TSFDC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు..
x

TSFDC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు..

తెలంగాణ ప్రభుత్వం సినీ నిర్మాత దిల్ రాజుకు కీలక పదవి అందించింది. ఆ బాధ్యతలను ఆయన ఈరోజు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


దిల్ రాజు(Dil Raju).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. హీరో, విలన్ కాదు కదా.. కనీసం నటుడు కూడా కాకపోయినా.. అందరికీ సుపరిచితమైన పేరు ఇది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలకు ఈయనే నిర్మాత కావడం ఇందుకు ప్రధాన కారణం. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటేనే ఆ సినిమా హిట్ అయినట్లే అన్న టాక్ వినిపిస్తుంది. సినిమాలను నిర్మించే విషయంలో దిల్ రాజు చాలా జాగ్రత్త వహిస్తారని సన్నిహితులు చెప్పే మాట. అయితే ఇన్నాళ్లూ ఆయన సేవలను తన సినిమాలకు, కొద్దిగా ఇతర సినిమాలకే అందాయి. అయితే దీనిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకోసమే ఆయనకు కీలక పదవిని కట్టబెట్టింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్(TSFDC) ఛైర్మన్ పదవికి దిల్ రాజును నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఇటీవల విడుదల చేశారు. కాగా బుధవారం ఆయన టీఎస్ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగానే తనకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యావాదాలు తెలిపారు.

అందరి సహకారం అవసరం: దిల్ రాజు

‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించి ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకురావడానికి సర్వశక్తులా శ్రమిస్తాను. ఇది నా ఒక్కడితో జరిగే పని కాదు. ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలి తెలంగాణ సంస్కృతి, అభివృద్ధికి కృషి చేస్తా. మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన తర్వాతనే తెలుగు చిత్రసీమకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి. ఈ పదవి నా బాధ్యతను మరింత పెంచింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తా. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల్లో ఉన్న సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తా’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఈరోజు దిల్ రాజు పుట్టినరోజు కావడంతో ఈరోజు బాధ్యతలు తీసుకోవడం విశేషంగా మారింది. ఈ సందర్భంగానే సినీ ఇండస్ట్రీ ప్రముఖలతో పాటు మరెందరో సోషల్ మీడియా వేదికగా దిల్ రాజుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం దిల్ రాజు.. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోతా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో పాటుగా వెంకటేష్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. వీటితో పాటు పలు ఇతర సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Read More
Next Story