కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వలేదా ? ..అంతా అయోమయమేనా ?
x
N convention and Nagarjuna

కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వలేదా ? ..అంతా అయోమయమేనా ?

అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత తర్వాత వ్యవహారం అంతా అయోమయంగా తయారైంది.


అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత తర్వాత వ్యవహారం అంతా అయోమయంగా తయారైంది. కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని మీడియా ఒకటే ఊదరగొట్టేసింది. అయితే తాజాగా హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ మాట్లాడుతు హైకోర్టు అసలు స్టే ఇవ్వలేదని చెప్పారు. దాంతో మీడియాలో అయోమయం పెరిగిపోయింది. కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై స్టే ఇచ్చిందన్న విషయాన్ని నాగార్జున అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. బహుశా ఏదో లీకుల రూపంలో సినీ జర్నలిస్టుల ద్వారా బయటకు వదిలుంటారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో ఆక్రమణలు లేవని, అంతా సక్రమమే అని, పట్టాభూమిలోనే తాను నిర్మాణం చేసినట్లు నాగార్జున ట్విట్టర్లో చెప్పారు. కూల్చివేతలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయబోతున్నట్లు మాత్రమే చెప్పారు. అయితే ఆ తర్వాత నాగార్జున కోర్టుకు వెళ్ళినట్లు, హైకోర్టు స్టే విధించినట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఇంతచెప్పిన హీరో కోర్టు స్టే ఇచ్చిన కాపీని మాత్రం ట్విట్టర్లో జతచేయలేదు. అయితే కారణాలు ఏమైనా కూల్చివేతలపై కోర్టు స్టే ఇచ్చిందనే వార్త వైరల్ అయ్యింది. అందరు నిజమే అనుకుంటున్న సమయంలో సడెన్ గా హైడ్రా కమీషనర్ రంగనాధ్ మీడియాతో మాట్లాడారు.

కూల్చివేతలను నిలిపేయాలని కోర్టు స్టే ఇవ్వటం అబద్ధమన్నారు. కన్వెన్షన్ సెంటర్ విషయంలో గతంలో కూడా కోర్టు స్టే ఇవ్వలేదని స్పష్టంచేశారు. స్టే ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నదే కాని నిజంగా హైకోర్టు స్టే ఇవ్వలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరి కోర్టు స్టే ఇచ్చినట్లుగా ఎవరు చెప్పారు ? ఎలా ప్రచారంలోకి వచ్చిందో ఇపుడు ఎవరికీ అర్ధంకావటంలేదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా తయారైంది హైకోర్టు స్టే వ్యవహారం. నాగార్జున చెరువును ఆక్రమించి అక్రమంగా కన్వెన్షన్ సెంటర్ నిర్మించుకున్నట్లు రంగనాధ్ చెప్పారు. కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలో చట్టప్రకారమే తాము నడుచుకున్నట్లు చెప్పారు. కూల్చివేతల్లో తాము ఎక్కడా చట్టాన్ని మీరలేదని కమీషన్ స్పష్టంగా చెప్పారు.

Read More
Next Story