
అక్కచెల్లెళ్ళను టిప్పర్ రూపంలో మృత్యువు వెంటాడి వేటాడిందా ?
మృత్యువు వాళ్ళని సొంతూరు నుండి వెంటాడి, రైలు ఎక్కనీయకుండా బస్సు ఎక్కేట్లు చేసిందని అనుకోవాలా ?
విధి లిఖితాన్ని ఎవరు తప్పించలేరని పెద్దలు చెబుతుంటారు. నిజంగా ఇది అక్షరాల నిజమే అని సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రుజువైంది. లేకపోతే రైలులో ప్రయాణించాల్సిన వాళ్ళు చివరకు బస్సులో ప్రయాణించటం ఏమిటి ? వాళ్ళు ప్రయాణించిన బస్సు ప్రమాదానికి గురై చనిపోవటం ఏమిటి ? అంటే మృత్యువు వాళ్ళని సొంతూరు నుండి వెంటాడి, రైలు ఎక్కనీయకుండా బస్సు ఎక్కేట్లు చేసిందని అనుకోవాలా ? ఆ బస్సుకు జరిగిన ప్రమాదంలో వీళ్ళని కబళించిందని అనుకోవాలా ?
విషయం ఏమిటంటే ఈరోజు జరిగిన ప్రమాదంలో 24 మంది చనిపోయిన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో తాండూరుకు చెందిన వాళ్ళు ఎక్కువమందున్నారు. వీరిలో ముగ్గురు అక్కచెల్లెళ్ళు కూడా ఉన్నారు. బస్సు-టిప్పర్ ప్రమాదంలో తన ముగ్గురు కూతుళ్ళని కోల్పోయిన విషయం తెలుసుకుని తల్లి, దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు వాస్తవ్యుడు ఎల్లయ్య గౌడ్ కు నలుగురు కూతుర్లు. వీరిలో పెద్ద కూతురుకు అక్టోబర్ 15వ తేదీన వివాహం అయ్యింది. మిగిలిన ముగ్గురు కూతుర్లు తనూష, సాయిప్రియ, నందిని హైదరాబాదులో చదువుకుంటున్నారు. అక్క వివాహానికి ముగ్గురూ తాండూరుకు చేరుకున్నారు.
వివాహం బ్రహ్మాండంగా జరిగింది. వివాహం తాలూకు మధుర జ్ఞాపకాలను మోసుకుంటు ముగ్గురు అక్క, చెల్లెళ్ళు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ కు బయలుదేరారు. తాండూరు నుండి వీళ్ళు హైదరాబాదుకు చేరుకునేందుకు తండ్రి రైల్వే స్టేషన్ కు తీసుకెళ్ళారు. తెల్లవారుజామున రైల్వేస్టేషన్ కు వెళ్ళేటప్పటికి రైలు బయలుదేరేసింది. దాంతో ఎందులో అయితే ఏమైందని కూతుర్లను తండ్రి బస్సు ఎక్కించాడు. బస్సు ఎక్కటమే తెల్లవారుజామున కావటంతో బస్సులోకి ఎక్కగానే ముగ్గురూ నిద్రలోకి జారుకున్నారు. చేవెళ్ళకు సమీపంలోని మీర్జాగూడ దగ్గరకు బస్సు రాగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన కంకర టిప్పర్ బస్సును ఢీకొట్టింది.
ఎప్పుడైతే టిప్పర్ బలంగా బస్సును ఢీ కొట్టిందో వెంటనే టిప్పర్లోని కంకరంతా బస్సులోకి జారిపోయింది. కంకర బస్సులోకి జారిపోయి ప్రయాణీకులను నిలువునా ముంచేసింది. ఏమి జరుగుతోందో తెలుసుకునేలోపే కంకర బస్సు డ్రైవర్ సీటు వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణీకులను ముంచేసింది. నిలువునా కంకరలో కూరుకుపోవటంతో కూర్చున్నవారిలో అత్యధికులు కూర్చున్నట్లే కూరుకుపోయి ఊపిరి ఆడక చనిపోయారు. మీదపడిన కంకరనుండి తప్పించుకుని బయటపడేందుకు కూడా అవకాశం దక్కలేదు. కంకరలో కూరుకుపోయి ఊపిరి అడక చనిపోయిన వారిలో ముగ్గురు అక్క, చెల్లెళ్ళు కూడా ఉన్నారు.

