జీఎన్ సాయిబాబాకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నివాళి
డాక్టర్ జీఎన్ సాయిబాబా అకాల మరణం పట్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
డాక్టర్ జీఎన్ సాయిబాబా అకాల మరణం పట్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
పదేళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఆయన కొద్ది నెలల క్రితమే విడుదలయ్యారు. తప్పుడు కేసుల్లో ఇరుక్కుని న్యాయపోరాటం చేసి చివరకు సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తూ, అది స్వల్పకాలిక స్వేచ్ఛ. అంగవైకల్యం ఉన్న సాయిబాబాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సుదీర్ఘ నిర్బంధం ఈ సమస్యలలో కొన్ని సంక్లిష్టంగా మారడానికి, కొన్ని కొత్త సమస్యలు తోడవ్వడానికి దారితీసింది. అతని రెండు కాళ్లను ప్రభావితం చేసిన పోలియోతో పాటు, వెన్నెముక, నాడీ వ్యవస్థ లో కొన్ని లోపాలు రోజు రోజుకు నిర్వీర్యం కావటమే గాని నయం చేయలేని పరిస్థితులు కూడా ఉన్నాయి.
పోలీసులు అరెస్టు చేసే సమయంలో తగిలిన గాయాల కారణంగా ఒక చేయి పనిచేయడం లేదని, నాగపూర్ జైలులో సరైన వైద్య చికిత్సను నిరాకరించడంతోను అక్కడ అపరిశుభ్ర పరిస్థితులకు పేరుమోసిన అండా సెల్ లో ఉంచడం తోను ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. 2017 ఫిబ్రవరిలో బెయిల్ పై ఉన్నప్పుడు ఆయన తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్, గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడుతున్నట్లు నిర్ధారణ చేసి వెంటనే శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు సూచించారు.
గాల్ బ్లాడర్ రాళ్లకు చికిత్స చేయించుకోవడానికి, శస్త్రచికిత్స చేయించుకోవడానికి బెయిల్ లేదా పెరోల్ పై విడుదల చేయాలని ఆయన పదేపదే కోరినప్పటికీ, కరడుగట్టిన నేరస్థులు, హంతకులు, రేపిస్టులకు కూడా బెయిల్ లేదా పెరోల్ మంజూరు చేసే ప్రభుత్వం ఆయనకు బెయిల్ తిరస్కరించింది. ఇది మన క్రిమినల్ న్యాయ వ్యవస్థ వున్న శోచనీయమైన పరిస్థితిని తెలియజేస్తుంది. ఇలాంటి పరిస్థితిలోనే స్టాన్ స్వామి కస్టడీలో ఉండగానే మరణించిన విషయం తెలిసిందే.
ఎన్పీఆర్డీ అతని అరెస్టును, జైలులో ఉంచిన పరిస్థితులపై పదేపదే నిరసన వ్యక్తం చేస్తూ, అతని జీవించే హక్కు, గౌరవం, సమానత్వం, చిత్రహింసల నుండి రక్షణ, కోసం డిమాండ్ చేసింది. క్రూరమైన, అమానవీయమైన , అవమానకరమైన ప్రవర్తన, సహేతుకమైన వసతి నిరాకరణ ,ఆరోగ్య హక్కును హరించటం తో సహా వివక్షత తో ఎలా నియమాలను ఉల్లంఘీంచారో ఎత్తిచూపింది. భారతదేశం సంతకం చేసిన వివిధ అంతర్జాతీయ ఒప్పందాలతో పాటు దేశీయ చట్టాలు, వికలాంగులకు ప్రత్యేకమైన ఒప్పందాలకు కూడా ఇదంతా వ్యతిరేకంగా వుందని వీటిని మేము ఎత్తి చూపాము.చికిత్స నిరాకరణ ఫలితంగాను, చిత్రహింసలు- జైలులో అతను అనుభవించిన తీవ్రమైన కష్టం, అతని ఆరోగ్యంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది.
అతను విడుదలయ్యే సమయానికి ఆరోగ్యం నాశనమయ్యింది. ఇది చివరికి అతని ప్రాణాలను బలితీసుకుంది. నిరుపేదలు, అణగారిన, బలహీన వర్గాల కోసం పోరాడిన సాయిబాబాకు ఎన్పీఆర్డీ సెల్యూట్ చేస్తోంది. అన్యాయానికి, వ్యవస్థ క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఈ తరుణంలో ఆయన నిష్క్రమణ తీరని లోటు. ఆయన సతీమణి వసంత, కుమార్తె మంజీరా, ఇతర కుటుంబ సభ్యులకు ఎన్పీఆర్డీ ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది. .
[అనువాదం: డాక్టర్ జతిన్ కుమార్ ]