
కొండా దంపతులు పైచేయి సాధించారా ?
ఒకరిమీద మరొకరు పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) తో పాటు పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ మల్లురవికి కూడా ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే
ప్రత్యర్ధులమీద కొండా దంపతుల దెబ్బ ఇంతగట్టిగా తగులుతుందని కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఊహించుండరు. గడచిన నెలరోజులుగా వరంగల్ జిల్లాలో మంత్రి కొండాసురేఖ(Konda Surekha), కొండా మురళికి(Konda Murali), ప్రత్యర్ధులకు మధ్య పచ్చిగడ్డి వేయకుండానే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. మంత్రికి ప్రత్యర్ధివర్గం అంటే వరంగల్ వెస్ట్ ఎంఎల్ఏ నాయిని రాజేంద్రరెడ్డి, స్టేషన్ ఘన్ పూర్, పరకాల ఎంఎల్ఏలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంఎల్సీ బస్వరాజ్ సారయ్యతో పాటు మరికొందరు నేతలున్నారు. వీళ్ళంతా కలిసి కొండా దంపతులను చాలాతీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకరిమీద మరొకరు పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) తో పాటు పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ మల్లురవికి కూడా ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. ఫిర్యాదుల ఆధారంగా మీనాక్షి, మల్లురవి రెండు గ్రూపులతోను మాట్లాడారు.
ఇలాంటి నేపధ్యంలో ప్రత్యర్ధివర్గంలో కీలకమైన ఎంఎల్ఏ నాయిని మీడియాతో మాట్లాడుతు జిల్లాలోని నేతల మధ్య అసలు విభేదాలే లేవని కొత్తపాట అందుకున్నారు. పార్టీలో కొండాదంపతులు కావాలో లేకపోతే తాము కావాలో తేల్చుకోమని కొద్దిరోజుల క్రితమే పార్టీ నాయకత్వంతో గట్టిగా చెప్పిన నాయిని సడెన్ గా ఎందుకు యూటర్న్ తీసుకున్నారో అర్ధంకావటంలేదు. శుక్రవారం క్రమశిక్షణ కమిటి ఛైర్మన్ తో మాట్లాడిన నాయిని తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. ఆ సందర్భంలో ఎంఎల్ఏ ఏమన్నారంటే వరంగల్ జిల్లాలో ఏ ఎంఎల్ఏ కూడా మరో ఎంఎల్ఏపై ఫిర్యాదు చేయలేదన్నారు. మల్లురవి(Mallu Ravi)తో భేటీలో కూడా ఫిర్యాదుల అంశం అసలు ప్రస్తావనకే రాలేదని చెప్పారు.
జిల్లా పార్టీ నేతల మధ్య చిన్న, చిన్న బేధాభిప్రాయాలు సహజమే అని చాలా తేలిగ్గా తీసుకున్నారు. నేతల మధ్య చిన్న బేదాభిప్రాయాలను మీడియానే పెద్దవిగా ప్రచారం చేస్తోందని నిష్టూరంగా మాట్లాడారు. తొందరలోనే అన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయని నాయిని ఆశాభావం వ్యక్తంచేశారు. వచ్చే సోమవారం కొందరు ఎంఎల్ఏలు క్రమశిక్షణ కమిటితో భేటీ కాబోతున్నట్లు కూడా నాయిని తెలిపారు.
తాజాగా నాయిని మాటలు విన్నతర్వాత అందరిలోను ఒకటే అనుమానం మొదలైంది. తమమధ్య బేదాభిప్రాయాలు, పరస్పరం చేసుకున్న ఫిర్యాదులు, జరిగిన విచారణలు, భేటీల్లో ప్రత్యర్ధులపై కొండాదంపతులు పైచేయి సాధించినట్లుగా అర్ధమవుతోంది. ప్రత్యర్ధివర్గం కొండా దంపతులపై చాలా ఆరోపణలు చేశారు. అలాగే కొండా దంపతులు కూడా ప్రత్యర్ధివర్గంలోని ఎంఎల్ఏలు, నేతల్లో ఒక్కొక్కరిపై చాలా డీటైల్డ్ గా ఫిర్యాదులు, ఆధారాలతో కూడిన 16 పేజీల రిపోర్టు అందించారు. తమ రిపోర్టును మీనాక్షికి అందించిన కొండా దంపతులు ఫిర్యాదులన్నింటిపైనా విచారణ చేయించుకుని ఎవరిది తప్పుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని ఛాలెంజ్ చేశారు. కొండా దంపతుల ఛాలెంజ్ ప్రభావం చాలా తీవ్రంగా పడినట్లుంది.
పార్టీలో అంతర్గతంగా ఏమిజరిగిందో తెలీదుకాని సడెన్ గా ప్రత్యర్ధివర్గంలో కీలకమైన నాయిని మీడియాతో మాట్లాడుతు తమ మధ్య అసలు విబేధాలే లేవని, అన్నీ సర్దుకుంటాయని అనటమే కాకుండా మీడియానే చిన్న సమస్యలను పెద్దగా చూపించి ప్రచారం చేసిందని నిందలు వేశారు. దాంతో పార్టీలో అంతర్గతంగా కొండా దంపతుల ప్రభావం ప్రత్యర్ధివర్గంపై చాలా తీవ్రంగానే పడినట్లు అర్ధమవుతోంది.