
ఓవర్ కాన్ఫిడెన్సే ఐబొమ్మ రవిని పోలీసులకు పట్టించిందా ?
ఐబొమ్మకు 5 కోట్లమంది సబ్ స్ర్కైబర్లున్నారు
హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ను సోమవారం ఉదయం సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి, దగ్గుబాటి సురేష్ తదితరులు కలిశారు. ఐబొమ్మ రవిని అరెస్టు చేసినందుకు పరిశ్రమ తరపున పోలీసులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. దాదాపు పది సంవత్సరాలుగా ఇటు పోలీసులను అటు తెలుగు సినీ నిర్మాతలను ముప్పుతిప్పలు పెడుతున్న ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే. గడచిన పదేళ్ళల్లో వేలాది తెలుగు సినిమాలను పైరసీ చేయటం ద్వారా హెచ్ డీ క్వాలిటి ప్రింట్లను రవి తన ఐబొమ్మ వెబ్ సైట్లో ఉంచేవాడు. ఐబొమ్మ సైట్ లో సినిమాలను ఉచితంగా అప్ లోడ్ చేసేవాడు. సినిమా థియేటర్లకు వెళితే వేలాది రూపాయలు ఖర్చులు.
అందుకనే ఉచితంగా హెచ్ డీ క్వాలిటీతో సినిమాలను అందిస్తున్న వెబ్ సైట్ ద్వారానే సినిమాలను చూడటానికి జనాలు అలవాటుపడిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఐబొమ్మకు 5 కోట్లమంది సబ్ స్ర్కైబర్లున్నారు. కొత్త సినిమా అలా థియేటర్లో రిలీజ్ అవటం ఆలస్యం అక్కడ సినిమా పూర్తయ్యేలోగానే ఐబొమ్మలో హెచ్ డీ క్వాలిటీతో పైరసీ సినిమా వచ్చేసేది. తన పైరసీ వల్ల ఐబొమ్మ నిర్వాహకుడు రవి సినిమా పరిశ్రమకు సుమారు రూ.3 వేల కోట్లు నష్టపరిచాడు. అందుకనే రవి అరెస్టుపై సినిమా పరిశ్రమలోని ప్రముఖులంతా సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు.
సరే, ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే అసలు రవి పోలీసులకు ఎలా దొరికాడు ? అన్నదే ఇపుడు చాలామందిని తొలిచేస్తోంది. ఎందుకంటే రవి హైదరాబాదులో ఉండటంలేదు. నెదర్లాండ్స్ లోని ఆమస్టర్ డ్యామ్, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో ఉంటాడు. కరేబియన్ దీవుల్లో సర్వర్లను పెట్టుకుని అక్కడి నుండే సినిమా పైరసీ కాపీలను తన వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తుంటాడు. కాబట్టి పోలీసులకు రవి దొరకటం అన్నది మామూలుగా అయితే జరిగే పనికాదు. రవి ఎలా ఉంటాడో కూడా పోలీసులకు తెలీదు. తరచూ హైదరాబాదుకు వచ్చి వెళుతున్నా పోలీసులకు మాత్రం తెలీలేదు. అయితే ఇపుడు ఎలా దొరికాడు ? ఎలాగంటే భార్య రూపంలో ఖర్మ కాలింది కాబట్టే.
విషయం ఏమిటంటే రవికి తన భార్యతో చాలాకాలంగా పడటంలేదు. అందుకనే గడచిన నాలుగేళ్ళుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ మధ్యనే విడాకులు తీసుకోవాలని ఇద్దరూ అంగీకారానికి వచ్చారు. వీరి విడాకుల విషయం కోర్టులో ఉంది. కోర్టులో విడాకుల కేసు హియరింగుకు వచ్చింది. అందుకనే రవి శుక్రవారం హైదరాబాదుకు వచ్చాడు. పైరసీ సైట్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న పోలీసులకు ఈ మధ్యనే కొందరు దొరికారు. వారిలో రవి కుటుంబం వ్యవహారాలు తెలిసిన వాడు ఒకడున్నాడు. వాడే పోలీసులకు రవి కుటుంబంలో గొడవలు, విడాకుల వ్యవహారం చెప్పి భార్య వివరాలను కూడా ఉప్పందించాడు. దాంతో పోలీసులు వెంటనే రవి భార్యను కాంటాక్టు చేశారు. ఆమెను కలిసి చాలా డీటైల్డ్ గా మాట్లాడారు. పోలీసుల వాదనతో కన్వీన్స్ అయిన భార్య రవి హైదరాబాదుకు వస్తున్న విషయాన్ని చెప్పింది. రవి ఫొటో కూడా అందించింది. దాంతో ఆ ఫొటోను, వివరాలను తీసుకుని రవి హైదరాబాదుకు రాగానే పట్టుకునేందుకు పోలీసులు శంషాబాద్ విమానాశ్రయం దగ్గర వెయిట్ చేశారు. అయితే ఈ విషయాలేవీ తెలియని రవి ఎయిర్ పోర్టులో నుండి బయటకు వచ్చేశాడు. ఎయిర్ పోర్టు దగ్గర రవి మిస్సయిన విషయాన్ని పోలీసు అధికారులు పోలీసు కమిషనర్ సజ్జనార్ కు చెప్పటంతో వెంటనే కమిషనర్ రవి భార్యను కాంటాక్టు చేశారు.
విషయం అంతా విన్న రవి భార్య కూకట్ పల్లిలోని ఇంటి అడ్రస్ చెప్పింది. దాంతో శనివారం ఉదయం పోలీసులు ఒక్కసారిగా కూకట్ పల్లిలోని రవి ఇంటి మీదకు దాడిచేశారు. ఇంట్లోనే రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో వందలాది హార్డ్ డిస్కులతో పాటు రు. 3 కోట్ల హార్డ్ క్యాష్ కూడా దొరికింది.
ఇదే విషయాన్ని మీడియాతో సజ్జనార్ మాట్లాడుతూ.. తమకు నమ్మకమైన సోర్స్ ద్వారానే రవి వస్తున్న విషయం తెలిసిందన్నారు. సోర్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే కూకట్ పల్లిలోని ఇంటిపైన దాడిచేసి పట్టుకున్నట్లు చెప్పారు. తమ విచారణలో 21 వేల సినిమాలను పైరసీ చేసినట్లు రవి అంగీకరించినట్లు కమిషనర్ వివరించారు. పైరసీ ద్వారా రవి రు. 20 కోట్లు సంపాదించాడని తెలిపారు.

