
రేవంత్ దెబ్బ ఇంతగట్టిగా తగిలిందా ?
యాజమాన్యాలకు రేవంత్(Revanth) అలా వార్నింగ్ ఇచ్చాడో లేదో వెంటనే రాత్రికల్లా నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్లు యాజమాన్యాల సమాఖ్య ప్రకటించింది
ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలపైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వార్నింగ్ చాలా గట్టిగా పనిచేసినట్లుంది. శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో యాజమాన్యాలకు రేవంత్(Revanth) అలా వార్నింగ్ ఇచ్చాడో లేదో వెంటనే రాత్రికల్లా నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్లు యాజమాన్యాల సమాఖ్య ప్రకటించింది. 3వ తేదీన మొదలైన నిరవధిక సమ్మెను శుక్రవారం రాత్రి నుండి విరమిస్తున్నామని, శనివారం నుండి అన్నీ కాలేజీలు తెరుచుకుంటాయని సమాఖ్య అధ్యక్షుడు ఎన్. రమేష్ ప్రకటించారు. రేవంత్ వార్నింగ్ కు, నిరవధికసమ్మె విరమణ ప్రకటనకు మధ్య ఒక డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే ఆర్ధికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సమాఖ్య ముఖ్యుల సమావేశం జరిగింది.
మల్లు, కోమటిరెడ్డితో సమాఖ్య ప్రతినిధుల సమావేశం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఆ సమావేశంలో బకాయిలు తీర్చటంలో భాగంగా తక్షణమే రు. 600 కోట్లు విడుదల చేస్తామని మల్లు హామీఇచ్చారు. ఏళ్ళతరబడి ఫీజు బకాయిలు రు. 10 వేల కోట్లు పేరుకుపోయాయని మొన్నటివరకు సమాఖ్య ప్రతినిధులు చెప్పేవారు. అసలీ నిరవధిక సమ్మె మొదలైందే ఫీజు బకాయిల విడుదల కోసం. ఇదే విషయమై మల్లు మాట్లాడుతు బకాయిల్లో రు. 1500 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమాఖ్య అడిగినట్లుగా రెండు విడతల్లో ఇప్పటికే రు. 600 కోట్లు చెల్లించినట్లు గుర్తుచేశారు. మిగిలిన రు. 600 కోట్లను కూడా తొందరలోనే విడుదలచేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన రు. 300 కోట్లను కొద్దిరోజుల్లోనే ఇస్తామని మల్లు భరోసా ఇచ్చారు.
బకాయిల విడుదలకు మల్లు హామీ ఇచ్చిన కారణంగా నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్లు సమాఖ్య ప్రకటించింది. సమ్మె కారణంగా కొన్నిపరీక్షలను నిర్వహించలేకపోయినందుకు చింతిస్తున్నట్లు రమేష్ చెప్పారు. యూనివర్సిటి ఉన్నతాధికారులతో మాట్లాడి పరీక్షలను తొందరలోనే నిర్వహించేట్లుగా చర్యలు తీసుకుంటామన్నారు. సమాఖ్య ప్రధానకార్యదర్శి కేఎస్ రవికుమార్ మాట్లాడుతు నిరవధిక సమ్మెతో పాటు అన్నీ నిరసన కార్యక్రమాలను రద్దుచేసుకున్నట్లు చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రైవేటు కాలేజీల సమాఖ్య ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు రేవంత్ మండిపోయారు. సమాఖ్య ఛైర్మన్ రమేష్ 12 కాలేజీలకు అనుమతులు అడిగారని ఇవ్వనందుకే అందరినీ రెచ్చగొట్టి సమ్మె చేయిస్తున్నట్లు రేవంత్ తీవ్రంగా ఆరోపించారు. ఇలాంటి మరో రెండు ఉదాహరణలను కూడా మీడియా సమావేశంలోనే రేవంత్ చెప్పారు. అనుమతులు అడిగిన కాలేజీల్లో కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నందుకే ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి కాలేజీల యాజమాన్యాలు డొనేషన్లు ఎలా వసూళ్ళు చేస్తాయో చూస్తామని రేవంత్ సీరియస్ అయ్యారు. విద్యార్ధుల భవిష్యత్తుతో యాజమాన్యాలు ఆటలాడుకుంటున్నాయా అంటు కన్నెర్రచేశారు. రాజకీయపార్టీల అండ ఉందని రెచ్చిపోవద్దని వార్నింగిచ్చారు. రేవంత్ వార్నింగ్ దెబ్బకు సమాఖ్య దిగొచ్చిందిన్నది వాస్తవం.
కాలేజీల్లో కొన్ని బీఆర్ఎస్ ప్రజాప్రతినిదులవి, మరికొన్ని కాలేజీలకు వివిధ పార్టీల నేతల మద్దతు ఉన్నాయనటంలో సందేహంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా యాజమాన్యాలు విద్యార్దుల ముక్కుపిండి అధిక ఫీజులను వసూళ్ళు చేసుకుంటున్నాయి. ఈ విషయం ప్రభుత్వానికి బాగా తెలుసు. అయినా పెద్దగా పట్టించుకోవటంలేదు. ఫీజులు భారీగా వసూళ్ళు చేస్తున్న కొన్ని యాజమాన్యాలు అధ్యాపకులకు ఇవ్వాల్సినంత జీతాలు ఇవ్వటంలేదనే ఆరోపణలు చాలాకాలంగా వినబడుతునే ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొన్ని కాలేజీల్లో విద్యార్దులు లేకపోయినా హాజరుమాత్రం నూరుశాతం చూపించి ఫీజుల రీయింబర్స్ మెంట్ చేసుకుంటున్నాయనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి.
కాలేజీల్లో ఉన్న ఇలాంటి అనేక లొసుగులు రేవంత్ కు తెలీకుండానే ఉంటుందా ? అందుకనే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వంతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని సమాఖ్య భయపడినట్లుంది. ఇదేసమయంలో ప్రభుత్వంలో వేలకోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయిందీ వాస్తవమే. బకాయిల్లో కొంత విడుదలచేయటానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. అందుకనే మంత్రులతో భేటీ పేరుతో ఫీజు బకాయిల విడుదలకు హామీ తీసుకున్న సమాఖ్య నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఫీజుబకాయిల విషయంలో ఇటు ప్రభుత్వంలో కొన్ని తప్పులుంటే కాలేజీల నిర్వహణలో అటు యాజమాన్యాల్లోనూ తప్పులున్నాయి. కాబట్టి భేటీపేరుతో ఇటు ప్రభుత్వం అటు సమాఖ్య మధ్య సయోధ్య కుదిరి నిరవధిక సమ్మెను విరమించింది.

