ఐదుగురు కొత్త ఎంఎల్సీల గురించి తెలుసా ?
x
5 MLCs from Telangana

ఐదుగురు కొత్త ఎంఎల్సీల గురించి తెలుసా ?

నామినేషన్లు వేసిన ఐదుగురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎంఎల్సీలుగా ఎన్నికైనట్లు 13వ తేదీ సాయంత్రం కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటిస్తేనే అధికారికమవుతుంది


తాజాగా నామినేషన్లు దాఖలుచేసిన ఐదుగురు నేతలు ఎంఎల్సీలు అయిపోయినట్లే. అయిపోయినట్లే అన్నది ఎందుకంటే ఉన్నది ఐదుసీట్లు. నామినేషన్లు వేసింది కూడా ఐదుమందే. అంటే నామినేషన్లు వేసిన ఐదుగురు నేతలు ఎంఎల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. నామినేషన్లు వేసిన ఐదుగురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎంఎల్సీలుగా ఎన్నికైనట్లు 13వ తేదీ సాయంత్రం కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటిస్తేనే అధికారికమవుతుంది కాబట్టి. ఎంఎల్ఏల కోటాలో మార్చి 29వ తేదీతో ఐదుగురు ఎంఎల్సీల పదవీ కాలం పూర్తవుతుంది. వారిస్ధానాలను భర్తీ చేయటానికి ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ఇవ్వటం, పార్టీలు అభ్యర్ధులను ఎంపికచేయటం, వారు 10వ తేదీన నామినేషన్లు వేయటం అందరికీ తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ తరపున అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి ఎంఎల్సీలు కాబోతున్నారు. సీపీఐ తరపున నెల్లికంటి సత్యంయాదవ్, బీఆర్ఎస్ అభ్యర్ధిగా దాసోజు శ్రవణ్ నామినేషన్లు వేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఎంఎల్సీలు అవబోతున్న ఐదుగురిలో నలుగురు నల్గొండ జిల్లాకు చెందిన వారే. మూడుపార్టీల తరపున ఒకేసారి నలుగురు నేతలు ఒకే జిల్లా నుండి ఎంఎల్సీలు కాబోతుండటం బహుశా ఇదే మొదటిసారేమో. విజయశాంతిది వరంగల్ జిల్లా. ఇపుడు ఒక్కొక్కరుగా ఎంఎల్సీల నేపధ్యాన్ని చూద్దాం.

శంకర్ నాయక్(కాంగ్రెస్-ఎస్టీ)

కేతావత్ శంకర్ నల్గొండ జిల్లా దామచర్ల మండలంలోని దిలావర్ పూర్ లో ఏప్రిల్ 4, 1972లో పుట్టారు. 1998లో దామచర్ల మండల అధ్యక్షుడుయ్యారు. తర్వాత 2001లో మండల జడ్పీటీసీగా పోటీచేశారు. ఆ తర్వాత 2006-11 మధ్య మండల ఎంపీపీగా పనిచేశారు. 2011-14 మధ్య బ్లాక్ కాంగ్రెస్(Congress) అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో జడ్పీటీసీగా రెండోసారి పోటీచేసి గెలిచారు. 2014-19 మధ్య జిల్లా కాంగ్రెస్ ప్రణాళికా సభ్యుడిగా పనిచేశారు. ఇదేసమయంలో 2016-19 మధ్య మిర్యాలగూడ సిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 2018లో నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన శంకర్ పార్టీకి బాగా నమ్మకస్తుడైన కారణంగా ఇపుడు ఎంఎల్సీగా అవకాశం దక్కింది.

అద్దంకి దయాకర్(కాంగ్రెస్-ఎస్సీ)

సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు మండలం నమ్మినకల్ గ్రామంలో 1971లో పుట్టారు. మొదటినుండి ప్రత్యేక తెలంగాణ వాదం వినిపించిన అద్దంకి 2001 నుండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ(Telangana) ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ లో చేరారు. నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుండి 2014, 2018లో రెండుసార్లు ఓడిపోయారు. 2023లో టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అలాగే వరంగల్ ఎంపీగా టికెట్ ఇస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చినా చివరకు టికెట్ ఇవ్వలేకపోయింది. అందుకనే ఇపుడు ఎంఎల్సీగా అవకాశం ఇచ్చింది.

విజయశాంతి (కాంగ్రెస్-బీసీ)

ప్రముఖ సినీనటి విజయశాంతి(Vijayasanthi) 1966, జూన్ 2వ తేదీన వరంగల్ లో పుట్టినా పెరిగిందంతా చెన్నై(Chennai) . సినీనేపధ్యమున్న(Telugu Movies) కుటుంబం కావటంతో సులభంగానే సినిమాల్లో ప్రవేశించారు. సినిమాల్లో రిటైర్ అయ్యే సమయం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో 1998లో బీజేపీ(BJP)లో చేరారు. తర్వాత ఆ పార్టీలో నుండి బయటకు వచ్చేసి సొంతంగా 2005లో తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఆ పార్టీని 2009లో టీఆర్ఎస్(BRS) లో విలీనం చేశారు. వెంటనే వచ్చిన ఎన్నికల్లో మెదక్ పార్లమెంటుకు పోటీచేసి గెలిచారు. ఎంపీగా గెలిచిన తర్వాత కేసీఆర్(KCR) తో పడని కారణంగ 2013లో పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. వెంటనే కాంగ్రెస్ లో చేరి 2014 మెదక్ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. 2020లో బీజేపీలో చేరి అందులో ఇమడలేక 2023లో రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. నిజానికి ఈమె కాంగ్రెస్ కు చేసిన సేవలు ఏమీ లేకపోయినా అదృష్టం కారణంగా అధిష్ఠానం ఎంఎల్సీగా అవకాశమిచ్చింది.

దాసోజు శ్రవణ్(బీఆర్ఎస్-బీసీ)

1966లో నల్గొండలో పుట్టారు. విద్యార్ధి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే దాసోజు పవన్ కల్యాణ్ సూచనతో 2008లో ప్రజారాజ్యంలో చేరారు. 2009లో ప్రజారాజ్యంపార్టీ నుండి సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పీఆర్పీ విధానంతో విభేదించి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో అంతర్గత కారణాలతో 2014లో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చురుకుగా పనిచేస్తున్న దాసోజు 2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలో ఇమడలేక రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే ఎక్కువకాలం బీజేపీలో ఉండలేక 2022లో మళ్ళీ బీఆర్ఎస్ లో చేరారు. 2023లో దాసోజును కేసీఆర్ ఎంఎల్సీగా నియమించినా సాంకేతిక కారణాలతో పార్టీ అధికారంలో నుండి దిగిపోవటంతో చెల్లలేదు. ఇంతకాలానికి మళ్ళీ దాసోజుకు బీఆర్ఎస్ ఎంఎల్సీగా అవకాశమిచ్చింది.

నెల్లికంటి సత్యం(సీపీఐ-బీసీ)

నెల్లికంటి సత్యం యాదవ్ మొదటినుండి సీపీఐలోనే ఉన్నారు. నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి చెందిన సత్యం స్ధానికంగా గట్టిపట్టున్న నేత. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపుకు మిత్రపక్షంగా సీపీఐ తరపున క్రియాశీలకంగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో జరిగిన ఒప్పందంలో భాగంగా ఒకస్ధానాన్ని కాంగ్రెస్ కేటాయించింది. ఆ సీటులోనే ఇపుడు సత్యం ఎంఎల్సీగా నామినేషన్ దాఖలు చేశారు.

Read More
Next Story