
ఆర్టీసీలో చిల్లర సమస్యకు చెల్లుచీటీ..!
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణికులతో పాటు కండక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కండక్టర్.. నెక్స్ట్ స్టాప్‌కు ఒక టికెట్ ఇవ్వండని అడుగుతూ జేబులోనుంచి రూ.100 నోట్ తీశాడు మధు. అది చూసిన బస్ కండక్టర్.. వెంటనే టికెట్ కొట్టడం ఆపి.. రూ.15 చిల్లర లేదా అని అడిగాడు. చిల్లర కావాల్సిందేనని, తన దగ్గర చిల్లర లేదని స్పష్టం చేశాడు కండెక్టర్. దీంతో ఏం చేయాలో అర్థంకాక.. మధు బస్సు దిగేశాడు.. ఇది మధు అనే కుర్రవాడు మాత్రమే ఎదుర్కొన్న సమస్య కాదు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే దాదాపు ప్రతి వ్యక్తి ఎదుర్కొనే సమస్య. దీనిని నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుందా? అని ఆర్టీసీ ప్రయాణికులు ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. అయితే వారి ఈ చిల్లర కష్టాలకు తెలంగాణ ప్రభుత్వం చెట్టుచీటీ ఇచ్చేసింది. ఇకపై గ్రేటర్ పరిధిలో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో ఈ సమస్య తలెత్తకుండా ఇంట్రస్టింగ్ అప్‌డేట్ తీసుకొచ్చారు. అదే డిజిటల్ పేమెంట్స్. అవును.. అదినిజమే. ఇకపై గ్రేటర్ పరిధిలో బస్సులో ప్రయాణించాలంటే జేబులో చిల్లర తప్పనిసరి అన్న సమస్యకు స్వస్తి పలకొచ్చు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా మీ చెల్లింపులను చేసేయొచ్చు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అప్‌డేట్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిల్లర సమస్యలు అన్నీ ఇన్నీ కావు..
ఆర్టీసీ బస్సుల్లో ఉండే చిల్లర సమస్య అంతా ఇంతా తలనొప్పి కాదు. కొందరు చిల్లర లేకపోతే టికెట్ ఇవ్వనంటారు. తగిన చిల్లర తెచ్చుకోవాలి.. లేదంటే బస్సు దిగాలి అనేవారు కూడా ఉన్నారు. మరికొందరు.. టికెట్ ఇచ్చి.. దానిపై సదరు ప్రయాణికుడికి ఇవ్వాల్సిన చిల్లర అంకె వేసి ఇస్తాడు. దిగే సమయంలో అడిగి చిల్లర తీసుకో అంటాడు. మనం హడావుడిలో ఉండి.. మర్చిపోయి దిగినా.. ఆ చిల్లర ఇక అంతే. ఇలా ఇంకెన్నో సమస్యలు. కొన్ని సందర్భాల్లో కండక్టర్, ప్రయాణికుల మధ్య చిల్లర విషయంలో భారీభారీ గొడవలు అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగని ప్రతి ప్రయాణికుడు సుద్దపూస అని కాదు.. కొందరు అతితెలివి మంతులు రూ.500 లాంటి పెద్ద నోట్లకు చిల్లర కోసం మాత్రమే బస్సు ఎక్కుతుంటారు. అలాంటి వారితో కూడా అనేక సమస్యలు వస్తుంటాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ వల్ల ఇలాంటి అన్ని చిల్లర సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు.
ఎప్పటి నుంచో కసరత్తులు..
అయితే ఆర్టీసీలో అతిపెద్ద తలనొప్పిగా మారుతున్న ఈ చిల్లర సమస్యకు చరమగీతం పాడాలని అధికారులు ఏడాదిపైగానే కసరత్తులు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల కోసం ఐటిమ్స్(ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్)ను రూపొందించారు. ఈ మిషన్‌పై పలు ట్రయల్స్ తర్వాత తాజాగా గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఐటిమ్స్‌ను పలు డిపోల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అంతేకాకుండా వీటిని ఎలా ఉపయోగించాలి అన్న అంశంపై కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఇవన్నీ పూర్తి కావడంతో.. తాజాగా గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ఈ ఐటిమ్స్ ద్వారా డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణికులతో పాటు కండక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిల్లర సమస్యలు ప్రతి రోజూ సతమతం చేసేవని, ఆ ఇబ్బందులకు ఈ మిషన్లు ఫుల్‌స్టాప్ పెట్టాయని వారు అంటున్నారు.