Allu Arjun | ప్రశాంత్ కిషోర్‌తో అల్లు అర్జున్ భేటీ?
అల్లు అర్జున్.. కొంతకాలంలో సినిమాల పరంగానే కాకుండా పొలికల్‌గా కూడా హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు.
అల్లు అర్జున్(Allu Arjun).. కొంతకాలంలో సినిమాల పరంగానే కాకుండా పొలికల్‌గా కూడా హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ(YCP) ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారెడ్డిని బన్నీ కలిశాడు. దాంతో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య చీలికలు వచ్చాయని అప్పటి నుంచి వార్తలు ప్రచారం అవుతున్నాయి. పుష్ప-2(Pushp 2) రిలీజ్ సమయంలో కూడా మెగా ఫ్యాన్స్‌లో కూడా అల్లు అర్జున్ సినిమాను బాయ్ కాట్ చేయాలన్న చర్చ కూడా జోరుగానే సాగింది. దీని ఎఫెక్ట్ కూడా పుష్ప-2పై గట్టిగానే పడిందని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ కూడా సొంత పార్టీ పెట్టనున్నాడని, జనసేనను ఢీ కొట్టడానికే పొలిటికల్ బరిలోకి బన్నీ దిగనున్నాడంటూ రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇంతలో రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్‌తో అల్లు అర్జున్.. గురువారం భేటీ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్, బన్నీ వాసు, ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త కొడుకు కలిసి పీకేతో రెండు మూడు గంటల పాటు చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి. ఈ భేటీ.. సొంత పార్టీ గురించేనని, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రచారం ఏ విధంగా చేయాలని, ఎప్పుడు స్టార్ట్ చేయాలి వంటి అనేక అంశాలపై పీకేతో బన్నీ చర్చించారని వార్తలు వస్తున్నాయి. వాటికి తగ్గట్టుగానే పీకే కూడా పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
పీకే ఇచ్చిన సలహాలివే..
రాజకీయాల్లోకి రావాలంటే ఇప్పుడు సినిమా ఫేమ్ ఒక్కటి సరిపోదని, ప్రజలల్లోకి మరింత లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉందని పీకే చెప్పాడని తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు ఇప్పుడప్పుడే సినిమాలు ఆపే ఆలోచన లేదు కాబట్టి కాస్తంత ఆచితూచి రాజీకాయల వైపు అడుగు వేయాలని పీకే చెప్పారట. సినిమాలకు గుడ్ బై చెప్పాలంటే ఇంకా కనీసం పదేళ్లయినా పడుతుంది కాబట్టి.. ముందుగా అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని, పలు సేవా సంఘాలు, బ్లండ్ బ్యాంక్స్, పేదలను ఉచితంగా ఆపరేషన్స్ వంటి చేయిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని, సినిమాలు ఆపేద్దాం అనుకున్న తర్వాత అందుకు రెండు మూడేళ్ల ముందు పార్టీని స్థాపించాలని పీకే సలహా ఇచ్చాడని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. పీకే సలహాలు, సూచనల మేరకు అల్లూ ఫ్యామిలీ అతి త్వరలోనే పలు రకాల సోషల్ సర్వీస్‌లను ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఇందులోనూ చిరంజీవే స్ఫూర్తి..
ఈ అంశంలో కూడా మెగాస్టార్ చిరంజీవినే స్ఫూర్తిగా తీసుకోవాలని అల్లు అర్జున్న భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. తన పొలికల్ ఎంట్రీకన్నా ముందు చిరంజీవి ఎలా అయితే బ్లడ్ బ్యాంక్ పెట్టారో అదే బాటలో బన్నీ కూడా వెళ్లాలని ఆలోచన చేస్తున్నారట. బన్నీ కూడా ఓ ప్రత్యేక బ్లడ్ బ్యాంక్ పెట్టాలని, ఆతర్వాత పలు ఇతర సోషల్ సర్వీస్‌లను స్టార్ట్ చేయాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి బన్నీ సిద్ధమయ్యాడని సమాచారం. కాకపోతే పొలిటికల్ ఎంట్రీ అంటే బన్నీ.. ఇప్పుడున్న ఏదైనా పార్టీలో చేరతారా? లేకుంటే పవన్ కల్యాణ్, విజయ్ తళపతి తరహాలో సరికొత్త పార్టీని స్థాపిస్తారా అన్నది మాత్రం క్లారిటీ లేదు.
అవన్నీ అవాస్తవాలే..: బన్నీ టీమ్
ఇదిలా ఉంటే అల్లు అర్జున్.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను కలిశారని వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో వీటపై బన్నీ టీమ్ స్పందించింది. ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అల్లు అర్జున్‌కు లేదని తేల్చి చెప్పింది. తమ స్వలాభం కోసం కొన్ని మీడియా ఔట్‌లెట్లు ఈ వార్తలను ప్రచారం చేస్తుందని, అవన్నీ ఫేక్ అని వెల్లడించింది.
వీటికి బీజం ఎక్కడ పడిందంటే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా.. వైసీపీని చిత్తు చేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అదే విధంగా మరోసారి అధికారంలోకి వచ్చి తమ ఆధిపత్యం చూపించుకోవాలని వైసీపీ నేతలు కూడా భారీగానే వ్యూహాలు రచిస్తున్నారు. ఆ సమయంలో తనకు మామయ్య వరస అయ్యే పవన్ కల్యాణ్ కూటమి ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి శిల్పారెడ్డిని బన్నీ కలిశారు. రావొద్దు.. ఇబ్బంది అవుతుందని చెప్పినా తానే కావాలని కలిశానని బన్నీనే స్వయంగా చెప్పాడు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య కన్నా అభిమానుల మధ్య దూరం పెరిగింది. మెగా ఫ్యామిలీని డామినేట్ చేయాలన్న ఉద్దేశంతోనే అల్లు అర్జున్ ఇలా చేస్తున్నారని చాలా మంది అనుకున్నారు.
కానీ మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య వివాదానికి బీజం 2017లో పడిందని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. ఆ ఏడాది ‘సరైనోడు’ సినిమా సక్సెస్ మీట్‌లో పీకే ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ అనలాంటూ కేకలు వేశారు. దానికి బన్నీ ‘చెప్పను బ్రదర్’ అని బదులిచ్చారు. అక్కడ మొదలైంది ఈ గొడవ. అల్లు అర్జున్‌పై పీకల్లోతు కోపంలో ఉన్న పవన్ ఫ్యాన్స్ అంతా కూడా సరైన ఛాన్స్ కోసం ఎదురు చూశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ చేసిన సినిమా ‘డీజే’. ఆ సినిమా టీజర్ విడుదలైంది. అప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తమ ప్రతీకారం తీర్చుకున్నారు. డీజే టీజర్‌పై డిజ్‌లైక్‌ల వర్షం కురిపించారు. వారి దెబ్బకు ఇప్పటికి కూడా భారతదేశంలో అత్యంత డిస్‌లైక్స్ అందుకున్న వీడియోల జాబితాలో ఈ టీజర్ టాప్‌లోనే ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో అక్కడ ప్రచారానికి బన్నీ కూడా వస్తాడా రాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కానీ తాను ప్రచారానికి రాలేదు. తన మద్దతు ఎప్పుడూ పవన్‌కి ఉంటుందని ట్వీట్ చేసి ఊరుకున్నాడు బన్నీ. దాంతో సినిమా షూట్‌లో బిజీగా ఉన్నాడేమో అని పీకే ఫ్యాన్స్ సర్దిచెప్పుకున్నారు. కానీ కొన్ని రోజుల్లోనే బన్నీ.. నంద్యాలలో వైసీపీ తరపున ఎన్నికల బరిలో ఉన్న శిల్పా రవిని కలవడంతో చిచ్చు మొదలైంది. మామకు హ్యాండ్ ఇచ్చి అతని శత్రువుతో చేతులు కలుపుతావా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బన్నీపై ట్వీట్లు గుప్పించారు. దీంతో నివురు గప్పిన నిప్పులా ఉన్న మెగా, అల్లు వివాదం మరోసారి పిఠాపురం సాక్షిగా భగ్గుమంది.
క్లారిటీ ఇచ్చిన చల్లారని మంటలు
అయితే తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, శిల్పా రవి తనకు మంచి మిత్రుడని, అందుకే అతడిని కలవడానికి వెళ్లానని బన్నీ మరోసారి తన చర్యలకు వివరణ ఇచ్చుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. ఇప్పటికి కూడా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం రగులుతూనే ఉంది. అభిమానుల మధ్య కూడా ఈ మంటలు కనిపిస్తూనే ఉన్నాయి.