ఎమ్మెల్సీ ఎన్నికలతో కిషన్ చేయి కాల్చుకున్నారా..!
x

ఎమ్మెల్సీ ఎన్నికలతో కిషన్ చేయి కాల్చుకున్నారా..!

ఎన్నికలో ఓటమి అనేది బీజేపీకి అనివార్యం. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్న విశ్లేషకులు. బీజేపీకి ఏం సూచనలు చేస్తున్నారు.


హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కొన్ని రోజులుగా హాట్‌టాపిక్‌గా మారాయి. అందుకు దాదాపు 22 ఏళ్ల తర్వాత ఇక్కడ పోలింగ్ జరగడమే కారణం. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఏదైనా ఒక పార్టీకే పట్టం కడుతూ మిగిలిన పార్టీలు పోటీకి దూరంగా ఉండేవి. కానీ ఈసారి ఈ సంప్రదాయాన్ని మార్చాలని బీజేపీ డిసైడ్ అయింది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఎన్నిక జరగాల్సిందేనని కోరుకుంది. అందుకే తమ తరపున గౌతంరావును బరిలోకి దిగించింది. దీంతో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థి మధ్య మంచి పోటీ నెలకొంటుందని అనుకున్నారు. కానీ అటువంటిదేమీ కనిపించలేదు. ఎవరి ఓట్లు వారికే పడ్డాయి. ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించాడు. ఈ స్థానంలో మొత్తం 112 ఓట్లు ఉండగా.. పోలింగ్‌లో కేవలం 88 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో ఎంఐఎం అభ్యర్థికి 63 ఓట్లు రాగా, బీజేపీకి వారికి ఉన్న 25ఓట్లు వచ్చాయి.

కిషన్ ప్లాన్ పారలేదా..!

ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న బీజేపీ ఈసారి మాత్రం ఎలాగైనా హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలో పోలింగ్ జరిగేలా చేయాలని అనుకుంది. అదే విషయాన్ని కొందరు పార్టీ నేతలు కూడా వెల్లడించారు. గెలుపోటముల కోసం పోలింగ్ జరగాలన్న ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నామని చెప్పారు. తీరా బరిలోకి దిగి ఏమైనా మార్పు సాధించారా అంటే అదేమీ లేదు. కనీసం ఒక్కటంటే ఒక్క ఓటు కూడా బీజేపీకి అదనంగా పడలేదు. వారికి ఉన్న 25ఓట్లు మాత్రమే పడ్డాయి. కనీసం ఓట్లను చీల్చగలం అన్న ఉద్దేశంతో బరిలోకి దిగిన బీజేపీకి ఇది ఎదురుదెబ్బే. ఈ విషయంలో కిషన్ రెడ్డి వేసిన ప్లాన్స్ అన్నీ బెడిసి కొట్టాయి. వ్యూహాలు నిర్వీర్యమయ్యాయి. అవతల పార్టీకి చెందిన ఒక్క ఓటు కూడా రాకపోవడంతో ఈ ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచించి కిషన్ రెడ్డి చేతులు కాల్చుకున్నారా? అని నిపుణులు అంటున్నారు. మరోసారి ఇలాంటి ప్రయోగాలు చేస్తానంటూ కిషన్‌కు అధిష్ఠానం ఓకే చెప్తుందా? అన్న సందేహాలను లేవనెత్తుతున్నారు.

సమర్థించుకునే పనిలో బీజేపీ

అయితే హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం కొత్త విషయం ఏమీ కాదు. ఎవరూ ఊహించనిది అంతకంటే కాదు. అందుకూ అనుకున్న ఫలితాలో ఈ ఎన్నికల్లో వచ్చాయి. ఈ విషయం బీజేపీకి కూడా తెలుసు. కానీ తమ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఏమాత్రం ఫలించడం లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ కుట్ర చేసిందంటూ బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు విమర్శించారు. “ఓటు వేయొద్దని మీ పార్టీ నేతలే చెబితే, మీరు రేపు ప్రజలను ఓటు వేయమని ఎలా అడుగుతారు?” అని ప్రశ్నించారు గౌతమ్ రావు. అలాగే, ‘‘ఎంఐఎం పార్టీ చేతుల్లో కాంగ్రెస్ పనిచేస్తోంది. ఈ ఎన్నికల ఫలితంతో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని స్పష్టమైంది. తెలంగాణ ప్రజలు ఈ కుమ్మక్కును గుర్తించాలి’’ అని పిలుపునిచ్చారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్దగా ఎఫెక్ట్ చూపట్లేదు. అసలు ఈయన ఏం మాట్లాడుతున్నారని అనేలా ఉన్నాయి.

బహిరంగంగానే ప్రకటించిన కాంగ్రెస్

ఎంఐఎంకు తాము మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ బహిరంగంగానే ప్రకటించింది. తమ మిత్రపక్షాన్ని గెలుపించుకోవడానికి ప్రతి పార్టీ సహాయం చేస్తుంది. అది ప్రత్యర్థి పార్టీపై చేసే కుట్ర కాదు. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా అదే జరిగింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని బీజేపీ నేత కుట్రగా అభివర్ణించడం జోక్‌ అయిపోయింది. ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపడమే కాకుండా, ఆత్మవిమర్శ చేసుకోవడంలో కూడా బీజేపీ విఫలమైందంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికల సమయంలో తమ మిత్రపక్షం నేతల కోసం బీజేపీ నేతలు ఎందరు ప్రచారాలు చేయలేదు, అవి కూడా కుట్రలేనా అని విమర్శిస్తున్నారు.

బీజేపీ ఫోకస్ పెట్టాల్సింది దానిపైనే

అయితే ఎమ్మెల్సీ ఎన్నికలో ఓడిపోయిన బీజేపీకి విశ్లేషకులు పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఈ ఎన్నికలో ఓటమి అనేది బీజేపీకి అనివార్యం. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ బీజేపీ గెలవాలని కోరుకున్నవారు కూడా పెద్ద సంఖ్యలో లేరు. ఆ పార్టీ వాళ్లు తప్ప. అదే ఫలితాల్లో ప్రతిబింబించింది. అయితే ఇప్పుడు బీజేపీ తమ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకూడదు. ప్రత్యర్థుల నుంచి ఒక్కటంటే ఒక్క ఓటును కూడా తమకు పడేలా చేసుకోవడంలో తాము ఎక్కడ విఫలం అయ్యామన్న అంశంపై దృష్టి పెట్టాలి. దానిపై చర్చించి.. పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలని కార్యాచరణ సిద్ధం చేసుకోవాలే తప్ప ఇలాంటి కుంటి సాకులు చెప్పి ఓటముల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించ కూడదంటూ విశ్లేషకులు చెప్తున్నారు.

Read More
Next Story