
విద్యార్థినులతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య
ఆకస్మిక తనిఖీలతో బడి బాట పట్టిన జిల్లాల కలెక్టర్లు
తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కలెక్టర్లు నడుం బిగించారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పలు జిల్లాల కలెక్టర్లు బడి బాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేస్తూ విద్యార్థులతో కలిసి మాట్లాడుతున్నారు. విద్యార్థులకు వసతి సౌకర్యాలను మెరుగుపర్చడంపై కలెక్టర్లు దృష్టి సారించారు.
సీఎం ఆదేశాలు...
తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు సోలార్ కిచెన్ల సాయంతో మధ్యాహ్న భోజనం తయారు చేయించాలని, పదోతరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచాలని సీఎం సూచించారు.పదవ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను కోరారు
విద్యార్థినులతో కలిసి భోజనం చేసి...
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య జహీరాబాద్ మండలంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థినులను ఆశ్చర్య పర్చారు. పాఠశాలలోని విద్యార్థినులతో కలిసి కింద కూర్చొని వారితో భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వంటగది, ఆహార నాణ్యత, స్టోర్ రూమ్, తరగతి గది అభ్యాసాలను కలెక్టర్ ప్రవీణ్య పరిశీలించారు. వేదికపై కూర్చొవడం, ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా కలెక్టర్ విద్యార్థినులతో కలిసి వారితో అప్యాయంగా మాట్లాడారు.కంది మండల లోని మైనారిటీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ ప్రవీణ్య ఆకస్మికంగా తనికీ చేసి హాస్టల్ వసతులను, ఆహార నాణ్యతను, బోధన విధానాన్ని పరిశీలించారు.
హనుమకొండ జిల్లాలో...
హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి మండల విద్యా వనరుల కేంద్రం (ఎం ఆర్ సి) భవనాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు.విద్యా సంబంధిత అంశాలను ఆన్ లైన్ లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ బాసిత్ నగర్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ విధానం, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం ఆకస్మిక తనిఖీ
మంచిర్యాల్ జిల్లాలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థినులతో మాట్లాడి వారి పఠనా సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఆనందంగా చదువుకోండి : కలెక్టర్ హరిచందన
ఒత్తిడితో కాకుండా, ఇష్టంతో ఆనందంగా చదువు నేర్చుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ హరిచందన గోషామహల్ బాలికల మైనారిటీ పాఠశాల, అనిస్-ఉల్-ఘుర్బా అనాథాశ్రమాలను పరిశీలించారు.విద్యార్థినులకు పోషకమైన భోజనం, హాస్టల్ సంరక్షణ, కంప్యూటర్ ల్యాబ్ యాక్సెస్, నాణ్యమైన బోధనకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు.విద్యార్థినులు పెద్ద కలలు కనేలా, తమను తాము నమ్ముకునేలా ప్రేరేపించాలని కలెక్టర్ కోరారు.
Next Story