అప్పుడే సునీతను బీఆర్ఎస్ వదిలేసిందా ?
x
Maganti Sunitha

అప్పుడే సునీతను బీఆర్ఎస్ వదిలేసిందా ?

పోలింగ్ రోజున ప్రముఖ నేతలు ఎవరూ సునీత పక్కన కనబడలేదు


మంగళవారం జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక వ్యవహారం చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం మొదలైంది. కారణం ఏమిటంటే ఉదయం పోలింగ్ మొదలైన దగ్గర నుండి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసేవరకు నియోజకవర్గంలోని చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత(Maganti Sunitha) మాత్రమే కనిపించారు. సునీత కొన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించినపుడు మీడియాతో మాట్లాడారు. ఆమె ఎక్కడ మాట్లాడినా ఒంటరిగానే కనిపించారు కాని పక్కన బీఆర్ఎస్(BRS) లోని ప్రముఖ నేతల్లో ఏ ఒక్కరు కనిపించలేదు. ప్రచారంలో అన్నీ తానై నడిపించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), ప్రచారంచేసిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల్లో ఒక్కళ్ళు కూడా ఎందుకు లేరు.

పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ దౌర్జన్యంచేస్తోందని సునీత గోలగోలచేస్తుంటే ఆమెకు మద్దతుగా పక్కన ఒక్క సీనియర్ నేతకూడా కనబడలేదు. కేటీఆర్ లేదా మిగిలిన సీనియర్ నేతలు పార్టీఆఫీసులో కూర్చుని ఓటింగ్ సరళిని తెలుసుకున్నట్లున్నారు. జరిగిన ఓటింగ్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందన్న అంచనాతోనే క్షేత్రస్ధాయిలో సీనియర్ నేతల్లో ఒక్కళ్ళు కూడా కనిపించలేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోలింగ్ అయిపోయిన తర్వాత సునీత కనబడలేదు కాని సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పార్టీఆఫీసు మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటమే విచిత్రంగా ఉంది.

పోలింగ్ ముగిసిన తర్వాత 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్ అంటు కొన్ని సర్వే సంస్ధలు ఊదరగొట్టేశాయి. సర్వే సంస్ధలన్నీ చెప్పింది ఒకటేమాట. అదేమిటంటే కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని. పోలైన ఓట్లలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య సుమారు 6-7 శాతం ఓట్లు తేడా ఉంది. 7శాతం ఓట్ల తేడాతో నవీన్ గెలుస్తున్నాడన్నది నిజమే అయితే కంఫర్టబుల్ విక్టరీ అనే అనుకోవాలి.

పోలింగు గనుక బీఆర్ఎస్ కు అనుకూలంగా జరిగిందన్న అంచనాలు ఉండుంటే కేటీఆర్ తో పాటు ప్రజాప్రతినిధులు, సీనియర్లను పట్టడం చాలా కష్టమయ్యేది. పోటాపోటీగా మీడియా ముందుకొచ్చి నానా రచ్చ చేసుండే వారనటంలో సందేహమే లేదు. కేటీఆర్ తో సహా సీనియర్లంతా మీడియాకు మొహం చాటేశారు అంటేనే గెలుపుపై నమ్మకం లేదన్న విషయం అర్ధమైపోతోంది. ఇదేసమయంలో ఉదయం 10 గంటల నుండి పోలింగులో అక్రమాలు జరిగిపోతున్నాయని, కాంగ్రెస్ దౌర్జన్యాలు చేస్తోందని సునీత నానా గోలగోల చేశారు. విచ్చలవిడిగా దొంగఓట్లు వేయించుకుంటున్నారంటు నానా గోలచేశారు. అప్పటికేదో దౌర్జన్యాలు, దొంగఓట్లంటే బీఆర్ఎస్ కు అసలు తెలీనే తెలీదన్నట్లుగా సునీత బిల్డప్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉన్నపుడు ఎన్నికలైనా, ఉపఎన్నికలైనా బీఆర్ఎస్ కూడా ఎన్నో దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడిన విషయం బహుశా సునీత మరచిపోయినట్లున్నారు.

పోలింగ్ సరళిని, ఎగ్జిట్ పోల్స్ ను గమనించిన తర్వాత సునీత అవసరం ఇక బీఆర్ఎస్ కు పెద్దగా ఉండదన్న విషయం అర్ధమవుతోంది. ఫలితాన్ని ముందుగానే అంచనావేసుకున్నారు కాబట్టే కేటీఆర్ మొదలు సీనీయర్ నేతలంతా ఉదయం నుండి సునీత పక్కన ఒక్కళ్ళు కూడా కనబడలేదు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏ విషయం 14వ తేదీ అధికారికంగా క్లారిటి వచ్చేస్తుంది కాబట్టి అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.

Read More
Next Story