రేవంత్ రెడ్డిలో కోపంనరం తెగిపోయిందా ?
x
Revanth

రేవంత్ రెడ్డిలో కోపంనరం తెగిపోయిందా ?

తెలుగురాజకీయాలకు సంబంధించి కోపంనరం అన్నపదాన్ని మొట్టమొదట ఉపయోగించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే


తెలుగురాజకీయాలకు సంబంధించి కోపంనరం అన్నపదాన్ని మొట్టమొదట ఉపయోగించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే. నిజంగానే కోపంనరం ఉందా ? అంటే ఇప్పటివరకు ఏ డాక్టర్ కూడా కోపంనరం, సంతోషం నరం, దుఖంనరం అని భావోద్వేగాలకు వేర్వేరుగా నరాలుంటాయని చెప్పలేదు. అయితే స్వతహాగా వైఎస్సార్(YSR) డాక్టర్ కాబట్టి నరాలకు సంబంధించి ఆయనకు తెలిసేవుండాలి. అందుకనే ముఖ్యమంత్రిగా ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతు పాదయాత్ర తర్వాత తనలోని కోపంనరం తెగిపోయినట్లు స్వయంగా చెప్పుకున్నారు. కోపంనరం తెగిపోయిందని చెప్పటంలో అర్ధం భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుంటున్నాను అనిచెప్పటమేనేమో. ఇప్పుడిదంతా ఎందుకంటే బడ్జెట్ సమావేశాల ముగింపురోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి(Revanth) మాట్లాడుతు కక్షరాజకీయాలు చేయాలన్న ఆలోచన తనకు లేదన్నారు.

బీఆర్ఎస్(BRS) హయాంలో తనను 16 రోజులు చర్లపల్లి జైలులో పెట్టించిన వాళ్ళమీద కూడా తనకు ఇపుడు కోపంలేదన్నారు. ఎవరిపాపానికి వాళ్ళే పోతారని కూడా చెప్పారు. అన్నింటినీ దేవుడు చూస్తున్నాడని, అన్నింటినీ ఆయనే చూసుకుంటాడని ఒకింత వైరాగ్యంతో చెప్పారు. దేవుడు చూసుకున్నాడు అనేందుకు ఉదాహరణ కూడా చెప్పారు. ఇంతకీ ఆ ఉదాహరణ ఏమిటంటే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేరోజునే అంతకుముందు తనను బాగా ఇబ్బందిపెట్టిన వ్యక్తి కిందపడి ఆసుపత్రిపాలైనట్లు గుర్తుచేశారు. కిందపడి తుంటిఎముక విరిగి ఆసుప్రతిలో చేరి ఆపరేషన్ చేయించుకుని మంచంమీద సుమారు రెండునెలలు ఉన్నదెవరనే విషయాన్ని ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రేవంత్ మీద కేసుపెట్టి కోర్టుద్వారా జైలుకు పంపింది కేసీఆర్(KCR) అన్న విషయం అందరికీ తెలిసిందే.

కేటీఆర్(KTR) ఫామ్ హౌస్ మీద ద్రోన్ ఎగరేశారనే ఆరోపణలతో పాటు ఫొటోలను మీడియాకు ఇచ్చారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ మీద కేసుపెట్టిందని చెప్పారు. అనుమతిలేకుండా ద్రోన్ ఎగరేసినందుకు రు. 500 ఫైన్ వేసి వదిలేయాల్సిన పెట్టీకేసట. తాను ఎంపీ అన్నవిషయాన్ని కూడా పట్టించుకోకుండా తనపైన కేసుపెట్టి 16రోజులు చర్లపల్లి జైలులో ఉంచినట్లు అసెంబ్లీలో వాపోయాడు. ఐఎస్ఐ టెర్రరిస్టులను(ISI Terrorists), మావోయిస్టులను ఉంచినట్లుగా భయంకరమైన డిటెన్షన్ సెల్ లో ఉంచినట్లు చెప్పాడు. 7 అడుగుల వ్యాసార్ధం ఉన్న చిన్నపాటి గదిలో రాత్రుళ్ళు లైట్లుంచి తనను నిద్రకూడా పోనీయకుండా బాధపడినట్లు చెప్పాడు. రాత్రంతా తన గదిలో లైట్లు వెలుగుతున్న కారణంగా పురుగులు వచ్చేసేవని వాటిని తినటానికి తన గదంతా బల్లులతో నిండిపోయేదని కూడా అన్నాడు. రాత్రుళ్ళు నిద్రలేని కారణంగా ఉదయంపూట జైలుకాంపౌండ్ లో ఉన్న చెట్లకింద పడుకునేవాడినని గుర్తుచేసుకున్నాడు.

తనకూతురు నిశ్చితార్ధానికి కూడా తనను హాజరుకానీయకుండా శతవిధాలుగా అప్పటి పాలకులు చేసిన ప్రయత్నాలను వివరించాడు. అయితే కోర్టు ద్వారా తాను బిడ్డ నిశ్చితార్ధానికి హాజరైనట్లు చెప్పాడు. తనపట్ల అంత దుర్మార్గంగా వ్యవహరించిన వారిపైన తనకున్న కోపాన్ని బలవంతంగా దిగమింగుకున్నట్లు చెప్పాడు. ప్రత్యర్ధులపై నిజంగానే తాను కక్షసాధింపులకు దిగాలని అనుకుంటే ఒక్కళ్ళు కూడా ఉండరని చెప్పి బీఆర్ఎస్ సభ్యులు కూర్చునే సీట్లను చూపించారు. అసెంబ్లీలో చేసిన ప్రకటన తర్వాతే వైఎస్సార్ కు లాగే రేవంత్ లో కూడా కోపంనరం తెగిపోయిందనే విషయం అందరికీ అర్ధమైంది. కాకపోతే అప్పుడప్పుడు ఆవేశాన్ని తట్టుకోలేక ప్రత్యర్ధులపై గట్టిగా మాట్లాడుతుంటాడంతే.

అసెంబ్లీలో రేవంత్ ప్రకటన విన్నతర్వాత కొంతమందికి గాంధేయమార్గంలో నడుస్తున్నాడా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే మహాత్మాగాంధీ(Mahatma Gandhi) కూడా మనల్ని ఎవరైనా చెంపదెబ్బ కొడితే మనం తిరిగి కొట్టకుండా రెండోచెంప కూడా చూపించాలని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. తనమీద తప్పుడుకేసులు పెట్టి 16 రోజులు జైలులో పెట్టి మానసికంగా చిత్రహింసలు పెట్టినవారిపైన తనకు ఇపుడు ఎలాంటి కోపంలేదని అన్నారంటే రేవంత్ గాంధేయమార్గంలో నడుస్తున్నారా అన్న సందేహం రాకుండా ఎలాగుంటుంది. రేవంత్ తలచుకుంటే తన ప్రత్యర్ధులపైన ఏదోకేసుపెట్టగలిగే అవకాశాలున్నాయి. అయితే తాను అలాచేయటంలేదని చెప్పాడు. కక్షారాజకీయాలు చేయకూడదన్న ఉద్దేశ్యంతోనే తనను ఇబ్బందిపెట్టిన వారిని కూడా తాను ఏమీచేయకుండా వదిలేసినట్లు రేవంతే అసెంబ్లీలో ప్రకటించాడు.

Read More
Next Story