ఎన్ కన్వెన్షన్ ఎంత ఖరీదైనదో తెలుసా ? కోట్ల రూపాయల బిజినెస్
ఇన్ని కార్యక్రమాలకు ఉపయోగపడుతున్న కన్వెన్షన్ సెంటర్లోకి మధ్యతరగతి జనాలకు ప్రవేశం నిషిద్ధం. అంటే మధ్యతరగతి జనాలను లోపలకు రానీయరని కాదు అర్ధం.
గంటల వ్యవధిలో నేలమట్టమైపోయిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు బాగా ఖరీదైన నేపధ్యమే ఉంది. కన్వేన్షన్ సెంటర్ అక్కినేని నాగార్జునదనే ప్రచారం విస్తృతంగా ఉంది. అయితే కన్వెన్షన్ సెంటరుకు నాగార్జున వ్యాపార భాగస్వామి మాత్రమే. అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి నల్లా ప్రీతమ్ రెడ్డితో కలిసి నాగార్జున 2010లో తుమ్మిడికుంట చెరువులో కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారు. ఈ కన్వెన్షన్ సెంటర్లో పెళ్ళిళ్ళు, ఫ్యాషన్ షోలు, వ్యాపార కార్యక్రమాలు, బోర్డు మీటింగులు, ఎగ్జిబిషన్లు జరుగుతుంటాయి. ఇన్ని కార్యక్రమాలకు ఉపయోగపడుతున్న కన్వెన్షన్ సెంటర్లోకి మధ్యతరగతి జనాలకు ప్రవేశం నిషిద్ధం. అంటే మధ్యతరగతి జనాలను లోపలకు రానీయరని కాదు అర్ధం. మధ్యతరగతి జనాలు ఆహ్వానితులుగా లోపలకు అడుగుపెట్టగలరే కాని ఏ కార్యక్రమాన్ని నిర్వహించుకోలేరు.
ఎందుకంటే ఈ సెంటర్ అందరికీ అందుబాటులో ఉండదు. ఇందులో ఏ కార్యక్రమం అయినా చేయాలంటే లక్షల్లో అద్దె చెల్లించాల్సిందే. ఫంక్షన్ను బట్టి గంటలు లేదా రోజులెక్కన అద్దె వసూలుచేస్తారు. ఇంత తక్కువ వేసుకున్నా పెద్ద హాళ్ళ రోజు అద్దె రు. 5 లక్షలుంటుంది. మాదాపూర్ అంటే హైదరాబాదుకు సెంటర్ అని అందరికీ తెలిసిందే. అత్యంత ఖరీదైన ప్రాంతాలన్నింటికీ మాదాపూర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. అలాంటి మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఫంక్షన్ జరుపుకోవటం చాలామంది ప్రిస్టేజిగా ఫీలవుతుంటారు. లోపల ఇన్టీరియర్ డెకరేషన్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. 3.30 ఎకరాల్లో ఎన్ 3 ఎంటర్ ప్రైజెస్ పేరుతో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్లో మొత్తం నాలుగు భారీ హాళ్ళున్నాయి.
27 వేల చదరుపు అడుగుల్లో భారీగా ఉండే సెంటర్ హాలులో వివాహాలు, ఫ్యాషప్ షోలు, పెద్ద పెద్ద కంపెనీల కార్యక్రమాలు, అత్యంత ప్రముఖుల ఇళ్ళల్లో వివాహాలు, సినిమా ఫంక్షన్లు జరుగుతుంటాయి. ఇందులో ఒకేసారి 3 వేలమంది కూర్చోవచ్చు. ఈ సెంటర్ కు ఆనుకునే ఓపెన్ ఎయిర్ పద్దతిలో మరో 37 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అందుబాటులో ఉండేది. ఇందులో కూడా రకరకాల ఫంక్షన్లు చేసుకునే వారు. డైమెండ్ హాలు పేరుతో 5 వేల చదరపు అడుగుల హాలు మరోటుండేది. 500 సీటింగ్ కెపాసిటితో చిన్నపాటి వివాహాలు, పుట్టిన రోజులు, కంపెనీ ఉత్పత్తుల ఆవిష్కరణలు జరిగేవి. చివరగా ఓపెన్ ఎయిర్ వెన్యు అని 26 వేల చదరుపు అడుగుల స్ధలముండేది. దీనికి పక్కనే 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనెక్స్ హాలుండేది.
ఏ హాలు తీసుకున్నా, ఓపెన్ ఎయిర్లో ఫంక్షన్ చేసుకున్నా డెకరేషన్ మాత్రం అదిరిపోయేట్లుండేది. అత్యంత అధునాతనంగా నిర్మించిన హాళ్ళు, వాటికి అనుకునే మూడు వైపులా చెరువుండేది. ఒకవైపు సైబరాబాద్, మరోవైపు గుట్టల మధ్యలో తుమ్మడికుంట చెరువుండేది. ఒకపుడు 29 ఎకరాల్లో ఉన్న తుమ్మిడికుంట చెరువు 19 ఎకరాలు కబ్జాకు గురై ఇపుడు 10 ఎకరాలకు కుచిచుంకుపోయింది. కబ్జాచేసి నిర్మించిన వాటిల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఒకటి. పైన చెప్పిన నాలుగు హాళ్ళు లేదా ఓపెన్ ఎయిర్లో కార్యక్రమాలను చేసుకోవటాన్ని చాలా ప్రిస్టేజియస్ గా ఫీలయ్యేవాళ్ళు. కంపెనీలు ఫంక్షన్ చేయాలని అనుకున్న తేదీన సెంటర్లో ఏ హాలు ఖాళీ లేకపోతే ఫంక్షన్లను వాయిదా వేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయని సమాచారం.
ఈ కన్వెన్షన్ సెంటర్ డిమాండు ఏ స్ధాయిలో ఉండేదంటే తక్కువలో తక్కువ మూడు నెలలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు వచ్చి ఫంక్షన్ చేసుకోవాలంటే ఫంక్షన్ చేసుకునేవాళ్ళకి అదృష్టం ఉంటే తప్ప సాధ్యమయ్యేది కాదు. అంత డిమాండుతో నడిచే కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కేవలం నాలుగు గంటల్లోనే నేలమట్టం చేసేసింది. శాటిలైట్ ఇమేజెస్ లో తుమ్మడికుంటచెరువును ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ను నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే కన్వెన్షన్ సెంటర్ కోసం తాను ఒక్క అంగుళం కూడా చెరువును ఆక్రమించలేదని నాగార్జున ఎలాగ చెబుతున్నారో అర్ధంకావటంలేదు. 3.30 ఎకరాల కన్వెన్షన్ సెంటర విస్తీర్ణంలో 1.12 ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్), 2.18 ఎకరాలు బఫర్ జోన్లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే రెండు విధాలుగానే నాగార్జున చెరువును ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు అర్ధమవుతోంది.
సెంటర్లోని హాలు అద్దె రోజుకు 5 లక్షల రూపాయలంటే పెద్ద హాళ్ళు+చిన్నవి+ఓపెన్ ఎయిర్ అద్దె అంతా కలిపి తక్కువలో తక్కువ 20 లక్షల ఆదాయం వచ్చేది. రోజుకు రు. 20 లక్షలంటే నెలకు రు. 6 కోట్లు. నెలకు రు. 6 కోట్ల ఆదాయం అంటే ఏడాదికి రు. 72 కోట్లు. నిర్వహణ, సిబ్బంది జీత, బత్యాల కోసం ఏడాదికి రు. 7 కోట్లు తీసేసినా నెట్టుగా యాజమాన్యానికి రు. 65 కోట్లు మిగిలేది. ఇన్ని కోట్లరూపాయల ఆదాయం తెచ్చే సెంటర్ నిర్మాణానికి నాగార్జున గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పర్మీషన్ కూడా తీసుకోలేదని ఇపుడు వార్తలు వినబడుతున్నాయి. దర్జాగా కబ్జాచేసి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారం సంవత్సరాలుగా అధికారులకు తెలీకుండానే ఉంటుందా ?