తెలంగాణలో పంట నష్టంపై విపత్తు కమిషనర్ ఆరా
x
వరద నష్టాన్ని పరిశీలిస్తున్న విపత్తు, పునరావాస నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్

తెలంగాణలో పంట నష్టంపై విపత్తు కమిషనర్ ఆరా

తెలంగాణలో కురిసిన భారీవర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.


తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాల వల్ల వివిధ జిల్లాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణం కంటే 83 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని దుంద్బీ నది వరదలతో తిరుమలపూర్, సిర్సావాడ గ్రామాల్లో పంట నష్టం జరిగింది.




విపత్తు కమిషనర్ పర్యటన

పంట నష్టంపై అంచనా వేయడానికి తెలంగాణ రాష్ట్ర విపత్తు, పునరావాస నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేశారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించిన అర్వింద్ కుమార్ సహాయ చర్యలు చేపట్టిన అధికారులు, తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, ఎన్సీసీ, ఆప్త మిత్ర వాలంటీర్లతో మాట్లాడారు.



పంటలను ముంచెత్తిన వరదలు

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరదనీరు ముంచెత్తడంతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో ఇసుక మేట వేయడంతో పంటలు దెబ్బతిన్నాయి. అప్పులు చేసి ఖరీఫ్ సీజనులో పంటలు వేస్తే వరుణుడు నిండా ముంచాడని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పంటనష్టానికి ఎకరానికి రూ.10వేలు
వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారీవర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలు చేస్తున్నారు.


Read More
Next Story