
తెలంగాణ అసెంబ్లీ
Telangana Assembly | నేటి అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్ఓఆర్ బిల్లు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు ఆర్ఓఆర్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు కీలక అంశాలైన కొత్త జూ పార్క్,నీటి కాలుష్యం అంశాలపై సభలో చర్చించనున్నారు.
సోమవారం ఉదయం పదిగంటలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. తెలంగాణ శాసనసభ మూడో శాసనసభ నాలుగో సమావేశంలో హైదరాబాద్ సమీపంలో కొత్త జూ పార్కు ఏర్పాటు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, మున్సిపల్ కార్మికుల హక్కులు, నీటి కాలుష్యం తదితర అంశాలపై చర్చించనున్నారు.
- తెలంగాణ వ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీల్లో సరైన రోడ్లు లేకపోవడంతో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై అసెంబ్లీ సభ్యులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని అడగనున్నారు. అన్ని గ్రామ పంచాయితీలు, నివాస కాలనీల మీదుగా బీటీ రోడ్లు వేయాలనే ప్రభుత్వ యోచనల గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తనున్నారు.
నేటి మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం
సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కీలకమైన ఆర్ఓఆర్ బిల్లు ఆమోదించేందుకు అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటన విడుదల చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ తో పాటు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్సు యూనివర్శిటీ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ యూనివర్శిటీ సవరణ బిల్లును కూడా సభలో పెట్టనున్నారు.
ముగ్గురు మాజీ సభ్యుల మృతికి సంతాపం
సోమవారం శాసనసభ ఇటీవల మరణించిన ముగ్గురు మాజీ సభ్యులకు సంతాపం తెలుపనున్నారు. మెట్ పల్లి మాజీ సభ్యురాలు కొమిరెడ్డి జ్యోతిదేవి, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య,దొమ్మాట మాజీ ఎమ్మెల్యే డి రామచంద్రారెడ్డిల మృతికి సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
పలు అంశాలపై సభ్యుల ప్రశ్నోత్తరాలు
తెలంగాణ రాష్ట్రంలో కరవు పీడిత జిల్లాలైన నల్గొండ, కరీంనగర్, జనగామ,మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిధుల కేటాయింపు, గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్ల నిర్మాణం, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల క్రమబద్ధీకరణ, గ్రామ పంచాయతీలు, మండల పరషత్తులు, జిల్లా పరిషత్తులకు పెండింగు బిల్లుల చెల్లింపు అంశాలు ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు రానున్నాయి. ముదిరెడ్డిపల్లి చెరువులో నీటి కాలుష్యం,కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈ విద్యార్థుల డిటెన్షన్, రాష్ట్రంలో బెల్టు షాపుల మూసివేత, ఐవీఎఫ్ కేంద్రాలు, జీరో ఎన్ రోల్ మెంట్ పాఠశాలల అంశాలను సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తనున్నారు.
అసెంబ్లీలో కీలక అంశాలు
గ్రామపంచాయతీలు, సర్పంచ్‌లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను ఎప్పుడు క్లియర్ చేయాలని యోచిస్తోందని ప్రశ్నిస్తూ చెల్లింపుల్లో జాప్యంపై అసెంబ్లీ సభ్యులు ఆందోళనకు దిగనున్నారు.ముదిరెడ్డి పల్లి ట్యాంక్‌లోకి కలుషిత నీటిని విడుదల చేస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ వల్ల నీటి కాలుష్యంపై పారిశ్రామిక, వాణిజ్య శాఖ మంత్రి స్పందించనున్నారు.
తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధిపై చర్చ
టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం ద్వారా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రయత్నాలు చేస్తోంది.ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కొత్త పర్యాటక పాలసీపై అధికారులతో చర్చించారు. హైదరాబాద్‌కు సమీపంలో కొత్త జూ పార్క్ ఏర్పాటుపై అసెంబ్లీ సభ్యులు చర్చించి ప్రాజెక్ట్ టైమ్‌లైన్‌పై సమాచారాన్ని అందించనున్నారు.ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ విద్యార్థుల సెమిస్టర్ పరీక్షలకు కనీసం 50 శాతం క్రెడిట్స్ సాధించాలనే నిబంధనతో పాటు డిటెన్షన్ విధానంపై ఆందోళనలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించనున్నారు.
ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చ
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రితోపాటు తెలంగాణలోని కీలక ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు ముందుగా ప్రణాళికలు రూపొందించినా అమలుకు నోచుకోని ప్రతిపాదనలు క్రియాశీలకంగా ఉన్నాయా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయనుంది.ఆగస్టు 30న రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 380 ఎకరాల్లో విస్తరించి ఉన్న జూ పార్క్ ఏర్పాటుపై చర్చించారు.
Next Story