
ఒక్కదెబ్బకు రేవంత్ హీరో అయిపోయాడా ?
ముఖ్యమంత్రి అయినపుడు ఎనుముల రేవంత్ రెడ్డిలో ఇంతటి పరిణతి కనిపించలేదు
ముఖ్యమంత్రి అయినపుడు ఎనుముల రేవంత్ రెడ్డిలో ఇంతటి పరిణతి కనిపించలేదు. కాలంగడిచేకొద్దీ రేవంత్ బాగా తెలివిమీరినట్లే అనిపిస్తోంది. ప్రతిపక్షాలు పదేపదే తనపైన చేస్తున్న దాడుల కారణంగా రాటుదేలిపోయుండచ్చు లేదా గట్టివాళ్ళను తన దగ్గర సలహాదారులుగా నియమించుకునుండచ్చు. ఏదేమైనా రేవంత్(Revanth) చాణుక్యానికి తాజా ఉదాహరణ బీసీలకు 42శాతం రిజర్వేషన్ల(BV Reservations) అమలుకు ఆర్డినెన్స్ జారీచేయాలన్న నిర్ణయమే. ఇపుడు విషయం ఏమిటంటే ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినా రేవంత్ కే అడ్వాంటజ్, ఒకవేళ ఆర్డినెన్స్ అమల్లోకి రాకుండా ఆగిపోయినా రేవంత్ కే అడ్వాంటేజ్ అన్నట్లుగా ఉంది పరిస్ధితి.
రేవంత్ క్యాబినెట్ నిర్ణయించిన ప్రకారం ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిందే అనుకుందాం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్న కాంగ్రెస్(Telangana Congress) ప్రభుత్వానికి అనుకూలంగా బీసీలు స్ధానికసంస్ధల ఎన్నికల్లో మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్ధానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్నది. కేసీఆర్(KCR) హయాంలో రిజర్వేషన్లను 22 శాతం నుండి 34శాతంకు పెంచారు. అయితే కోర్టు కొట్టేయటంతో రిజర్వేషన్లు మళ్ళీ 22శాతానికి పరిమితమైంది. అయితే 2023 ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ చేసిన ప్రకటన సంచలనమైంది. అప్పటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈమధ్యనే అసెంబ్లీలో బిల్లుపెట్టి తీర్మానంచేసి గవర్నర్ సంతకంతో కేంద్రానికి పంపింది. కేంద్రం దగ్గర రిజర్వేషన్ల బిల్లు రెండునెలలుగా పెండింగులోనే ఉంది.
హైకోర్టు ఆదేశాల కారణంగా స్ధానికఎన్నికలు నిర్వహించాల్సిన తేది సెప్టెంబర్ 30 దగ్గరకు వచ్చేస్తోంది. ఈనెలాఖరులోగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సుంది. అందుకనే రేవంత్ క్యాబినెట్ ధైర్యంచేసి ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేసేందుకు డిసైడ్ అయ్యింది. ఈ నిర్ణయం ప్రభావం ఎలాగుందంటే ప్రతిపక్షాలు నోరిప్పలేకపోతున్నాయి. క్యాబినెట్ నిర్ణయం తీసుకుని వారంరోజులు గడిచినా ఆర్డినెన్స్ కు మద్దతుగా కాని, వ్యతిరేకంగా కాని బీఆర్ఎస్, బీజేపీ నేతలు మాట్లాడలేకపోతున్నారు. అనుకూలంగా మాట్లాడితే మొత్తం క్రెడిట్ అంతా రేవంత్ కే దక్కుతుంది అనటంలో సందేహంలేదు. పోనీ వ్యతిరేకించారా అంటే బీసీల దృష్టిలో రేవంత్ హీరోగాను, వ్యతిరేకించిన ప్రతిపక్షాల నేతలు విలన్లుగా మిగిలిపోతారు. అందుకనే ఆర్డినెన్స్ పై ఏమి మాట్లాడాలో తెలీనిస్ధితిలో ప్రతిపక్షాల నేతలు దిక్కులు చూస్తున్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ జారీఅంశం తెలంగాణ(Telangana)లో హాట్ టాపిక్ అయిపోయింది. ఆర్డినెన్స్ ద్వారానే స్ధానిక ఎన్నికలు జరుగుతాయా ? లేకపోతే కోర్టు కొట్టేస్తుందా అన్న విషయంపై చర్చలు జోరుమీద జరుగుతున్నాయి. పై రెండు అంశాల్లో ఏది జరిగినా పైన చెప్పుకున్నట్లుగా రేవంత్ కే ఫుల్లు అడ్వాంటేజ్ అన్నట్లుగా ఉంది పరిస్ధితులు. ఎలాగంటే ఆర్డినెన్స్ ద్వారానే ఎన్నికలు జరిగితే క్రెడిట్ మొత్తం రేవంత్ కే దక్కుతుంది అనటంలో సందేహంలేదు. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్ళినా లేదా ఏ కారణంతో అయినా ఆర్డినెన్స్ అమల్లోకి రాకపోతే అప్పుడు కూడా అడ్వాంటేజ్ రేవంత్ కే. ఎలాగంటే బీసీల సంక్షేమం కోసం తాను ఆర్డినెన్స్ తీసుకొస్తే ప్రత్యర్ధులు అందరు కలిసి ఆర్డినెన్స్ ను అమల్లోకి రాకుండా అడ్డుకున్నారని ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటాడు. సో, ఏ కోణంలో చూసినా ఆర్డినెన్స్ అంశంలో అడ్వాంటేజ్ రేవంత్ కే అని అర్ధమవుతోంది.
ఆర్డినెన్స్ విషయమై బీఆర్ఎస్ లోని బీసీ నేతలు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతు ఆచరణ సాధ్యంకాదని తెలిసి ఆర్డినెన్స్ జారీ పేరుతో రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నట్లు ఆరోపించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరైనా కోర్టుకు వెళితే ఆర్డినెన్స్ చెల్లదని అందరికీ తెలుసు. మిగిలిన వాళ్ళకన్నా ఈ విషయం రేవంత్ కు ఇంకా బాగా తెలుసు. అందుకనే బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తాను ధైర్యంచేసి ఆర్డినెన్స్ జారీచేస్తున్నట్లు చెబుతున్నాడు. ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఎవరూ కోర్టులో కేసులు వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీసీ కులసంఘాల నేతలే చూసుకోవాలని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ ఆచరణ సాధ్యంకాదని గౌడ్ అన్నారు కాని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పలేకపోయారు. ఈ పాయింట్ లోనే రేవంత్ హీరో అయిపోయారనే ప్రచారం పెరిగిపోతోంది.