బీఆర్ఎస్ ఖరీదైన త్యాగమే చేసిందా ?
x
KCR

బీఆర్ఎస్ ఖరీదైన త్యాగమే చేసిందా ?

బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయితే మళ్ళీ ఓటుబ్యాంకును తిరిగి రాబట్టుకోవటం కారుపార్టీకి కష్టం


తాజాగా జరిగిన మూడు ఎంఎల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక ఆసక్తికరమైన పాయింట్ చర్చ జరుగుతోంది. మూడు ఎంఎల్సీలకు జరిగిన ఎన్నికల్లో రెండింటిలో బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే. ఇక్కడ డిస్కషన్ జరుగుతున్న పాయింట్ ఏమిటంటే బీజేపీ పుంజుకోవటంవల్ల తక్షణ సమస్య కాంగ్రెస్ కా లేకపోతే బీఆర్ఎస్(BRS) కా అని. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండిసంజయ్(Bandi Sanjay) మీడియాతోను పార్టీనేతలతో మాట్లాడినపుడు రేవంత్(Revanth) పని అయిపోయిందని పదేపదే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది అనటానికి ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలే కారణమని ఉదాహరణగా చెప్పారు. బీజేపీ రెండుచోట్ల గెలిచింది కాబట్టి పార్టీ నేతలు, క్యాడర్ ను ఉత్సాహపరిచేందుకు కేంద్రమంత్రులు ఎన్నిమాటలైనా చెబుతారనటంలో సందేహంలేదు.

అయితే ఇక్కడ వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే ఎన్నిక మూడు ఎంఎల్సీ సీట్లకు జరిగినా కాంగ్రెస్ పోటీచేసింది గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ సీటులో మాత్రమే. ఈ సీటులో బీజేపీ(BJP) అభ్యర్ధి గెలుపుకు పార్టీబలంకన్నా వెలుపలి కారణాలు అనేకం కలిసొచ్చాయి. అదేమిటంటే బీఆర్ఎస్(BRS) పోటీలో లేని కారణంగా కారుపార్టీ ఓట్లు బీజేపీకి ట్రాన్సఫర్ అవటం, కాంగ్రెస్ అభ్యర్ధి మీద పార్టీలోని వ్యతిరేకత కారణంగా నేతలందరు మనస్పూర్తిగా పనిచేయకపోవటం లాంటి మరికొన్ని కారణాల వల్లే బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డి(Anjireddy) గెలిచారు. వెలుపలి శక్తులు బీజేపీకి అంత సహకరించినా బీజేపీ గెలిచింది 5 వేల మెజారిటితో మాత్రమే. అంతమాత్రాన కాంగ్రెస్ పని అయిపోయినట్లు కాదు.

ఇక్కడ తక్షణ సమస్య కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కే ఎక్కువ. ఎలాగంటే క్షేత్రస్ధాయిలో నేతలు, క్యాడర్ ఉన్నా కూడా బీఆర్ఎస్ పోటీచేయలేదు. పార్టీని పోటీకి దూరంగా ఉంచటం కచ్చితంగా కేసీఆర్(KCR) తప్పే. ఒకవైపు రేవంత్ పాలనపైన జనాల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ ఈజీగా గెలుస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీమంత్రి హరీష్, కల్వకుంట్ల కవిత ప్రతిరోజు చెబుతున్నారు. వీళ్ళు చెబుతున్నది నిజమే అయితే మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీచేయలేదు ? పోటీచేసి మూడు సీట్లనూ గెలుచుకునే అవకాశాన్ని బీఆర్ఎస్ ఎందుకు వదులుకున్నట్లు ? తాను పోటీచేస్తే గెలిచే అవకాశాలను బీఆర్ఎస్ వదులుకుని బీజేపీకి ఎందుకు ఇచ్చినట్లు ? బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి బదిలీచేయించినట్లు రేవంత్, మంత్రుల ఆరోపణల్లో నిజముందనే అనిపిస్తోంది. నిజం ఏమిటంటే బీఆర్ఎస్ పోటీచేయకపోవటమే.

బీజేపీ గెలిచేసీటు, బీజేపీ ప్రతి గెలుపు బీఆర్ఎస్ కే నష్టమన్న విషయం తెలిసిపోతోంది. బీజేపీ బలపడే కొద్దీ సమస్య బీఆర్ఎస్ కే కాని కాంగ్రెస్ కు కాదు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయితే మళ్ళీ ఓటుబ్యాంకును తిరిగి రాబట్టుకోవటం కారుపార్టీకి కష్టం. ఈ విషయం కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు తెలీకుండా ఉండదు. అయినా సరే ఎంఎల్సీ ఎన్నికల నుండి బీఆర్ఎస్ దూరంగా ఉండిపోయిందంటే ఓటుబ్యాంకును వదులుకోవటానికి సిద్ధపడినట్లు అర్ధమైపోతోంది. బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ తన ఓటుబ్యాంకును త్యాగం చేసుంటే చాలా ఖరీదైన త్యాగమనే అనుకోవాలి. బీఆర్ఎస్ చేసిన త్యాగం భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

కేంద్రమంత్రులు చెప్పింది నిజమేనా ?

రెండు ఎంఎల్సీ సీట్లను గెలవగానే రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పని అయిపోయిందని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పదేపదే చెబుతున్నారు. నిజంగానే కేంద్రమంత్రులు చెబుతున్నట్లు కాంగ్రెస్ పనైపోయిందా ? అంటే లేదనే చెప్పాలి. ఎలాగంటే మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది కేవలం 5 వేల ఓట్ల మెజారిటితో మాత్రమే. పై నాలుగు జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ, 6 పార్లమెంటు సీట్లున్నాయి. 6 పార్లమెంటు సీట్లనే తీసుకుంటే సుమారు కోటిమంది ఓటర్లుంటారు. ఇంతమంది ఓటర్లలో గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటువేసింది 3.5 లక్షలు మాత్రమే. కోటిమంది ఓటర్లలో ఎంఎల్సీ ఎన్నికలో ఓట్లువేసింది 3.5 లక్షలు మాత్రమే అయినపుడు రేవంత్ పాలనపై వ్యతిరేకతకు సంకేతాలని కేంద్రమంత్రులు ఎలా చెప్పగలరు ?

42 నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గంలోను సగటున 2.5 లక్షలమంది ఓటర్లుంటారు. జనరల్ ఎన్నికల్లో ఈ ఓటర్లలో సుమారు 70 శాతంమంది ఓట్లేస్తారు. కాని ఇప్పుడు ఎంఎల్సీ ఎన్నికల్లో జరిగింది ఏమిటంటే 42 నియోజకవర్గాలకు కలిపి ఓట్లేసింది 2.5 లక్షల ఓట్లమంది మాత్రమే. అంటే ప్రతి నియోజకవర్గంలో ఓట్లేసింది సుమారు 6 వేలమంది మాత్రమే. ఈ మాత్రానికే రేవంత్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని కేంద్రమంత్రులు చెప్పటంలో అర్ధంలేదు. రేవంత్ పాలన బ్రహ్మాండమని, జనాలంతా హ్యాపీగా ఉన్నారని చెప్పటం ఉద్దేశ్యంకాదు. రేవంత్ పాలనపైన జనాల్లో అసంతృప్తి మొదలై ఉండచ్చు. అంతమాత్రాన గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలో ఓటమితోనే కాంగ్రెస్ పనైపోయిందని మాత్రం అనుకునేందుకు లేదు. ఓవరాలుగా ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే అర్ధమవుతున్నది ఏమంటే బీజేపీ బలోపేతం వల్ల తక్షణ సమస్య బీఆర్ఎస్ కే కాని కాంగ్రెస్ కు కాదని.

Read More
Next Story