
గద్వాలలో కేటీఆర్ ప్లాన్ ఫెయిలైందా ?
ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డైడ్ అన్నట్లుగా బహిరంగసభ జరిగింది కాని ప్లాన్ వర్కువుట్ కాలేదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల బహిరంగసభ ప్లాన్ ఫెయిలైంది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డైడ్ అన్నట్లుగా బహిరంగసభ జరిగింది కాని ప్లాన్ వర్కువుట్ కాలేదు. కాస్త కన్ఫ్యూజన్ గా ఉందా ? ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్(BRS) ఆధ్వర్యంలో గద్వాలలో బహిరంగసభ జరిగింది. సభ ఉద్దేశ్యం ఏమిటంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలపై ఒత్తిడి పెంచటమే. పదిమంది ఫిరాయింపులపై(BRS Defection MLAs) ఎలాగైనా అనర్హత వేటు వేయించాలన్నది కేటీఆర్(KTR) పట్టుదల. అనర్హత వేటునుండి తప్పించుకుకోవాలన్నది ఫిరాయింపుల వ్యూహం. ఇందులో భాగంగానే ఫిరాయింపుల్లో చాలామంది తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కాంగ్రెస్(Telangana Congress)లో చేరలేదని పదేపదే చెబుతున్నారు.
తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామనేందుకు స్పీకర్ కు కొన్ని సాక్ష్యాలను కూడా చూపించారు. సాక్ష్యాలు ఏమిటంటే అసెంబ్లీ రికార్డుల్లో తాము బీఆర్ఎస్ ఎంఎల్ఏలుగానే ఉండటం. మొన్ననే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో పార్టీల వారీగా ఎంఎల్ఏల సంఖ్యను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చదివి వినిపించారు. అప్పుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏల బలం 37గా స్పీకర్ ప్రకటించారు. ఇక రెండో సాక్ష్యం ఏమిటంటే ఎంఎల్ఏల జీతంలో నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రతినెలా రు. 5 వేలు పార్టీ ఫండ్ కింద కట్ చేస్తోంది. తమజీతాల్లో నుండి మార్చివరకు ప్రతినెలా రు. 5 వేలు పార్టీ కట్ చేసినట్లుగా బ్యాంకు ట్రాన్సాక్షన్ స్టేట్ మెంటును ఫిరాయింపులు ఆధారంగా చూపించారు.
సరే, ఇవన్నీ పక్కనపెట్టేస్తే కోర్టుద్వారా ఫిరాయింపులపై అనర్హత వేటు పడేవిషయంలో కేటీఆర్ కు అనుమానం వచ్చినట్లుంది. అందుకని ఏమిచేశారంటే 10మంది ఫిరాయింపుఎంఎల్ఏల నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే ఫిరాయింపులు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకుంటున్నది నిజమే అయితే బహిరంగసభల్లో పాల్గొని అధ్యక్షత వహించాలన్నది కేటీఆర్ ఆలోచన. ఫిరాయింపుల్లో ఎవరైనా బహిరంగసభలో పాల్గొంటే అప్పుడు కేటీఆర్ ఏమిచేస్తారు ? అనే విషయంలో క్లారిటిలేదు. ఇదేసమయంలో ఫిరాయింపులు బహిరంగసభల్లో పాల్గొంటే నేతలు, క్యాడర్ ఊరుకుంటారా ? ఈవిషయాన్ని ఫిరాయింపులు ఆలోచించకుండానే ఉంటారా ? ఎవరి ఆలోచన ఎలాగున్నా గద్వాలలో శనివారం బహిరంగసభ జరిగింది.
బహిరంగసభకు గద్వాల ఫిరాయింపు ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హజరుపై సాయంత్రంవరకు ఉత్కంఠ కొనసాగింది. అయితే బండ్ల బహిరంగసభకు హాజరుకాలేదు. సభలో మాట్లాడిన కేటీఆర్ బండ్లపై నిప్పులు చెరగటమే కాకుండా బహిరంగసభలో బండ్ల ఎందుకు పాల్గొనలేదని పదేపదే ప్రశ్నించారు. కేటీఆర్ ఎన్నిసార్లు ప్రశ్నించినా బండ్లయితే సభను లెక్కకూడా చేయలేదు. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించినా ఫిరాయింపు ఎంఎల్ఏలు హాజరుకారని. విషయం కోర్టులో ఉంది, అలాగే ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ విచారణ చేస్తున్నారు కాబట్టే ఫిరాయింపు ఎంఎల్ఏలు కేటీఆర్ వ్యూహాలకు పై ఎత్తులు వేస్తున్నట్లు అర్ధమవుతున్నది. ఫిరాయింపుల తాజా వ్యూహంపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.