Revanth and Adani|రేవంత్ కు పెద్ద చిక్కొచ్చిపడిందా ?
x
Revanth before Raj Bhavan

Revanth and Adani|రేవంత్ కు పెద్ద చిక్కొచ్చిపడిందా ?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్ధితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగ తయారైందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్ధితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగ తయారైందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాదు(Hyderabad)లోని నెక్లెస్ రోడ్డు నుండి రాజ్ భవన్(RajBhavan) దాకా బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ ఎందుకంటే అదాని(Adani), ప్రధానమంత్రి నరేంద్రమోడికి(Narendra Modi) నిరసనగా. ప్రపంచదేశాల్లో అదాని గ్రూపు ఇండియా పరువు తీసేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి(Rahul Gandhi) కొద్దిరోజులుగా నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. సోలార్ పవర్(Solar Power) కాంట్రాక్టుల కోసం అదాని గ్రూపు సుమారు 2 వేల కోట్ల రూపాయల లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో ఎఫ్బీఐ(FBI) ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దానిపై పార్లమెంటులో చర్చ జరగాలని రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సభ్యులు, ప్రతిపక్షాల ఎంపీలు ఎంత పట్టుబట్టినా నరేంద్రమోడి అనుమతించటంలేదు. అలాగే మణిపూర్(Manipur riots) అల్లర్లపై పార్లమెంటులో చర్చజరగాలని ప్రతిపక్షాలు ఎంత డిమాండ్ చేసినా స్పీకర్ అనుమతించటంలేదు.

అదాని, మోడీల వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఇందులో భాగంగానే హైదరాబాదులో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో రేవంత్(Revanth), ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదాని, మోడి కలిసి ప్రపంచదేశాల ముందు భారత్ పరువు తీసేశారని రేవంత్ మండిపడ్డారు. అదాని గ్రూపు ఆర్ధిక అవకతవకలపై పార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడితే బీజేపీ అనుమతించటంలేదని రేవంత్ ఆరోపించారు. అదాని ఆర్ధిక అవకతవకలపై విచారణ జరపాల్సిందే అని రేవంత్ డిమాండ్ చేశారు. అదాని వ్యవహారాలపై జాయింట్ పార్లమెంట్ కమిటితో విచారణ చేయించాలని కూడా డిమాండ్ చేశారు. అదానీని కాపాడేందుకు మోడి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. అదాని వ్యవహారాల విచారణపై జేపీసీకి అంగీకరించకపోతే రాష్ట్రపతి భవన్ ముందు కాంగ్రెస్ ధర్నా చేస్తుందని రేవంత్ హెచ్చరించారు.

రేవంత్ ఇంకా చాలా ఆరోపణలు చేశారు కాని ఇపుడు సమస్యంతా సీఎం మెడకే చుట్టుకుంటోందని అనిపిస్తోంది. ఎలాగంటే అదాని ఫక్తు వ్యాపారస్తుడు. తన పనులు చేయించుకోవటానికి, ప్రాజెక్టుల అనుమతులకోసం లంచాల రూపంలో ఎంత డబ్బయినా వెదచల్లుతాడు. చాలామంది పారిశ్రామికవేత్తలు చేస్తున్నది ఇదే అని అందరికీ తెలుసు. అయితే ఇపుడు సమస్య ఏమొచ్చిందంటే అదాని గ్రూపు తెలంగాణాలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నది. సుమారు రు. 12,400 కోట్లతో నాలుగు భారీ ఒప్పందాలు చేసుకున్నది మొన్నటి జనవరిలో. పారిశ్రామికవేత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేయటం, విస్తరించుకుంటూ పోవటం, అనుమతులు వేగంగా రావటంకోసం లంచాలు వెదచల్లటం చాలామంది పారిశ్రామికవేత్తలు చేస్తున్నదే.

ఇపుడు సమస్య ఏమొచ్చిందంటే ముఖ్యమంత్రిగా రేవంత్ మొన్నటివరకు అదాని పెట్టుబడులను ఆహ్వానించాడు. ఇపుడు జాతీయస్ధాయిలో పార్టీ తీసుకుకన్న అదాని వ్యతిరేక లైన్ కారణంగా వ్యతిరేకించక తప్పదు. అంటే ప్రభుత్వాధినేతగా అదాని గ్రూపు పరిశ్రమలను ఆహ్వానిస్తునే పార్టీ నేతగా అదే అదానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డబుల్ యాక్షన్ చెల్లుబాటుకాదని అందరికీ తెలుసు. అదాని గ్రీన్ ఎనర్జీ రూపంలో రు. 5 వేల కోట్లు, అదాని కానెక్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు మరో రు. 5 వేల కోట్లు, అంబుజా సిమెంట్స్ యూనిట్ ను రు. 1400 కోట్లతో, అదాని ఏరోస్పేస్ కోసం మరో వెయ్యి కోట్లరూపాయలు పెట్టుబడులు పెట్టడానికి అదాని ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. మరిపుడు ఈ పెట్టుబడుల ఒప్పందాలను రేవంత్ ఏమి చేయబోతున్నారన్నది చిక్కుప్రశ్నగా మారింది.

స్కిల్ యూనివర్సిటీ(Skill University)కి అదాని ప్రకటించిన రు. 100 కోట్ల విరాళం వద్దని ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది. 100 కోట్ల రూపాయల విరాళాన్ని తిప్పిపంపటం అంటే చిన్న విషయం కాదు. అదాని ప్రకటించిన విరాళం ఇంకా ప్రభుత్వం ఖాతాలో జమకాలేదు కాబట్టి, అందులోను అది విరాళం కాబట్టి వద్దని రేవంత్ చెప్పగలిగారు. కాని రు. 12,400 కోట్ల పెట్టుబడులను తిరస్కరించటం అంటే చిన్న విషయంకాదు. ఈ పెట్టుబడులు సాకారమైతే కొన్ని వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. పైగా పెట్టుబడులను వద్దని చెప్పటం విరాళాన్ని తిప్పిపంపినంత తేలిక కాదు. విరాళాన్ని అందుకోవటానికి ఒప్పందాలు ఏమీ ఉండవు. కాని పెట్టుబడులు అంటే ఎన్నో రాతకోతలుంటాయి. వచ్చే పెట్టుబడుల ఆధారంగా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలుంటాయి. పెట్టుబడులు, రాయితీలు, భూముల అప్పగింత, విద్యుత్ సరఫరా, నీటి కేటాయింపులు, ఉద్యోగ, ఉపాధి కల్పన లాంటివి ఎన్నో రాతమూలకంగా ఒప్పందాల్లో ఉంటాయి. కాబట్టి ఒప్పందాలను ఏకపక్షంగా ప్రభుత్వం రద్దుచేసుకుంటే తర్వాత లీగల్ సమస్యలను ఎదుర్కోవాల్సుంటుంది.

తెలంగాణా ప్రభుత్వం(Telangana Investments) ఒప్పందాలను రద్దుచేసుకోవాలని అనుకుంటే రు. 12,400 కోట్లను కోల్పోయినట్లే అనుకోవాలి. భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టకూడదని అదాని అనుకుంటే తెలంగాణా భారీగా నష్టపోతుంది. ఇంతాచేసి అమెరికా దర్యాప్తు సంస్ధలు ఆరోపణలు అయితే చేశాయి కాని చార్జిషీట్లో ఎక్కడా అదాని ప్రస్తావన లేదు. తాము ఎవరికీ లంచాలు ఇవ్వలేదని అదాని కూడా అధికారికంగా ప్రకటించారు. లంచాల కేసులో అదాని మీద అమెరికాలో కేసు కూడా నమోదుకాలేదు. మరింతకీ అదాని లంచాలు ఇచ్చినట్లా ? ఇవ్వనట్లా ? అంతా గందరగోళంగా తయారైంది. లంచాలు ఇచ్చారో లేదో తెలీదు కాని ఏపీ, తెలంగాణాలో మాత్రం అదాని కేంద్రంగా అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రచ్చ పెరిగిపోతోంది. మరీ పరిస్దితుల్లో రేవంత్ ఏమిచేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.

Read More
Next Story