్లేమ్ గేమ్ : అన్నీపార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్లను దెబ్బతీశాయా ?
x
Revanth, KTR and Ramachandra Rao

బ్లేమ్ గేమ్ : అన్నీపార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్లను దెబ్బతీశాయా ?

హైకోర్టు తీర్పుకు కారణం నువ్వంటే కాదు నువ్వే అని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి


స్ధానికసంస్ధల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిందంటే ఇప్పట్లో రిజర్వేషన్లు అమలుకావని అర్ధమైపోయింది. బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం జారీచేసిన జీవో 9 పై హైకోర్టు స్టే ఇవ్వటమే కాకుండా ఎన్నికల నోటిఫికేష్ పైన కూడా స్టే విధించింది. నిజానికి బీసీలకు 42శాతం రిజర్వేషన్ల(BC Reservations) అమలుపై మొదటినుండి చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వం జారీచేసిన జీవో న్యాయసమీక్షలో నిలబడదని ‘తెలంగాణ ఫెడరల్’ చాలాసార్లు అనుమానాలు వ్యక్తంచేసింది. చాలామంది అనుమానించినట్లుగానే హైకోర్టు జీవో 9 పై(MS GO 9) స్టే విధించటంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి.

హైకోర్టు తీర్పు నేపధ్యంలో తీరిగ్గా రాజకీయపార్టీల మధ్య బ్లేమ్ గేమ్ మొదలైంది. హైకోర్టు తీర్పుకు కారణం నువ్వంటే కాదు కాదు నువ్వే అని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వటానికి అన్నీపార్టీలూ కారణమే.

ఎలాగంటే, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినంత మాత్రాన జరిగేపనికాదు. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం కేంద్రపరిధిలోనిది కాని రాష్ట్రాలది ఎంతమాత్రం కాదు. తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలి. పార్లమెంటు ఆమోదంతో షెడ్యూల్ 9లో చేర్చాలి. తర్వాత రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత కాని బీసీలకు తెలంగాణలో 42శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినట్లు కాదు. తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానం రాష్ట్రపతి దగ్గర, రెండోసారి పంపిన తీర్మానం కేంద్ర హోంశాఖ దగ్గర ఇంకా పెండింగులోనే ఉన్నాయి.

బిల్లులు పెండింగులో ఉన్నాయన్న కారణంతో మూడోసారి అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేయించి ఆర్డినెన్స్ జారీచేసేసింది. ఆర్డినెన్స్ అమలుకు ఏకంగా ప్రభుత్వం జీవో9ని జారీచేసింది. నిజానికి ఆర్డినెన్స్ ఇంకా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గర పెండింగులో ఉంది. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగులో ఉండగా ప్రభుత్వం జీవోను జారీచేయటం తప్పు. ప్రభుత్వం జారీచేసే ప్రతి జీవో కూడా బై ఆర్డర్ ఆఫ్ ది గవర్నర్ అనే ఉంటుంది. అలాంటిది గవర్నర్ ఆమోదంలేకుండానే ఒక జీవోను ప్రభుత్వం ఎలా జారీచేస్తుంది ? చేయటం తప్పు.

స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఛాంపియన్ అనిపించుకునేందుకే రేవంత్ ఇంత తతంగాన్ని నడిపించారనటంలో సందేహంలేదు. బీసీల ఓట్లు కొల్లగొట్టి అత్యధిక సీట్లు సాధించటమే రేవంత్ లక్ష్యం. అందుకనే ఇంతహడావుడి చేశారనటంలో సందేహంలేదు. రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉన్న బిల్లును ఆమోదించాలనే డిమాండుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర భారీ ఆందోళన చేయటం కూడా ఇందులో భాగమే. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అసెంబ్లీలో బిల్లును ఏకగ్రీవ ఆమోదానికి సహకరించిన బీఆర్ఎస్, బీజేపీలు బయట ఏమాత్రం సహకరించలేదు. జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేయాలని ప్రభుత్వం ఆహ్వానిస్తే బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతలు హాజరుకాలేదు.

నిజంగానే బీఆర్ఎస్ కు బీసీల పార్టీగా పేరుందన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన నిజమే అయితే మరి జంతర్ మంతర్ ఆందోళనకు ఎందుకు పార్టీ హాజరుకాలేదు ? పార్టీ ఎంపీలతో పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లును ఎందుకు మూవ్ చేయించలేకపోయారు ? రేవంత్ ఆధ్వర్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలవటం బీఆర్ఎస్ కు ఇష్టంలేదా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కీలకనేతలు అనుకూలంగా కాని వ్యతిరేకంగా కాని ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడలేదు. హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వాన్ని తప్పుపడుతు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం అందరు చూస్తున్నదే.

ఇక బీజేపీ విషయం చూస్తే అసెంబ్లీలో బిల్లుకు మద్దతిచ్చిన ఎంఎల్ఏలు కేంద్రంలో రాష్ట్రపతి సంతకం కోసం ప్రయత్నించలేదు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం మద్దతు కోరుతు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖకు సమాధానం రాలేదు. అఖిలపక్షాన్ని తీసుకొచ్చి మాట్లాడుతానని రేవంత్ అపాయిట్మెంట్ అడిగినా మోదీ ఇవ్వలేదు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలున్నారు. వీరిలో కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ నుండి జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉండి కూడా మోదీ అపాయింట్మెంట్ ఇప్పించలేకపోయారంటే ఏమిటర్ధం ? కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లును పార్లమెంటులో చర్చకుపెట్టి చట్టబద్దత తీసుకొచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం సహకరిస్తుందని ఎవరు అనుకోలేదు. కాని కనీసం ఒక ముఖ్యమంత్రి అడిగినపుడు మోదీ అపాయిట్మెంట్ అయినా ఇవ్వాలి కదా ? అందుకనే బిల్లుకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డుపడ్డారని రేవంత్ పదేపదే ఆరోపిస్తున్నది.

రేవంత్ ఆధ్వర్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలవటం బీఆర్ఎస్, బీజేపీలకు ఏమాత్రం ఇష్టంలేదన్న విషయం ఇపుడు అందరికీ అర్ధమైపోయింది. నేతల్లో స్వార్ధం ఇంతగా పెరిగిపోయింది కాబట్టే బీసీ రిజర్వేషన్ల లాంటి సున్నితమైన సామాజిక అంశాలు కూడా బాగా వివాదాస్పదమైపోతున్నాయి.

పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం : పర్వతం

ఇదే విషయమై అంబేద్కర్ కాలేజీ పొలిటికల్ సైన్స్ లెక్షిరర్ డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ మాట్లాడుతు అన్నీ పార్టీలు అగ్రకులాల పార్టీలు కావటమే బ్లేమ్ గేమ్ కు కారణమన్నారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ బీసీల సమస్యలకు ఏ పార్టీ కూడా పరిష్కారం చూపించలేకపోతోంద’’న్నారు. ‘‘బీసీల్లో తగినంత రాజకీయ చైతన్యం లేకపోవటమే కారణమ’’ని అభిప్రాయపడ్డారు. ‘‘ పార్టీల ద్వారా కాకుండా సమస్యల పరిష్కారంపై బీసీల్లో సోషల్ మీడియా ద్వారానే చైతన్యం మొదలైంద’’ని చెప్పారు. ‘‘ జీవో 9 పై హైకోర్టు స్టే ఇవ్వటం, జీవోకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటీషన్ వేయటం వెనుక రేవంత్ ప్రభుత్వం ఉంద’’ని ఆరోపించారు. ‘‘హైకోర్టులో పిటీషన్ ఇంకా పెండింగులో ఉండగానే సుప్రింకోర్టులో పిటీషన్ వేశారంటేనే రేవంత్ హస్తం ఉందని అర్ధమైపోతోంద’2ని చెప్పారు. ‘‘అగ్రకులాల పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కారణంగానే హైకోర్టు స్టే ఇచ్చింద’2ని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ లు లోపాయికారీగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నాయ’’ని ఆరోపించారు. ‘‘బీసీ సమస్యల మీద పోరాటం చేస్తున్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక్కటే’’ అని పర్వతం చెప్పారు.

బీసీలను ఓటర్లుగానే చూస్తున్నాయి : కొంకల

సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, కొంకల వెంకటనారాయణ మాట్లాడుతు ‘‘బీసీలను ఓట్లకోసమే పార్టీలు చూస్తున్నాయ’’ని ఆరోపించారు. ‘‘బీసీల సమస్యల పరిష్కారంలో అన్నీపార్టీల తీరు ఒకటిగానే ఉన్నాయ’’ని మండిపడ్డారు. ‘‘రిజర్వేషన్ల విషయంలో ఏపార్టీకి కూడా చిత్తశుద్ది లేద’’ని ఆక్షేపించారు. ‘‘బీసీల్లో పదవులు, ఇతరత్రా ఫలాలు యాదవులు, ముదిరాజు, గౌడ్ల లాంటి కొన్ని కులాలకు మాత్రమే పరిమితమయ్యాయ’’నే అసంతృప్తిని వ్యక్తంచేశారు. ‘‘అందరి సంక్షేమానికి అప్పుడు బీఆర్ఎస్ ఇపుడు కేంద్రంలోని బీజేపీ కూడా పనిచేయటంలేద’’ని అభిప్రాయడ్డారు.

బీసీల ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం : రాజు నేత

బీసీల ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం తప్పదని బీజేపీ రాష్ట్రనాయకుడు రాజు నేత హెచ్చరించారు. బీసీల నోటికాడ కూడులక్కున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని మండిపడ్డారు. బీసీ ప్రయోజనాలకు కాంగ్రెస్ గండికొట్టే వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తరోకోలు, నిరాహార దీక్షలు, ఆమరణదీక్షలు, బందులు చేయక తప్పదన్నారు. ఈనెల 14వ తేదీ తెలంగాణ బందుకు రాష్ట్రవ్యాప్తంగా పిలుపిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోని 2.5 కోట్లమంది బీసీల ప్రయోజనాల కోసం చేస్తున్న బంద్ లో అందరు పాల్గొనాలని పిలుపిచ్చారు.

బీసీ ద్రోహులుగా మారద్దు: శ్రీనివాస్ నేత

పార్టీల్లోని బీసీ సామాజికవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు బయటకు రావాలని మిర్యాలగూడ, బీసీ సంఘాల జేఏసీ నేత మారం శ్రీనివాస్ నేత వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న బీసీల ప్రజాప్రతినిధులు ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు అందరు జేఏసీగా ఏర్పాటవ్వాలని సూచించారు. జేఏసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం చేయకపోతే బీసీల ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

Read More
Next Story