సౌదీలో డీఎన్ఏ పరీక్షలు,అంత్యక్రియలకు సన్నాహాలు
x
విమానాశ్రయంలో మదీనా బస్సు ప్రమాద మృతుల కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న మంత్రి అజారుద్దీన్

సౌదీలో డీఎన్ఏ పరీక్షలు,అంత్యక్రియలకు సన్నాహాలు

మదీనా బస్సు ప్రమాద మృతుల అంత్యక్రియలకు సౌదీఅరేబియాలో తెలంగాణ ప్రత్యేక బృందం సన్నాహాలు


మదీనా బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ యాత్రికుల అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. మంత్రి ముహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మదీనాలోనే మకాం వేసి, మృతదేహాల గుర్తింపు నుంచి జన్నతుల్ బఖీలో ఖననం వరకు జరిగే ప్రతి ఏర్పాటును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తోంది.


తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్,మైనారిటీ శాఖ కార్యదర్శి బి షఫియుల్లాలతో కూడిన ప్రతినిధి బృందం మదీనాలో మకాం వేసి మృతుల అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తుంది.తెలంగాణ ప్రతినిధులు జెడ్డాలోని భారత కాన్సుల్ జనరల్ ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి, డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్ లను కలిసి మృతులకు మదీనాలోని జన్నతుల్ బఖీలో అంత్యక్రియలు జరిపించాలని కోరారు.



మృతుల బంధువులకు డీఎన్ఏ పరీక్షలు

మృతుల కుటుంబ సభ్యులకు డీఎన్ఏ పరీక్షలు చేసి మృతదేహాలను గుర్తిస్తున్నామని మంత్రి అజారుద్దీన్ చెప్పారు. ఒక వైపు మృతుల బంధువులకు డీఎన్ఏ పరీక్షలు చేపిస్తూ, మరో వైపు అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తూ తెలంగాణ ప్రతినిధి బృందం బిజీగా ఉంది. మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబసభ్యుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మదీనా వస్తున్న వారికి మంత్రి అజారుద్దీన్ తో పాటు ప్రతినిధి బృందం డీఎన్ఏ టెస్టుకు ఆసుపత్రికి పంపించారు.మదీనా వచ్చిన మృతుల కుటుంబ సభ్యులకు వసతి సౌకర్యాలు కల్పించారు.

మృతుల బంధువులు సౌదీకి పయనం
మదీనా బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబసభ్యులు అయిదుగురు గురువారం తెల్లవారుజామున సౌదీఅరేబియాకు విమానంలో బయలు దేరివెళ్లారు. మృతుల కుటుంబసభ్యులకు పాస్ పోర్టులను పునరుద్దరించాల్సి రావడంతో వీరు ఆలస్యంగా వెళ్లారు. పాస్ పోర్టు సమస్య కారణంగా షౌకత్ అలీ కుమారుడు మన్సుఫ్ అలీ ఆలస్యంగా సౌదీకి బయలుదేరారు. ‘‘నా కుటుంబ సభ్యులు నలుగురు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నా సోదరుడి కుమారుడు బుధవారం సౌదీ అరేబియాకు బయలుదేరగా, పాస్‌పోర్ట్‌లో సమస్య కారణంగా నా ప్రయాణం ఆలస్యం అయింది, పత్రాలను సరిగ్గా ధృవీకరించిన తర్వాత దానిని తిరిగి జారీ చేశారు. నేను గురువారం సౌదీకి బయలుదేరాను.” అని మన్సుఫ్ అలీ చెప్పారు. మృతుల కుటుంబసభ్యులు అయిదుగురికి పాస్ పోర్టులను పునరుద్ధరించి, వీసాలు ఇప్పించి సౌదీకి గురువారం తెల్లవారుజామున 3 గంటల విమానంలో పంపించామని తెలంగాణ హజ్ కమిటీ అధికారి హబీబుద్దీన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.బస్సు ప్రమాదంలో మరణించిన 18 మంది బంధువు వజీద్, ఫర్హానా సుల్తానా సోదరుడు ఇప్పటికే మదీనా చేరుకున్నారు.

జన్నతుల్ బఖీ ప్రాముఖ్యత
మదీనాలోని జన్నతుల్ బఖీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హజ్, ఉమ్రా యాత్రల కోసం సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ మరణిస్తే వారిని మదీనాలోని జన్నతుల్ బఖీలో ఖననం చేస్తుంటారు. ఈ శ్మశానవాటికలో ముహమ్మద్ ప్రవక్త కుటుంబీకులతో పాటు పలువురు ప్రముఖుల సమాధులు జన్నతుల్ బఖీలో ఉన్నాయి. మదీనాలో మరణించిన వారిని జన్నతుల్ బఖీలో ఖననం చేస్తారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారిని జన్నతుల్ బఖీలో ఖననం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి అజారుద్దీన్ చెప్పారు.

కోలుకుంటున్న షోయబ్
మదీనా బస్సు ప్రమాదం నుంచి బయటపడిన అబ్ధుల్ షోయబ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారని అతని బావమరిది షేక్ ఇబ్రహీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. షోయబ్ ను తాము అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి అజారుద్దీన్ చెప్పారు.

తీవ్ర విషాదంలో ఉన్న మదీనా బస్సు ప్రమాద కుటుంబాలకు దౌత్య, పరిపాలన విభాగాలు అండగా నిలుస్తున్నాయి. మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన యాత్రికుల చివరి ప్రయాణం గౌరవప్రదంగా సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతీ అడుగు జాగ్రత్తగా వేస్తోంది.ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధను తీరుస్తారని చెప్పలేనప్పటికీ, ఈ కష్టకాలంలో మృతుల బంధువులకు అండగా నిలవాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు శోకసంద్రంలో ఉన్నవారికి నిలువెత్తు ధైర్యాన్ని ఇవ్వనున్నాయి.


Read More
Next Story