
ఏసీబీ దాడుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సొరచేప దొరికిందా ?
ఇంతకీ సొరచేప ఎవరంటే కాళేశ్వరం కార్పొరేషన్(Kaleswaram Corporation) కు ఎండీగా పనిచేసిన హరిరామే.
ఏసీబీ వలలో పెద్ద సొరచేపే దొరికింది. విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల అవినీతిపై జస్టిస్ పినాకినీ చంద్రఘోష్ కమిషన్ విచారణ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పై ప్రాజెక్టుల నిర్మాణాలు నాసిరకంగా జరిగిన కారణంగానే వినియోగానికి పనికిరాకుండా పోయాయని నేషనల్ డ్యాం సేఫ్టి అథారిటి(ఎన్డీఎస్ఏ) తాజాగా తన రిపోర్టును రాష్ట్రప్రభుత్వానికి అందించింది. ఈ నేపధ్యంలోనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తదితరుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రేగుతున్నాయి. తొందరలోనే కేసీఆర్, హరీష్ రావు తదితరులకు కూడా కమిషన్ నోటీసులిచ్చి విచారణకు రమ్మంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో పెద్ద సొరచేప పడింది.
ఇంతకీ సొరచేప ఎవరంటే కాళేశ్వరం కార్పొరేషన్(Kaleswaram Corporation) కు ఎండీగా పనిచేసిన హరిరామే. ఈఎన్సీ హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు, నిధుల వినియోగం తదితరాలను హరిరామ్ పర్యవేక్షించారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లలో కూడా హరిరామ్ దే కీలకపాత్ర. తర్వాత కాళేశ్వరం ఎండీగా కూడా చాలాకాలం పనిచేశారు. ఆ సమయంలో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీకి సమాచారం అందింది. ఈయన భార్య అనిత ఇరిగేషన్ శాఖలోనే డిప్యుటి ఈఎన్సీగా పనిచేశారు. అంటే భార్య, భర్తలు ఇద్దరు ఇరిగేషన్ శాఖలోనే కీలకమైన పదవుల్లో చాలాకాలం పనిచేసినట్లు అర్ధమవుతోంది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి కచ్చితమైన సమాచారం అందిన నేపధ్యంలోనే శనివారం తెల్లవారిజామున ఏసీబీ అధికారులు టోలిచౌకీలోని హరిరామ్ ఇంటిమీద(Telangana ACB) దాడిచేశారు.
ఈ సోదాల్లో భారీఎత్తున ఆస్తిపత్రాలు బయటపడినట్లు సమాచారం. గజ్వేలు నియోజకవర్గంలో 30 ఎకరాలు, సిద్ధిపేట నియోజకవర్గంలో 100 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వేలు నియోజకవర్గానికి కేసీఆర్, సిద్దిపేట నియోజకవర్గానికి హరీష్ రావు ఇపుడు ఎంఎల్ఏలుగా ఉన్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరి నియోజకవర్గాల్లోనే హరిరామ్ పెద్ద ఎత్తున భూములు కొనుగోలుచేశారు. ఇవికాకుండా డబ్బు, బంగారు నగలుకూడా ఉన్నాయి. ఇవేకాకుండా హరిరామ్ కు మూడు బ్యాంకుల్లో లాకర్లున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. సోదాలు ఇంకా జరుగుతున్నాయి కాబట్టి ఆస్తుల జాబితా ఇంకా పెరిగే అవకాశముంది. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేస్తేకాని వాటిల్లో ఏముందో తెలీదు.
ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే మంత్రి ఉత్తమ్ కేసీఆర్, హరీష్ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లరూపాయలతో నిర్మించామని గొప్పలు చెప్పుకుని చివరకు ఎందుకూ పనికిరాని నాసిరకం ప్రాజెక్టును కట్టినట్లు మండిపడ్డారు. లక్షకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవటానికే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశ్యపూర్వకంగానే నిర్మించినట్లు ఆరోపించారు. డ్యాం పిల్లర్లు భూమిలోకి కుంగిపోవటంతో పిల్లర్లకు పెద్దఎత్తున పగుళ్ళు వచ్చేశాయి. పిల్లర్లు కుంగిపోవటతో డ్యామ్ ప్లాట్ ఫారమ్ కూడా చాలాచోట్ల చీలిపోయింది. నీటిని నిల్వచేస్తే డ్యాంపగిలిపోతుందని ఎన్డీఎస్ఏ నిపుణులు ఎప్పుడో తేల్చిచెప్పారు. 2023 ఎన్నికలు మరో నెలరోజులుందనగా కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు బయపడ్డాయి. అప్పటినుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం జరుగుతునే ఉంది. తాజాగా ఎన్డీఎస్ఏ రిపోర్టుతో మాటల యుద్ధం మరింతగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలోనే హరిరామ్ ఇంట్లో ఏసీబీ దాడులు, భారీగా ఆస్తులు బయటపడ్డాయి. విచారణలో హరిరామ్ నుండి ఇంకెన్ని విషయాలు రాబడుతారో చూడాలి.