
ఎన్నికల సంఘం వార్నింగులను పార్టీలు లెక్కచేస్తాయా ?
రాజకీయపార్టీల స్వభావాలు, ధ్యేయం తెలియనట్లుగానే ఎన్నికల సంఘం వ్యవహరిస్తుండటం చాలా విచిత్రంగా ఉంది
తెలంగాణఎన్నికలసంఘం రాజకీయపార్టీలకు మార్గదర్శకాలను విడుదలచేసింది. మార్గదర్శకాల్లో పార్టీలకు కమీషన్ అనేక సుద్దులు చెప్పింది. రాజకీయపార్టీల స్వభావాలు, ధ్యేయం తెలియనట్లుగానే ఎన్నికల సంఘం వ్యవహరిస్తుండటం చాలా విచిత్రంగా ఉంది. తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల విషయంలో కమీషన్ మార్గదర్శకాలను జారీచేసింది. ఐఏఎస్ అధికారి హోదాలో దశాబ్దాలుగా వివిధ శాఖల్లో పనిచేసిన రాణికుముదిని ఇపుడు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈమెకు రాజకీయపార్టీల వ్యవహారం తెలీదని అనుకునేందుకు లేదు.
ఇంతకీ కమీషన్ జారీచేసిన మార్గదర్శకాలు ఏమిటంటే ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వకూడదట. మ్యానిఫెస్టోలో నెరవేర్చగల, హేతుబద్దమైన హామీలను మాత్రమే ఇవ్వాలట. హామీలు ఇచ్చేటపుడే వాటిని నెరవేర్చటానికి అవకాశం ఉన్న ఆర్ధిక మార్గాలను కూడా వివరించాలట. ఓటర్లపై అనవసరమైన ప్రభావాన్ని చూపించే వాగ్దానాలను నివారించాలని గట్టిగా హెచ్చరించింది. మార్గదర్శకాల్లో ఇంకా చాలా వార్నింగులున్నాయి కాని వీటిల్లో పార్టీలు ఏ ఒక్కటి కూడా ఫాలో అయ్యే అవకాశాలు లేవని మార్గదర్శకాలు జారీచేసిన ఎన్నికల కమీషనర్ కు కూడా బాగా తెలుసు.
పార్టీలు ఇచ్చే హామీలపై ఎవరైనా కోర్టులో కేసులు వేసే అవకాశాలున్నాయి. పార్టీలు ఆచరణ సాధ్యంకాని హామీలిస్తున్నపుడు ఎన్నికల కమీషన్ ఏమిచేస్తోందని పిటీషనర్లు ఎవరైనా కోర్టు ద్వారా నిలదీయచ్చు. అప్పుడు కోర్టు కూడా విచారణలో ఇదే ప్రశ్నను లేవదీయచ్చు. అందుకనే విచారణలో సమాధానం చెప్పుకోవాల్సొస్తే ముందుజాగ్రత్తగా హెచ్చరికలను జారీచేసిన విషయాన్ని చెప్పుకునేందుకే ఇపుడు మార్గదర్శకాలను జారీచేసినట్లుంది.
నిజానికి స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీలు ప్రత్యేకించి మ్యానిఫెస్టో రిలీజ్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు మెజారిటి సీట్లలో గెలిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండగా లోకల్ బాడీల్లో ప్రతిపక్షాలు గెలిచినా ఆ పార్టీలకు ఉపయోగం ఉండదు. ఇక కాంగ్రెస్ విషయం చూస్తే ఎలాగూ ప్రభుత్వంలో తానే ఉన్నపుడు స్ధానికసంస్ధల ఎన్నికల్లో కొత్తగా మ్యానిఫెస్టో విడుదల చేయాల్సిన అవసరం లేనేలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చితే అదే చాలాగొప్ప.
ఇక మ్యనిఫెస్టో విషయాన్ని చూస్తే ఏపార్టీ చూసినా ఆచరణ సాధ్యంకాని హామీలనే ఇస్తున్నాయి. ఒకవైపు రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోతున్నా, అభివృద్ధి, సంక్షేమపథకాలను అమలుచేయలేకపోతున్నాసరే హామీలప్రకటనకు మాత్రం ఎలాంటి లోటు రానీయటంలేదు. ఒకపార్టీని మించి మరోపార్టీ ప్రజలకు హామీలను గుప్పిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు తాము అధికారంలోకి రావటమే ధ్యేయంగా పార్టీలు హామీల వర్షంలో జనాలను ముంచేస్తున్నాయి. ఎక్కువమంది జనాలు ఏ పార్టీ హామీల వర్షంలో తడిసి ముద్దవుతారో ఆపార్టీకి ఓట్లేసి గెలిపిస్తున్నారు. గద్దెను ఎక్కిన తర్వాత సదరుపార్టీ ఏమిచేస్తుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రఎన్నికలసంఘం జారీచేసిన మార్గదర్శకాలను ఏపార్టీ అయినా పట్టించుకుంటుందా ?