Prasanth Kishore | ప్రశాంత్ కిషోర్ కు చుక్కలు కనిపించాయా ?
x
Political strategist Prasanth Kishore

Prasanth Kishore | ప్రశాంత్ కిషోర్ కు చుక్కలు కనిపించాయా ?

రాజకీయ వ్యూహకర్తగా దేశంలో బాగా పాపులరైన బీహారీ బాబు ప్రశాంత్ కిషోర్(Prasanth Kishore) (పీకే) జన్ సురాజ్(Jan Suraj) రాజకీయపార్టీ పెట్టిన విషయం తెలిసిందే.


ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసిన ప్రశాంత్ కిషోర్ కు చుక్కలు కనపించాయా ? రాజకీయ వ్యూహకర్తగా దేశంలో బాగా పాపులరైన బీహారీ బాబు ప్రశాంత్ కిషోర్(Prasanth Kishore) (పీకే) జన్ సురాజ్(Jan Suraj) పేరుతో రాజకీయపార్టీ పెట్టిన విషయం తెలిసిందే. పార్టీ తరపున పోయిన ఏడాది బీహార్(Bihar) లో పాదయాత్ర కూడా చేశారు. తాజాగా జరిగిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పార్టీ తరపున అభ్యర్ధులను రంగంలోకి దింపారు. తాను ఎక్కడా పోటీచేయకపోయినప్పటికీ అభ్యర్ధుల తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ప్రచారం సమయంలోనే కాకుండా ఫలితాల తర్వాత పీకేకి చుక్కలు కనిపించాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే పోటీచేసిన నాలుగు నియోజకవర్గాల్లోను జన్ సురాజ్ అభ్యర్ధులు బొక్కబోర్లాపడ్డారు. బెలగంజ్ నుండి పోటీచేసిన మొహమ్మద్ అమ్జాద్ జేడీయూ అభ్యర్ధి మనోరమా దేవి చేతిలో ఓడిపోయాడు. మనోరమకు 73,334 ఓట్లు వస్తే మొహమ్మద్ కు 17,285 ఓట్లు మాత్రమే వచ్చి మూడోస్ధానంలో నిలబడ్డాడు. అలాగే ఇమామ్ గంజ్ నియోజకవర్గంలో పీకే అభ్యర్ధిగా పోటీచేసిన జితేంద్ర పాశ్వాన్ కూడా మూడోస్ధానంతోనే సరిపెట్టుకున్నాడు. పాశ్వాన్ కు 37,103 ఓట్లు రాగా గెలిచిన దీపా మంజీకి 53,435 ఓట్లు వచ్చాయి.

ఇక, రామ్ గర్ నియోజకవర్గంలో సుశీల్ కుమార్ సింగ్ నాలుగో ప్లేసులో ఉండిపోయాడు. సింగ్ కు 6,513 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇక్కడ గెలిచిన బీజేపీ అభ్యర్ధి అశోక్ కుమార్ సింగ్ కు 62,257 ఓట్లొచ్చాయి. చివరగా తిరారి నియోజకవర్గంలో సురాజ్ తరపున కిరణ్ సింగ్ పోటీచేస్తే 5,592 ఓట్లు తెచ్చుకుని మూడోప్లేసులో నిలబడ్డాడు. గెలిచిన బీజేపీ అభ్యర్ధి విశాల్ ప్రశాంత్ కు 78,564 ఓట్లు వచ్చాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోటీచేసిన నాలుగు నియోజకవర్గాల్లోను జన్ సురాజ్ పార్టీ అభ్యర్ధులు ముగ్గురు మూడోప్లేసులో నిలబడగా నాలుగో అభ్యర్ధి నాలుగో స్ధానంతో సరిపెట్టుకున్నాడు.

తాను పోటీచేయకుండా అభ్యర్ధులను నిలబెట్టిన కారణంగా పీకే పరువు కాస్త నిలబడినట్లుంది. ఎందుకంటే తెలుగురాష్ట్రాల్లో పీకే అంటే తెలియని వారుండరు. వ్యూహకర్తగా పీకే దేశంలో చాలా పాపులర్. ఇంతకాలం వ్యూహకర్త పాత్రతో తెరవెనుకకు మాత్రమే పరిమితమైన పీకే తెరముందుకు వచ్చి తానే రాజకీయ నేత అవతారం ఎత్తారు. వ్యూహకర్త హోదాలో తాను ఎంజాయ్ చేస్తున్న పాపులారిటితో పీకేకి సక్సెస్ మత్తు బాగా ఎక్కినట్లుంది. నరేంద్రమోడి(Narendra Modi) జగన్మోహన్ రెడ్డి(JaganMohanReddy), ఎంకే స్టాలిన్MK Stalin), మమతాబెనర్జీ(Mamata Benarji) తదితరులకు పనిచేసిన విషయం తెలిసిందే. తెరవెనుక రాజకీయం చేస్తేనే ఇంతటి మత్తు ఎక్కితే ఇక తెరమీదకు వచ్చి తానే రాజకీయ నేత అవతారం ఎత్తితే ఇంకెలాగుంటుందో చూడాలని బలంగా అనిపించినట్లుంది. అందుకనే తెరవెనుక రాజకీయాలకు స్వస్తిపలికి నేరుగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేసి ఏకంగా పార్టీయే పెట్టేశాడు.

తెరవెనుక వ్యూహకర్త పాత్రవేరు నేరుగా రాజకీయాల్లోకి దిగటం వేరన్న విషయం పాపం పీకేకి తెలిసినట్లు లేదు. అదికూడా ఏదో పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీచేయటం కాకుండా తానే సొంతంగా జన్ సురాజ్ అని పార్టీ పెట్టేశాడు. తన పార్టీతో నాలుగు నియోజకవర్గాల్లో గెలిచేసి తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేసి బీహార్ కు ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కన్నట్లున్నాడు. అయితే నాలుగు నియోజకవర్గాల్లో పోటీచేయబోయే తన పార్టీ అభ్యర్ధుల గెలుపోటముల మీద పీకే సర్వేలు చేసినట్లు లేదు. అందుకనే నలుగురిని పోటీచేయించేసి బొక్కబోర్లా పడ్డాడు. పోటీచేసిన నలుగురిలో ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రత్యర్ధులకు గట్టిపోటీ ఇవ్వలేదు. దాంతో ఎన్నికల్లో ప్రచారం, ఎలక్షనీరింగులో పీకేకి చుక్కలు కనిపించినట్లున్నాయి. మరిప్పుడు ఏమిచేస్తారో చూడాలి.

Read More
Next Story