800 చెరువులను కబ్జా చేశారా ?
x
PCC President Bomma Mahesh Goud

800 చెరువులను కబ్జా చేశారా ?

బీఆర్ఎస్ నేతలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 800 చెరువులను కబ్జాలు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.


బీఆర్ఎస్ నేతలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 800 చెరువులను కబ్జాలు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మీడియాతో బొమ్మ మాట్లాడుతు హైడ్రా ఏర్పాటైన దగ్గర నుండి చెరువులు, కాల్వలు, కుంటల కబ్జాల వ్యవహారాలను బయటకు తీస్తుంటే తమ జాతకాలు ఎక్కడ బయటపడతాయో, ఆక్రమణలను ఎక్కడ తొలగిస్తారో అని కారుపార్టీ నేతలు భయపడుతున్నట్లు చెప్పారు. ఆ భయంలో నుండే ఆందోళన మొదలై హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బొమ్మ అసలు విషయాన్ని చెప్పారు. చెరువులకు కబ్జాచేసిన వారిలో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు ఎక్కువమంది ఉన్నట్లు ఆరోపించారు.

తమ కబ్జాలో ఉన్న చెరువులు ఎక్కడ జారిపోతాయో అన్న ఆందోళనతోనే హైడ్రాను వీరంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మండిపడ్డారు. తమ ఆస్తులను కాపాడుకోవటం కోసం మామూలు జనాలను కూడా రెచ్చగొడుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హైడ్రా, మూసీ, రాహుల్ గాంధీకి సంబంధంలేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్ పరిధిలోని చెరువులన్నింటికీ పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు.

మూసీ రివర్ డెవలెప్మెంట్ ప్రాజెక్టు విషయంలో డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) ఇంకా సిద్ధమే కానపుడు అవినీతి జరిగిందంటే ఎలా సాధ్యమని బొమ్మ ప్రశ్నించారు. డీపీఆర్ సిద్ధంకానపుడు, నిర్మాణం మొదలుకానపుడే అవినీతి జరిగిందని కేటీఆర్, హరీష్ లాంటి వాళ్ళు ఆరోపిస్తే ఎవరైనా నమ్ముతారా అంటు ఎద్దేవా చేశారు. 2016లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీని ప్రక్షాళన చేస్తమని ప్రకటించినా చేయలేదన్నారు. మూసీనది ప్రక్షాళన అంటే ఎలాగుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్న ధీమాను వ్యక్తంచేశారు. మూసీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను మాత్రమే ప్రభుత్వం తొలగిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బయట రాష్ట్రాల్లోని వీడియోలు ఇక్కడ వైరల్ చేస్తున్నట్లు బొమ్మ మండిపడ్డారు. అలాగే చెరువులు, కుంటలు, కాల్వల బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలోని వాటిని మాత్రమే హైడ్రా కూల్చుతోందని పీసీసీ అధ్యక్షుడు చెప్పారు. హైడ్రా పనివేరు, బాధ్యతలు వేరని, అలాగే మూసీ ప్రాజెక్టు వేరని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటి ఇచ్చారు.

Read More
Next Story