రేవంత్ ఇచ్చిన ట్విస్టును ప్రతిపక్షాలు ఊహించలేదా ?
x
Revanth and opposition leaders

రేవంత్ ఇచ్చిన ట్విస్టును ప్రతిపక్షాలు ఊహించలేదా ?

రేవంత్ ట్విస్టు దెబ్బకు ప్రతిపక్షాలు బిత్తరపోయాయా ? తాజా పరిణామాలను గమనిస్తే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే రేవంత్ ట్విస్టు దెబ్బకు నోరిప్పలేకపోయాయి.


రేవంత్ ట్విస్టు దెబ్బకు ప్రతిపక్షాలు బిత్తరపోయాయా ? తాజా పరిణామాలను గమనిస్తే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే రేవంత్ ట్విస్టు దెబ్బకు ఇప్పటివరకు ప్రతిపక్షాలు నోరిప్పలేకపోయాయి. ఇంతకీ విషయం ఏమిటంటే మూసీ రివర్ ప్రాజెక్టు డెవలప్మెంట్ కు సంబంధించి బాధితులకు ఏ విధంగా న్యాయంచేయాలో చెప్పమని ప్రతిపక్షాలను రేవంత్ కోరారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజల కోసం ఏం చేద్దాం ? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ప్రత్యామ్నాయం ఏమిటి ? ఇళ్ళు కట్టిద్దామా ? మూపీని అలాగే వదిలేసి మూసేద్దామా ? చర్చకు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వండని ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావును రేవంత్ కోరారు. మూసీనది ప్రాంతంలోని పేదల్లో ఎవరినీ నిర్వాసితుల్ని చేయబోమని రేవంత్ హామీ ఇచ్చారు. కేవలం తమ ఆస్తులు, ఫాంహౌసులు కాపాడుకోవటానికి మాత్రమే పేదలను ప్రతిపక్షాల నేతలు కవచంలో వాడుకుంటున్నట్లు మండిపడ్డారు. బాధితులు ప్రతిపక్షాల నేతలు చెప్పే మాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

పేదల కష్టాలు, కన్నీళ్ళు తెలీకుండానే తాను ముఖ్యమంత్రిని అయ్యానా అని ప్రతిపక్షాల నేతలను నిలదీశారు. మూసీప్రాంతంలో ఉంటున్న నివాసితులను ఖాళీలు చేయిస్తే బాధపడతారని తనకు తెలీదా అని ధ్వజమెత్తారు. నదికి వరద వచ్చినపుడు ఇళ్ళు కూలిపోయి, ప్రాణాలు పోతే ప్రతిపక్షాలకు బాగుంటుందా అని మండిపడ్డారు. భవిష్యత్తుల్లో నిర్వాసితుల్లో ఎవరికీ ఎలాంటి కష్ట, నష్టాలు జరగకూడదనే ప్రభుత్వం గట్టిగా డిసైడ్ అయి బాధితులకు వేర్వేరు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించి ఇక్కడి నుండి ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. మూసీనదిలోని నీళ్ళంతా విషమయమైపోయిందన్న విషయం అందరికీ తెలుసన్నారు. విషపూరితమైపోయిన నదిని ప్రక్షాళన చేసి మంచినీటి నదిగా మార్చేందుకు తమ ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నదిని ప్రక్షాళన చేయాలంటే ముందు నదికి రెండువైపులా ఉన్న వారిని ఖాళీ చేయించక తప్పదు కదా అని ప్రశ్నించారు.

ఆక్రమణలను తొలగించి, ప్రక్షాళన మొదలుపెట్టి మళ్ళీ మూసీకి పూర్వవైభవం తీసుకురావాలంటే ప్రభుత్వం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సుంటుంది అన్న విషయం తమకు తెలుసని రేవంత్ అన్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రభుత్వం అమలుచేసి తీరుతుంది కాబట్టి ప్రతిపక్షాలు మంచి సలహాలు ఇవ్వాలని రేవంత్ కోరారు. నిజానికి రేవంత్ ఇచ్చిన ట్విస్టును ప్రతిపక్షాల నేతలు ఏమాత్రం ఊహించలేదనే చెప్పాలి. ప్రతిపక్షాల నేతలతో మాట్లాడే బాధ్యతను రేవంత్ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీద పెట్టారు.

మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాల నేతలను రేవంత్ చర్చలకు పిలుస్తారని ప్రతిపక్షాల నేతలు అనుకోలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పదేళ్ళ హయాంలో ఏ సందర్భంలో కూడా ఒక్కసారంటే ఒక్కసారి కూడా కేసీఆర్ ప్రతిపక్షాలతో సమావేశం అయ్యింది లేదు. అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్షాలు డిమాండ్లు చేసినా కేసీఆర్ లెక్కచేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇపుడు రేవంత్ కూడా ప్రతిపక్షాలను ఏ విషయంలో కూడా లెక్కలోకి తీసుకోరనే అనుకున్నారు. అలాంటిది ప్రతిపక్షాల ఆలోచనలకు భిన్నంగా రేవంత్ మూసీనది ప్రక్షాళన విషయంలో చర్చలకు పిలిచేటప్పటికి ఏమిచేయాలో అర్ధంకావటంలేదు.

మూసీనది ప్రక్షాళనను వద్దని ప్రతిపక్షాలు చెప్పలేవు. ప్రక్షాళన సమయంలో నివాసితులను అక్కడినుండి ఖాళీ చేయించక తప్పదని కూడా అందరికీ తెలుసు. నివాసితులను ఎందుకు ఖాళీ చేయించాలంటే నదికి రెండువైపులా జనాలు ఆక్రమణలు చేసేయటంతో నది కుచించుకుపోయింది. అందుకనే నదికి పూర్వవైభవం తీసుకురావాలంటే వెడల్పుచేయాలి. నదిని వెడల్పుచేయాలంటే రెండువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించక తప్పదు. ఇపుడు రేవంత్ ప్రభుత్వం చేస్తున్నది ఇదే. కాబట్టి రేవంత్ ప్రభుత్వం చేస్తున్న పనులకు అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల నేతలు చెప్పటానికి ఏమీ ఉండదు.

ఎందుకంటే మూసీ రివర్ ప్రాజెక్టును అసలు మొదలుపెట్టిందే కేటీఆర్. కేటీఆర్ మంత్రిగా ఉన్నపుడు మూసీ ప్రాజెక్టును మొదలుపెట్టారు. అయితే పనులు ముందుకు పడలేదంతే. రెండువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించాలని, నదిని వెడల్పు చేయాలని, మురికికూపంగా మారిన నదిని శుద్దిచేసి మళ్ళీ మంచినీటి నదిగా మార్చాలని ప్లాన్ చేసి దీనికోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ను పెట్టిందే కేటీఆర్. కాకపోతే ఇపుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, అదే ప్రాజెక్టును రేవంత్ టేకప్ చేయటాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే బాధితుల పక్షాను పోరాడుతామంటు ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వంపై రెచ్చిపోతున్నారు. ప్రభుత్వంపైకి జనాలను ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావు రెచ్చగొడుతున్న విషయం అర్ధమవుతోంది.

అందుకనే మూసీ ప్రాజెక్టు సుందరీకరణపై రేవంత్ ప్రతిపక్షాలను ప్రత్యేకించి ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ ను చర్చలకు పిలిచి సూచనలు, సలహాలు తీసుకోమని భట్టి విక్రమార్కకు చెప్పింది. మరి ఉపముఖ్యమంత్రి చర్చలకు పిలిస్తే ప్రతిపక్షాల నేతలు హాజరవుతారా ? హాజరైతే ఏమి సూచనలిస్తారు ? ఏమి సలహాలిస్తారనే విషయం ఇపుడు ఆసక్తిగా మారింది. మొత్తానికి ప్రతిపక్షాలను చర్చలకు పిలిచే పేరుతో రేవంత్ పెద్ద ట్విస్టే ఇచ్చారని చెప్పాలి.

Read More
Next Story