BRS Charge sheet|చార్జిషీటును జనాలు పట్టించుకుంటారా ?
చార్జిషీట్(Charge Sheet) అంటే నిందుతులను కోర్టులో ప్రవేశపెట్టేటపుడు పోలీసులు దాఖలుచేసే సాక్ష్యాధారాల వాస్తవ పత్రం.
ప్రభుత్వ వైఫల్యాలపై ఈనెల 7వ తేదీన చార్జిషీట్ ను విడుదలచేయబోతున్నట్లు బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ప్రకటించారు. ఇదే పద్దతిలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చార్జిషీటును విడుదల చేయబోతున్నారు. హరీష్ ఏమంటారంటే చార్జిషీట్లో రేవంత్ రెడ్డి(Revanthreddy) ప్రభుత్వం నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచుతారట. ప్రజలను వంచించడం, మోసగించటమే రేవంత్ నైజంగా మండిపడ్డారు. ఏడాదిగా ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులు తప్ప సరైన పాలన అన్నదే జరగలేదట. రాష్ట్రంలో రాక్షసపాలన జరగుతోందని మండిపడ్డారు. రేవంత్ ఆణిముత్యాల పేరుతో హరీష్(HarishRao) ఇప్పటికే వీడియో క్లిప్పుంగులను కూడా రిలీజ్ చేశారు.
ఇక్కడ గమనించల్సింది ఏమిటంటే చార్జిషీట్(Charge Sheet) అంటే నిందుతులను కోర్టులో ప్రవేశపెట్టేటపుడు పోలీసులు దాఖలుచేసే సాక్ష్యాధారాల వాస్తవ పత్రం. కోర్టులో ప్రవేశపెట్టిన నిందుతుడు చేసినమోసం లేదా నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలు చార్జిషీట్లో పోలీసులు కోర్టుకు అందిస్తారు. ఒకప్పటి సంగతి తెలీదు కాని ఇప్పుడు పోలీసులు కోర్టుల్లో దాఖలుచేస్తున్న చార్జిషీట్లపై జడ్జీలు చాలాసార్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. చార్జిషీట్లను సవ్యంగా దాఖలుచేయలేదని కొన్ని కేసుల్లో జడ్జీలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి పోలీసులు కోర్టుల్లో దాఖలుచేస్తున్న చార్జిషీట్లలే సవ్యంగా ఉండనపుడు ఇక అదే పేరుతో ప్రతిపక్షాలు అధికారపార్టీపై విడుదలచేసే చార్జిషీట్లను జనాలు నమ్ముతారా ? అసలు పట్టించుకుంటారా ?
ఇపుడు సమస్య ఏమిటంటే ప్రభుత్వం తీసుకునే ప్రతీనిర్ణయాన్నీ వ్యతిరేకించటమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయి. అందుకనే ప్రభుత్వంపై చార్జిషీట్ల పేరుతో ప్రతిపక్షాలు విడుదల చేసే పత్రాలను జనాలు పెద్దగా పట్టించుకోవటంలేదన్నది వాస్తవం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్(BRS) లేదా బీజేపీ(BJP) నేతలు విడుదలచేయబోయే చార్జిఫీట్లను జనాలు పట్టించుకునే అవకాశాలు అయితే లేవు. కాకపోతే చార్జిషీట్ పేరుతో ప్రతిపక్షాలు హడావుడి చేయటం, దానికి మీడియా ప్రయారిటి ఇస్తుండటంతో రెండురోజులు చర్చ జరుగుతుందంతే. బీఆర్ఎస్ రిలీజ్ చేయబోయే చార్జిషీట్లో మూసీనది(Musi River Project) పునరుజ్జీవన ప్రాజెక్టు, హైడ్రా(Hydra) కూల్చివేతలు, లగచర్ల(Lagacharla) భూసేకరణ, దిలావర్ పూర్(Dilawarpur) ఇథనాల్ ఫ్యాక్టరీ, రైతు రుణమఫీ, పంటలకు గిట్టుబాటు ధరలు, ఉద్యోగాల భర్తీ లాంటి అంశాలు ఉండబోతున్నాయి.
కేసీఆర్(KCR) అధికారంలో ఉన్నపుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 వేల ఆక్రమణలున్నట్లు అసెంబ్లీలోనే ప్రకటించారు. ఆక్రమణలన్నింటినీ తొలగించి హైదరాబాదును క్లీన్ హైదరాబాదుగా చేస్తామన్నారు. ఆక్రమణలు చేసిన వారు ఎంతటి బలవంతులైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మాదాపూర్(Madapur) ప్రాంతంలోని అయ్యప్పసొసైటిలో కొన్ని నిర్మాణాలను పొక్లైనర్లు, జేసీబీలను పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చేయించింది. దాంతో రచ్చరచ్చ జరిగి బాధితుల్లో కొందరు కోర్టులో కేసులు వేయటంతో స్టే రావటంతో కూల్చివేతలు నిలిచిపోయాయి. ఇపుడు జలవనరుల పునరుద్ధరణ పేరుతో రేవంత్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటుచేసి ఆక్రమణలను తొలగిస్తోంది. అయితే దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. పరామర్శలపేరుతో బాధుతులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతోందనే ఆరోపణలు మామూలే. తమ హయాంలో ఆక్రమణల తొలగింపుకు సిద్ధపడిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ తదితరులు ఇపుడు అదే పనిని రేవంత్ ప్రభుత్వం చేస్తుంటే తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.
అలాగే మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టును కేటీఆర్ టేకప్ చేశారు. నదిని ప్రక్షాళనచేయటంలో భాగంగా రెండువైపులా ఉన్న ఆక్రమణలు, నిర్మాణాలను తొలగించాల్సిందే అని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎంతమంది అడ్డుపడినా మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆగేదిలేదని ప్రకటించారు. మరిపుడు రేవంత్ ప్రభుత్వం మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రకటించి ఆక్రమణలు, నిర్మాణాలను తొలగిస్తుంటే బాధితులను హరీష్, కేటీఆర్ ఎందుకు రెచ్చగొడుతున్నారు ? రు. 25 వేల కోట్ల అవినీతి జరిగిపోతోందంటు ప్రతిరోజు గగ్గోలు పెడుతున్నారు. తాము అధికారంలో ఉన్నపుడు టేకప్ చేసిన ప్రాజెక్టుకే పేరుమార్చి రేవంత్ ప్రారంభిస్తే దాన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. ఇక దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో అయితే మరీ విచిత్రం. ఫ్యాక్టరీకి అన్నీ అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. యాజమాన్యం ఫ్యాక్టరీ పనులు దాదాపు అయిపోయింది కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే.
ఇథనాల్ ఫ్యాక్టరీని జనాలు ఎంతగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు కేసీఆర్. ఇపుడు ఫ్యాక్టరీ ప్రారంభానికి రెడీ అవటంతో గ్రామస్తులు పెద్దస్ధాయిలో రెచ్చిపోయారు. గ్రామస్తులు, రైతుల ఆగ్రహన్ని గమనించిన ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీ పనులను ఎక్కడికక్కడ నిలిపేసింది. దాంతో కేటీఆర్(KTR) ట్విట్టర్లో ‘జనాల దెబ్బకు తలొంచ్చిన రేవంత్ ప్రభుత్వం’ అని పోస్టు పెట్టారు. ప్రజావ్యతిరేకత ఉన్నా అనుమతులిచ్చింది, ఫ్యాక్టరీ పనులు మొదలైంది తమ హయంలోనే అయితే ఇపుడు రేవంత్ ప్రభుత్వం జనాగ్రహానికి దిగిరావటం ఏమిటో కేటీఆర్ కే తెలియాలి. ఇలాంటి ట్వీట్లతో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ రెచ్చగొడుతోంది. ఇక ఉద్యోగాలభర్తీ విషయంలో బీఆర్ఎస్ వైఫల్యాలగురించి ఎంత తక్కువచెప్పుకుంటే అంతమంచిది. రైతురుణమాఫీ కొందరికి జరిగింది మరికొందరికి జరగాలని ప్రభుత్వమే చెబుతోంది. తమపాలన అద్భుతమని, రేవంత్ పాలన అవినీతిమయమని బీఆర్ఎస్ నేతలు ఆరోపించటం, విమర్శలు చేయటం చాలామామూలే. తమ హయాంలో ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహించిన కేసీఆర్ ఇపుడు అదే ఫిరాయింపులను తట్టుకోలేకపోతున్నారు.
ఇక, నరేంద్రమోడీ(NarendraModi) పాలనలోని లోపాలను సమర్ధించుకుంటు రాష్ట్రంలో రేవంత్ పాలన చెత్తని కిషన్ రెడ్డి, బండిసంజయ్, కమలంపార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. తెలంగాణా అభివృద్ధికి కేంద్రం పదిలక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని చెబుతున్న కిషన్(Kishan) చేసిన ఖర్చును శాఖలవారీగా వివరించటంలేదు. మూసీపునరుజ్జీవన ప్రాజెక్టులో ఆక్రమణలు, నిర్మాణాలను తొలగించటాన్ని తప్పుపడుతున్న కిషన్ రెడ్డి గంగానది(Ganga River) ప్రక్షాళన, సబర్మతి నది(Sabarmati River) ప్రక్షాళన జరిగిన పద్దతిలోనే తాము మూసీనది ప్రక్షాళన చేస్తున్నట్లు రేవంత్ చెబుతున్న సమాధానికి కిషన్ బదులివ్వటంలేదు. ప్రజలు నమ్ముతారా ? పట్టించుకుంటారా అన్న దానితో సంబంధంలేకుండా రాద్దాంతం చేయటానికే ప్రతిపక్షాలు అబద్దాలతో చార్జిషీట్ల హడావుడి చేస్తేన్నారంటు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతాయి. గతంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చార్జిషీట్లను విడుదలచేసిన విషయాన్ని మహేష్ మరచిపోయినట్లున్నారు. మరి 7వ తేదీన చార్జిషీట్లో హరీష్ ఏమి చెబుతారో చూడాల్సిందే.