కల్వకుంట్ల కవిత స్టాండులో  తేడా కనిపెట్టారా ?
x
Kalvakuntla Kavitha

కల్వకుంట్ల కవిత స్టాండులో తేడా కనిపెట్టారా ?

ఆర్డినెన్స్ జారీ విషయంలో ఎనుముల రేవంత్ రెడ్డికి మద్దతుగా ఎంఎల్సీ మాట్లాడుతున్నారు.


కాలం గడచికొద్దీ మార్పులు రావటం సహజం. ఈ విషయం మనుషులకు బాగా వర్తిస్తుంది. ఇపుడీ విషయం ఎందుకంటే బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత స్టాండులో మార్పు కనిపిస్తోంది కాబట్టే. ఇంతకీ కవిత(Kavitha) స్టాండులో మార్పు ఏమిటంటే బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై కవిత బీఆర్ఎస్(BRS) వైఖరిని తప్పుపట్టడమే. ఆర్డినెన్స్ జారీ విషయంలో ఎనుముల రేవంత్ రెడ్డికి మద్దతుగా ఎంఎల్సీ మాట్లాడుతున్నారు. రేవంత్(Revanth) కు మద్దతుగా మాట్లాడినా పర్వాలేదు కాని ఏకంగా బీఆర్ఎస్ వైఖరిని తప్పుపట్టడమే ఆశ్చర్యంగా ఉంది. బీసీ రిజర్వేషన్ల కోసం రేవంత్ క్యాబినెట్ ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయిస్తే దాన్ని బీఆర్ఎస్ కీలకనేతలు కేటీఆర్, హరీష్ రావు పదేపదే తప్పుపడుతున్నారు.

ఆర్డినెన్స్ పేరుతో రేవంత్ బీసీలను మోసంచేస్తున్నాడంటు బీఆర్ఎస్ కీలకనేతలు ఆరోపణలు చేస్తుంటే కవిత మాత్రం ఆర్డినెన్స్ జారీచేయాలన్న నిర్ణయానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆర్డినెన్స్ విషయంలో తాను న్యాయనిపుణులతో అన్నీ కోణాల్లోను చర్చించిన తర్వాతే క్యాబినెట్ నిర్ణయానికి మద్దతు పలికినట్లు చెప్పారు. ఇదేసమయంలో ఆర్డినెన్స్ జారీవిషయంలో బీఆర్ఎస్ తప్పుడు స్టాండ్ తీసుకుందని కీలక నేతల వైఖరినే తప్పుపడుతున్నారు. పైగా ఆర్డినెన్స్ విషయంలో బీజేపీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఏమన్నారంటే రేవంత్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పంపిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లును నరేంద్రమోదీ(Narendra Modi)తో మాట్లాడి పార్లమెంటులో ఆమోదింపచేయాలని ఒత్తిడి తెస్తున్నారు.

మొత్తంమీద బీసీల రిజర్వేషన్ల విషయంలో రేవంత్ ప్రభుత్వానికి కవిత ఫుల్లు మద్దతుగా నిలబడటమే ఆశ్చర్యంగా ఉంది. ఈవిషయంలోనే కవిత స్టాండ్ మారుతోందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. కవిత తన స్టాండ్ మార్చుకోవటానికి కారణం ఏమిటంటే సొంతపార్టీ బీఆర్ఎస్ లో ఎదురవుతున్న నిరాధరణే అన్నది క్లియర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అన్న కేటీఆర్(KTR) తో చెడిన దగ్గర నుండి కవితను పార్టీలోని నేతలు, క్యాడర్ పట్టించుకోవటంలేదు. అందుకనే కవిత కూడా తన అన్న వైఖరిని పేరు పెట్టకుండా పదేపదే తప్పుపడుతున్నారు. అయితే వివిధ కారణాలవల్ల కవితను డైరెక్టుగా పార్టీలోనుండి బయటకు పంపలేకపోతున్నారు.

అందుకనే పొమ్మనకుండా పొగపెడుతున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కవితమీద యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసినా, బహిష్కరించినా ఆమె కేటీఆర్ టార్గెట్ గా పెద్ద రచ్చచేసేయటం ఖాయం. ఒకసారి చేసిన రచ్చకే దాదాపు మూడువారాలు పార్టీ నానా అవస్తలుపడింది. అందుకనే పార్టీ వైపునుండి కాకుండా తనంతట తానుగానే పార్టీకి దూరమయ్యేట్లుగా కవితకు పరిస్ధితులు కల్పిస్తున్నట్లు అర్ధమవుతోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కవితను తీసేసి మాజీమంత్రి కొప్పులఈశ్వర్ ను ప్రకటించటమే తాజా ఉదాహరణ.

ఒకవేళ కవిత గనుక బీఆర్ఎస్ నుండి బయటకు రావాల్సొస్తే అప్పుడు ఆమె అడుగులు ఎటువైపు ? అన్నదే పాయింట్. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కవిత అడుగులు బహుశా కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ లో ఎక్కువ కాలం ఉండలేరు, బీజేపీలోకి వెళ్ళలేరు. అలాగని స్వతంత్రంగా రాజకీయాలు చేయలేరు. మైనస్ కేసీఆర్ కూతురు కవిత జీరో అన్న విషయం అందరికీ తెలుసు. జాగృతి అన్న వేదిక కొద్దిరోజులు హడావుడి చేయటానికితప్ప ఇంకదేనికీ పనికిరాదు. దీర్ఘకాల రాజకీయాలు చేయాలంటే ఏదో పార్టీ మద్దతు తప్పనిసరి. ఆ పార్టీయే కాంగ్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అందుకనే ముందుజాగ్రత్తగానే కాంగ్రెస్ విషయంలో కవిత తన స్టాండ్ మార్చుకుంటున్నట్లు కనబడుతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story