మావోయిస్టు పార్టీలో కుమ్ములాటలు పెరిగిపోతున్నాయా ?
x
Maoists

మావోయిస్టు పార్టీలో కుమ్ములాటలు పెరిగిపోతున్నాయా ?

మావోయిస్టునేతల మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరుకోవటంతోనే సమన్వయలోపం పెరిగిపోయి పరస్పర విరుద్ధంగా లేఖలు విడుదల అవుతున్నాయనే అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు


గతంలో ఎప్పుడూ లేనంతగా మావోయిస్టుపార్టీ అగ్రనేతలమధ్య తీవ్రస్ధాయిలో కుమ్ములాటలు మొదలైనట్లు అర్ధమవుతోంది. మావోయిస్టు నేతల పేరుతో వరుసగా విడుదల అవుతున్న లేఖలతో అయోమయం పెరిగిపోతోంది. పౌరహక్కుల నేతల్లో కొందరు మావోయిస్టుల పేరుతో విడుదల అవుతున్న లేఖలు పోలీసులు రాయిస్తున్నవే అని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మానవహక్కులసంఘాల్లోని కొందరునేతలేమో (Maoists)మావోయిస్టునేతల మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరుకోవటంతోనే సమన్వయలోపం పెరిగిపోయి పరస్పర విరుద్ధంగా లేఖలు విడుదల అవుతున్నాయనే అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. కారణాలు ఏవైనా విడుదలవుతున్న లేఖల్లోని అంశాలు, వాటికి కౌంటర్ గా మళ్ళీ విడుదలవుతున్న లేఖలతో మావోయిస్టుపార్టీలోని అగ్రనేతల మధ్య కుమ్ములాటలు, సమన్వయలోపం స్పష్టంగా కనబడుతోంది.

మొదట మావోయిస్టు పార్టీ అధికారప్రతినిధి అభయ్ పేరుతో నాలుగురోజుల క్రితం ఒకలేఖ విడుదలైంది. ఆ లేఖపైన ఆగష్టు 15వ తేదీ అనుంది. అందులో కేంద్రప్రభుత్వంతో చర్చలకు మావోయిస్టు పార్టీ సిద్ధంగా ఉందని, ఆయుధాలను పక్కనపెట్టేందుకు రెడీగా ఉన్నట్లుంది. ఆపరేషన్ కగార్లో అగ్రనేతలను కోల్పోవటం, కాలంచెల్లిన సిద్ధాంతాలతోనే ముందుకు సాగటంవల్ల జరుగుతున్న నష్టాలు, ప్రజావిశ్వాసానికి దూరం అవటం, కాలమాన పరిస్ధితులకు తగ్గట్లుగా అప్ టేడ్ అవకపోవటం వల్లే భారీనష్టాలు జరుగుతున్నాయని అభయ్ అభిప్రాయపడుతున్నట్లుంది. లేఖలో ఎడమవైపు పైన అభయ్ కలర్ ఫొటో కూడా ప్రింటయ్యుంది.

లేఖ విడుదలైన వెంటనే పౌరహక్కులు, ప్రజహక్కుల సంఘాల నేతలు మాట్లాడుతు ఇది మావోయిస్టులు రాసిన లేఖ కాదని అభిప్రాయపడ్డారు. ఫొటోలు ముద్రించి ఉన్న లేఖలను, మెయిల్ ఐడీలు, సోషల్ మీడియా ఖాతాల వివరాలను అభిప్రాయసేకరణ కోసం మావోయిస్టులు ఎప్పుడూ జనాలకు అందుబాటులో ఉంచరని చెప్పారు. ఈ కోణంలో చూస్తే హక్కుల సంఘాల నేతలు చెప్పేది నిజమే అనిపించింది. రెండురోజుల తర్వాత ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత జరుగుతున్న పరిణామాలు, అగ్రనేతలను కోల్పోవటం, ఎన్ కౌంటర్లలో పోలీసులకు జరుగిన నష్టాలు, మావోయిస్టుల సిద్ధాంతాలపై పునఃపరిశీలన జరుపుకోవాల్సిన అవసరాల పేరుతో మరోలేఖ విడుదలైంది. ఈలేఖకు మావోయిస్టులకు అసలు సంబంధాలే లేవని హక్కులసంఘాల నేతలు చెప్పారు. ఏదేమైనా మావోయిస్టుల పేరుతో విడుదలైన రెండులేఖలపై చర్చలైతే బాగా జరుగుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే శుక్రవారం తెలంగాణ రాష్ట్రకమిటి అధికార ప్రతినిధి జగన్ పేరుతో మరో లేఖ విడుదలైంది. అందులో అభయ్ రాసిన లేఖలోని అంశాలతో మావోయిస్టుపార్టీకి ఎలాంటి సంబంధంలేదని, ఆఅభిప్రాయాలన్నీ ఆయన వ్యక్తిగతమని జగన్ ప్రకటించారు. సాయుధ పోరాటానికి విరామం ప్రకటించి శాంతిచర్చలకు సిద్ధంగా ఉన్నామని అభయ్ చెప్పింది తప్పని జగన్ వివరించారు. చర్చలు జరపాలన్నది అభయ్ ఆలోచన మాత్రమే అని ఈ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటి ఇచ్చారు. ఇదేలేఖలో బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలను మరింత తీవ్రతరంచేయాల్సిన అవసరాన్ని జగన్ నొక్కిచెప్పారు. జగన్ తాజా లేఖద్వారా అర్ధమైంది ఏమిటంటే ఆయుధాలను విడిచిపెట్టే ఆలోచన మావోయిస్టుల్లో లేదని.

పైగా అభయ్ పేరుతో విడుదలైన అంశాలను జగన్ తప్పుపట్టారు. జూన్ నుండి సెప్టెంబర్ మధ్య పార్టీ చాలామంది కేంద్ర, రాష్ట్ర, జిల్లానేతలను కోల్పోయిన తర్వాత కేంద్రప్రభుత్వంతో చర్చలు జరిపేది ఏముంటుందని జగన్ అడిగారు. మావోయిస్టులపై హత్యాకాండ జరుగుతున్నపుడు నెలరోజుల సమయం ఇవ్వాలని కేంద్రాన్ని కోరటం అనాలోచితం అని అభిప్రాయపడ్డారు. పార్టీ కమిటీసభ్యులు ఈమెయిల్ ఇచ్చి అభిప్రాయాలు కోరటం ఏమిపద్దతో అని ఎద్దేవా చేశారు. ఉద్యమాన్ని వదిలేయాలని అనుకున్నపుడు పార్టీకమిటిలో చర్చించి అనుమతి తీసుకోవచ్చన్నారు. తన అభిప్రాయాన్ని పార్టీ ఛానల్ లో పంపించినా అగ్రనేతల నుండి సమాధానం దొరికేదని జగన్ చెప్పారు. అలాకాకుండా ఇంతటి కీలకవిషయాన్ని బహిరంగంగా ప్రకటించటంతో పార్టీశ్రేణుల్లో గందరగోళం తలెత్తినట్లుగా జగన్ మండిపోయారు. మొత్తంమీద జగన్ తాజా లేఖలో అభయ్ ను తప్పుపట్టిన అంశాలు చాలానే ఉన్నాయి. జగన్ లేఖ కారణంగా అభయ్ పేరుతో విడుదలైన లేఖ నిజమైనదే అని అర్ధమవుతోంది.

ఇప్పటికి విడులైన లేఖల ద్వారా అర్ధమవుతున్నది ఏమిటంటే మావోయిస్టుపార్టీలోని అగ్రనేతల మధ్య విభేదాలు పెరిగిపోయయని. అలాగే సమన్వయలోపం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. దీని ఫలితంగానే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు తమఅభిప్రాయాలను లేఖలద్వారా బహిర్గతం చేస్తున్నారు. ఈకారణంగా మావోయిస్టుల్లో గందరగోళం పెరిగిపోతున్నట్లు స్వయంగా జగనే అంగీకరించారు.

జరుగుతున్నది చూస్తుంటే ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు పూర్తిగా డిఫెన్సులో పడిపోయినట్లు అర్ధమవుతోంది. ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్రం మావోయిస్టులకు ఒకటే విషయాన్ని స్పష్టంచేసింది. అదేమిటంటే మావోయిస్టులు బతికి ఉండాలంటే పోలీసులకు లొంగిపోవటం. లేకపోతే ఎన్ కౌంటర్లలో చనిపోవటం. 2026, మార్చి 30లోగా దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటనలో భాగంగానే భద్రతదళాలు అడవుల్లో ప్రత్యేకించి దండకారణ్యాన్ని నాలుగువైపుల నుండి కమ్ముకుంటున్నాయి. మావోయిస్టులకు కంచుకోటలని పేరున్న దుర్గంగుట్టలు, కర్రెగుట్టలు, దండకారుణ్యంలోకి భద్రతదాళాలు చొచ్చుకునిపోయి ఎన్ కౌంటర్లు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

మావోయిస్టు నేతల్లో చీలికలు వచ్చేసిందేమో ? ఆలూరు

మావోయిస్టు నేతల పేర్లతో రిలీజ్ అవుతున్న లేఖలపై మానవహక్కుల సంఘం ఉభయరాష్ట్రాల సమన్వయ కమిటి సభ్యుడు ఆలూరు చంద్రశేఖర్ ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ‘‘మార్చిలో అభయ్ పేరుతో లేఖ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే’’ అన్నారు. ‘‘లేఖలో అభయ్ ఆలోచనల్లో చాలా తేడా కనబడింద’’న్నారు. ‘‘లొంగిపోయే విషయంలో కేంద్రప్రభుత్వాన్ని రిక్వెస్టు చేసినట్లుగా ఉంద’’ని ఆలూరు అభిప్రాయపడ్డారు. ‘‘మానవహక్కుల వేదికగా మావోయిస్టునేతలు సమావేశమయ్యేందుకు వెసులుబాట్లు లేవ’’ని జరుగుతున్న ప్రచారాన్ని గుర్తుచేశారు. ‘‘వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టులపై కేంద్రప్రభుత్వం పూర్తి అప్పర్ హ్యాండ్ లో ఉంద’‘న్నారు. ‘‘అందుకనే మావోయిస్టులతో చర్చలకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా లేద’’న్నారు. ‘‘ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్రం అంటోంద’’ని గుర్తుచేశారు.

‘‘చాలామంది అగ్రనేతలు ఎన్ కౌంటర్లలో చనిపోవటమే కాకుండా మరెంతోమంది పోలీసులకు లొంగిపోయార’’ని గుర్తుచేశారు. కేంద్రప్రభుత్వం-మావోయిస్టుల మధ్య ఆదివాసీలు నలిగిపోతుండటం బాధాకర’’మని అన్నారు. ‘‘ఒకవైపు ఆదివాసీలు నలిగిపోతున్నా వాళ్ళ సంక్షేమంకోసమే ఇద్దరూ పనిచేస్తున్నట్లు రెండువైపులా చెబుతుండటమే విచిత్ర’’మన్నారు. ‘‘ఆదివాసీ ప్రాంతాల్లో చాలావరకు భద్రతాదళాల చేతిలోకి వెళ్ళిపోయింద’’ని ఆలూరు అన్నారు. ‘‘ఆదివాసీ యువత గురించి ఎవరూ ఆలోచించటంలేదని, వాళ్ళ జీవనంగురించి ఎవరూ పట్టించుకోవటంలేద’’ని ఆరోపించారు. ‘‘ఆదివాసీల జీవనంగురించి కేంద్రాన్ని మావోయిస్టులు అడగటమే లేద’’ని ఆలూరు ఎత్తిచూపారు. ‘‘మైనింగ్, అడవులను స్వాధీనం చేసుకోవటంవల్ల ఆదివాసీలు నష్టపోతున్న విధానంపై మావోయిస్టులు కేంద్రాన్ని అడగకపోవటమే ఆశ్చర్యంగా ఉంద’’న్నారు. ‘‘ప్రజల సమస్యలు పరిష్కారంచేస్తే లొంగిపోతామని చెప్పాల్సిన మావోయిస్టులు ఆ మాట మాత్రం చెప్పటంలేద’’న్నారు.

‘‘సోను@ అభయ్ అరెస్టయ్యాడని కాదుకాదు పోలీసులకు ఎప్పుడో సరెండర్ అయిపోయాడని ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతోంద’’న్న విషయాన్ని ఆలూరు చెప్పారు. ‘‘అభయ్ అసలు మావోయిస్టుపార్టీలోనే లేడని కూడా వింటున్న’’ట్లు చెప్పారు. అభయ్ ఒదిన సుజాత పోలీసులకు లొంగిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘నేతల పేర్లతో బహిర్గతంఅవుతున్న లేఖల కారణంగా మావోయిస్టు నాయకత్వంలో చీలకలు వచ్చేసింద’’నే అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉన్న మావోయిస్టు పార్టీలో ప్రస్తుత పరిస్ధితులు ఆందోళనకరంగా ఉన్న’’ట్లు ఆవేధన వ్యక్తంచేశారు. ‘8తమ బాధంతా సామాన్య ప్రజల సంక్షేమం కోసమే’’ అని ఆలూరు చంద్రశేఖర్ చెప్పారు.

Read More
Next Story